
అల్లు అర్జున్ ప్రస్తుతం ఐకాన్ స్టార్‌గా రాణిస్తున్నారు. `గంగోత్రి` చిత్రంతో హీరోగా పరిచయమై ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ఇమేజ్‌ని దాటి గ్లోబల్ స్టార్ ఇమేజ్ వైపు వెళ్తున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఆ రేంజ్ మూవీ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్‌గా సూపర్ హీరో కంటెంట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన వర్క్ జరుగుతుంది. త్వరలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే బన్నీ హీరోగా పరిచయం కావాల్సింది మూవీ `గంగోత్రి` కాదు. మరో బ్లాక్ బస్టర్‌తో ఆయన వెండితెరకు హీరోగా పరిచయం కావాల్సింది. కానీ తెరవెనుక కుట్ర జరిగింది. మొదట బన్నీతో ప్రకటించి, ఆ తర్వాత మరో హీరోని తెరపైకి తీసుకొచ్చారు ఆ చిత్ర దర్శకుడు. అలా బన్నీ బ్లాక్ బస్టర్‌ని మిస్ చేసుకున్నారు. ఆ కథేంటో చూస్తే.
అల్లు అర్జున్ హీరోగా పరిచయం కావాల్సిన మూవీ `జయం`. నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో ఈ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మొదట అనుకున్న హీరో అల్లు అర్జున్. ఈ విషయం ఇండస్ట్రీలో పెద్దలందరికి తెలుసు. తేజ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పరిచయం అవుతున్నారని అందరికి చెప్పారు. ముందు ఓ పార్టీ కూడా ఇచ్చారు. చిన్నికృష్ణతోపాటు చాలా మంది ప్రముఖులు ఈ పార్టీకి హాజరయ్యారు. అందరు బన్నీకి అభినందనలు తెలిపారు. బన్నీ పరిచయం మంచి దర్శకుడితో, బ్లాక్ బస్టర్ మూవీతో కాబోతుందని అంతా భావించారు.
కట్ చేస్తే సినిమా అనౌన్స్ మెంట్ రోజు హీరో మారిపోయారు. బన్నీ స్థానంలో నితిన్ వచ్చారు. నితిన్ హీరోగా `జయం` సినిమాని తీస్తున్నట్టు తేజ ప్రకటించారు. ప్రెస్ మీట్ కూడా పెట్టారు. రాత్రికి రాత్రే చాలా మారిపోయింది. ఏకంగా హీరోనే మారిపోయారు. తెరవెనుక ఒక కుట్ర జరిగిందని, అది ఇండస్ట్రీలో అందరికి తెలిసిందే అని షాక్ ఇచ్చారు రైటర్ చిన్నికృష్ణ. తేజ బన్నీని కాకుండా నితిన్‌ని హీరోగా పరిచయం చేసినప్పుడు తాను చాలా డిజప్పాయింట్ అయినట్టు తెలిపారు. అల్లు అర్జున్ హీరోగా పరిచయం కావాల్సింది కదా అని ఆశ్చర్యపోయారట. తెరవెనుక జరిగిన విషయాలను బయటపెట్టని చిన్నికృష్ణ.. తేజ ప్రకటనతో తనతోపాటు చాలా మంది షాక్ అయ్యారని, మెగా అభిమానులు చాలా నిరాశ చెందారని వెల్లడించారు.
ఆ సమయంలోనే బన్నీ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌కి ఫోన్ చేసి.. అరవింద్‌గారు మీరు నిశ్చింతగా ఉండండి. ఏడాది లోపు మీ అబ్బాయితో సినిమా తీసి, విడుదల చేస్తాను, పెద్ద దర్శకుడితోనే ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చారట. మాట ఇవ్వడమే కాదు, కె రాఘవేంద్రరావుతో `గంగోత్రి` మూవీని సెట్ చేశానని, ఇది ఆయన వందవ మూవీ అని, చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని సినిమా చేసినట్టు తెలిపారు చిన్నికృష్ణ. ఆ సమయంలో తాను రాస్తున్న రజనీకాంత్ మూవీని పక్కన పెట్టి `గంగోత్రి`పై వర్క్ చేసినట్టు చెప్పారు. చెప్పినట్టుగానే ఏడాదిలోపు మూవీ తీసి విడుదల చేశామని, ఇది 175రోజులు ఆడిందని, పశ్చిమ గోదావరి వంటి సెంటర్లలో `ఇంద్ర` రికార్డులను బ్రేక్ చేసిందని తెలిపారు చిన్నికృష్ణ. ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తంగా బన్నీ `జయం`తో హీరోగా పరిచయం కావాల్సింది, `గంగోత్రి`తో పరిచయం అయ్యారు. నిజానికి `జయం` బన్నీకి పడితే అదిరిపోయేది.
ఇక నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన `జయం`లో సదా హీరోయిన్‌గా నటించింది. గోపీచంద్ విలన్‌గా నటించారు. ఈ మూవీ 2002లో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. నితిన్‌కి, సదాకి బెస్ట్ ఇంట్రడక్షన్‌గా నిలిచింది. ఇందులోని పాటలు ఎవర్ గ్రీన్. ఇప్పటికీ ఆకట్టుకుంటాయి. కథ, మ్యూజిక్ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. సినిమాని పెద్ద హిట్ చేశాయి. అయితే ఆ తర్వాత అనేక హిట్లు అందుకున్న నితిన్.. ఇటీవల మాత్రం స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన వరుసగా పరాజయాలు ఫేస్ చేస్తున్నారు. తనతోపాటు పరిచయం అయిన బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా రాణిస్తుండగా, నితిన్ మాత్రం హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. సరైన కంటెంట్‌తో, సాలిడ్‌గా కమ్ బ్యాక్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.