అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప2 ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అల్లు అర్జున్ వన్ మ్యాన్ షోతో ఫ్యాన్స్‌ను ఖుషీ చేశారు. ఇక హీరోయిన్ రష్మిక సైతం తన అందం, అభినయంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..
పుష్ప2 జైత్రయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓ వైపు ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా, కలెక్షన్ల సునామి మాత్రం కొనసాగుతూనే ఉంది. కేవలం తెలుగులో మాత్రమే కాకుండా దేశంలో విడుదలైన అన్ని భాషల్లో పుష్ప2 వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా రూ. 1600 కోట్ల గ్రాస్ రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. భారత్‌లోనే ఈ సినిమా ఏకంగా రూ. 1029.65 కోట్లకుపైగా రాబట్టింది.
ఇక హిందీలో పుష్ప రాజ్ హవా మాములుగా లేదు. హిందీ నెట్ కలెక్షనల్లో పుష్ప2 అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 16 రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా రూ. 645 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును నెలకొల్పింది. బాలీవుడ్‌లో ఆల్‌టైమ్ రికార్డును పుష్ప2 సొంతం చేసుకోవడం విశేషం. ఒక తెలుగు సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ స్థాయిలో చరిత్ర సృష్టించడం ఇదే తొలిసారి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమా విజయంలో సుకుమార్ దర్శకత్వం, అల్లు అర్జున్ నటనతో పాటు రష్మిక నటన కూడా కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమాలో తన అందంతో పాటు అభినయంతో కూడా మెస్మరైజ్ చేసింది. సాంగ్స్‌లో ఎనర్జిటిక్ స్టెప్పులతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ముఖ్యంగా పీలింగ్స్ పాటలో బన్నీ, రష్మికల మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్‌లో వర్కవుట్ అయ్యింది. అయితే ఈ పాట షూటింగ్ సమయంలో తాను కాస్త అసౌకర్యంగా ఫీలయ్యానని రష్మిక తెలిపింది.
ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక ఈ విషయమై మాట్లాడుతూ.. పీలింగ్స్ రిహార్సల్ వీడియో చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపోయానని, అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చేశాను అని మురిసిపోయానని తెలిపింది. అయితే తనను ఎవరైనా ఎత్తుకుంటే భయమేస్తుందని తెలిపిన రష్మిక.. ఈ పాటలో బన్నీ తనను ఎత్తుకుని స్టెప్ వేసే సన్నివేశం విషయంలో మొదట అసౌకర్యంగా ఫీలైనట్లు చెప్పుకొచ్చింది. కానీ బన్నీ, సుకుమార్ ఆ ఇబ్బంది నుంచి బయటపడేశారని, ఒక్కసారి ఆయన్ను నమ్మాక అదేమంత ఇబ్బందిగా అనిపించలేదని, షూటింగ్ అంతా ఫన్‌గా జరిగిపోయిందని రష్మిక మనసులో మాటను తెలిపింది.
ఓటీటీపై క్లారిటీ
థియేటర్లలో పుష్ప2 హవా ఇంకా కొనసాగుతోన్న నేపథ్యంలోనే పుష్ప2 ఓటీటీకి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుష్ప2 ఓటీటీ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తుందనే వార్త తెగ చక్కర్లు కొట్టింది. దీంతో ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది చిత్ర యూనిట్. పుష్ప2 ఓటీటీ సంబంధించి వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో 56 రోజుల్లోపు ఓటీటీ విడుదల ఉండదని తేల్చి చెప్పేసింది. ఇక క్రిస్మస్, సంక్రాంతి సెలవుల్లోనూ పుష్ప 2 సినిమాను థియేటరల్లో చూడాలని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సీజన్‌కు పెద్దగా పోటీనిచ్చే సినిమాల విడుదల లేకపోవడంతో పుష్ప2 కలెక్షన్లు మరింత పెరగడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.