
సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు భాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే పెద్ద హీరోలంతా ఈ సీజన్ లోనే రావాలని ఆశిస్తారు. తమిళ, తెలుగులో ఈ సంక్రాంతి సినిమా ట్రెండ్ చాలా కాలంగా నడుస్తోంది. పెద్ద పోటీ ఉంటుంది. దాంతో సంక్రాంతిని దృష్టిలో పెట్టుకుని సినిమా పనులు పూర్తి చేసి రిలీజ్ కు రెడీ చేస్తూంటారు.
అలా ఈ ఏడాది సంక్రాంతికి రామ్ చరణ్(Ram Charan) ‘గేమ్ ఛేంజర్’, బాలకృష్ణ (Balakrishna) ‘డాకు మహారాజ్’ తో పాటు వెంకటేష్ (Venkatesh ) ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు విడుదల కాబోతున్నాయి.
అలాగే ఈ సినిమాలతో పాటు తమిళ్ స్టార్ హీరో అజిత్ (Ajith) సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉంటుందంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. ముందుగా మైత్రి మూవీ మేకర్స్ వారు అజిత్ హీరోగా నిర్మిస్తున్న ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నారు.
కానీ కొన్ని కారణాలవల్ల రెండు నెలల క్రితమే ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయలేమని మైత్రి నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. దాంతో అజిత్ మరో చిత్రం 'విడాముయార్చి' ముందుకు వచ్చింది. కానీ ఇప్పుడు ఆ సినిమా కూడా రిలీజ్ కావటం లేదని తేలిపోయింది.
తమిళ స్టార్ హీరో అజిత్ అప్‌కమింగ్ మూవీ 'విడాముయార్చి' సంక్రాంతి బరిలో నుంచి వైదొలిగనట్లు తాజాగా మేకర్స్ వెల్లడించారు. 'కొన్ని అనుకోని కారణాల వల్ల 'విడాముయార్చి'ని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయలేకపోతున్నాం. త్వరలోనే మరో కొత్త విడుదల తేదీని ప్రకటిస్తాం' అంటూ నిర్మాణ సంస్థ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే హఠాత్తుగా ఇంత మంచి సంక్రాంతి సీజన్ ని వదులుకోవటానికి కారణం ఏమిటనేది చర్చగా మారింది.
తమిళ మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు 'విడాముయార్చి' సినిమా రీమేక్ రైట్స్ విషయంలో న్యాయపరమైన చిక్కుల్లో పడినట్టుగా తెలుస్తోంది. అజిత్ నటించిన 'విడాముయార్చి' మూవీ 'బ్రేక్ డౌన్' అనే హాలీవుడ్ సినిమాకు రీమేక్ అనే వార్తలు గత కొంతకాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమా నిర్మాతల నుంచి ''విడాముయార్చి' మేకర్స్ అధికారిక రీమేక్ రైట్స్ ను కొనుగోలు చేయలేదని తెలుస్తోంది.
రైట్స్ తీసుకోకపోవటంతో బ్రేక్ డౌన్ చిత్రం రైట్స్ కలిగి ఉన్న పారామౌంట్ స్టూడియోవారు ఈ విషయంలో లీగల్ నోటీసు పంపారని, దాంతో బేరసారాలు జరుగుతున్నాయని వినికిడి. అయితే పారామౌంట్ వారు అడుగుతున్న రేట్ కు, లైకా వాళ్లు అంత ఇవ్వలేమంటున్నారని తెలుస్తోంది.
'విడాముయార్చి' మేకర్స్ 127 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ 'బ్రేక్ డౌన్' మేకర్స్ నోటీసులు పంపించినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా ఈ వార్తలపై 'విడాముయార్చి' చిత్ర నిర్మాతలు స్పందించలేదు. అయితే నిజంగానే అజిత్ కుమార్ నటించిన ఈ చిత్రం లీగల్ ట్రబుల్స్ లో చిక్కుకుందా అనేది తెలియాల్సి ఉంది.
'విడాముయర్చి' విషయానికి వస్తే, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాగిజ్ తిరుమేని తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఇందులో అజిత్‌తో పాటు త్రిష నటించగా, అర్జున్, రెజీనా తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. తాజాగా విడుదలైన సాంగ్ కూడా బాగా పాపులర్ అయ్యింది. అయితే గత కొన్ని రోజుల వరకూ ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు మూవీ టీమ్ ప్రకటించింది. కానీ తాజాగా దీన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
మరోవైపు అజిత్ ఈ ప్రాజెక్ట్ కాకుండా 'గుడ్ బ్యాడ్ అగ్లీ' అనే ద్విభాష చిత్రంలోనూ నటిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్నఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. తాజగా విడుదల చేసిన పోస్టర్లు అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలే పెంచాయి. దీంతో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ తెగ ఎదురుచూస్తున్నారు.