జమున సినిమా ఎంట్రీ వెనుక మహానటి సావిత్రి హస్తం.. ఈ వెండితెర సత్యభామ తొలి చిత్రమేంటో తెలుసా?

First Published Jan 27, 2023, 9:37 AM IST

వెండితెరపై తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిన జమున సినిమాల్లోకి రావడానికి మహానటి సావిత్రి కారణమనే విషయం తెలుసా? మరి అది ఎలా జరిగింది, వీరిద్దరికి ఎలా పరిచయం అనేది చూస్తే.. 

వెండితెరపై సత్యభామగా మెరిసిన జమున హఠాన్మరణం టాలీవుడ్‌ని విషాదంలో నింపింది. అనారోగ్యంతో ఆమె శుక్రవారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగిందనేది ఆసక్తి కరంగా మారింది. ఆమె సినీ రంగంలోకి రావడానికి వెనుక మహానటి సావిత్రి ఉండటం విశేషం. 

కర్నాటకలోని హంపిలో బ్రహ్మణ కుటుంబంలో జన్మించింది జమున. వ్యాపారవేత్త అయిన నిప్పని శ్రీనివాసన్ రావు, కౌశల్యదేవి అనే వైశ్య దంపతులకు 1936 ఆగష్టు 30న జన్మించింది. చిన్నప్పుడు ఆమెని జాన్‌ బాయి అని పిలిచేవారు. ఆమె రెబల్‌గా ఉండటంతో అలా పిలిచేవారట. అయితే పుట్టింది కర్నాటకలో అయినా, పెరిగింది మాత్రం ఏపీలోనే, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాలలో పెరిగింది జమున. 
 

మరి సినిమా రంగంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చిందనేది చూస్తే, మహానటి సావిత్రి కెరీర్ ప్రారంభంలో సినిమాలతోపాటు నాటకాల ప్రదర్శనలు కూడా ఇచ్చేవారనే విషయం తెలిసిందే. దుగ్గిరాలలో ప్రదర్శన ఇచ్చే సమయంలో ఆమె జమున ఇంట్లోనే ఉన్నారట. అలా జమునతో పరిచయం ఏర్పడింది. ఒకే ఏజ్‌ కావడంతో పరిచయం స్నేహంగా మారింది. అయితే సావిత్రినే.. జమునని సినిమాల్లోకి రావాలని ఆహ్వానించారట. సినిమా ఇండస్ట్రీ గురించి చెప్పి ఆమెని మోటివేట్‌ చేసిందట. 
 

జమున అందమైన రూపానికి కేరాఫ్‌. సినిమాల్లో అలాంటి అందమైన అమ్మాయిలు కావాలి. అలాంటి వారికి మంచి భవిష్యత్‌ ఉంటుంది. అవకాశాలు వస్తాయి. జమున అందెగత్తే కావడంతో సావిత్రి ఎంకరేజ్‌ చేశారట. అలా నెమ్మదిగా నాటకాలు, అట్నుంచి సినిమా ఎంట్రీ జరిగింది. జమున స్కూల్లో స్టేజ్ పెర్ఫార్మర్. ఆమె తల్లి జమునకు సంగీతం, హార్మోనియం నేర్పింది. డా. గరిపతి రాజారావు తన స్టేజి షో మా భూమిని చూసి 1952 లో ఆమె `పుట్టిల్లు` చిత్రంలో నటించడానికి ఆఫర్ ఇచ్చారు. అలా ఆమె 14 సంవత్సరాల వయసులో హీరోయిన్‌గా సినిమాల్లోకి ప్రవేశించింది.
 

సినిమాల్లోకి వచ్చాక జమున అతికొద్ది సమయంలోనే బిజీ హీరోయిన్‌ అయిపోయింది. అద్భుతమైన అభినయం పలికిస్తూ మెప్పిస్తుండటం, అందంగా ఉండటంతో ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ వంటి హీరోల సరసన నటించే అవకాశాలు వరించాయి. ఇలా `దొంగరాముడు`, `మిస్సమ్మ`, `చిరంజీవులు`, `ముద్దుబిడ్డ`, `భాగ్యరేఖ`, `భూకైలాస్`, `ఇల్లరికం`, `గుండమ్మ కథ`, `బొబ్బిలి యుద్ధం`, `మూగ మనసులు`, `రాముడు భీముడు`, `మంగమ్మ శపథం`, `తోడూనీడా`, `పూలరంగడు`, `రాము`, `మట్టిలో మాణిక్యం`, `పండంటి కాపురం`, `దొరికితే దొంగలు`, `తాసిల్దార్ గారి అమ్మాయి` వంటి చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు సరైన జోడిగా జమున ఎన్నో చిత్రాల్లో నటించింది. అలాగే హరనాథ్, కృష్ణంరాజు, కృష్ణ వంటి హీరోలతోనూ జత కట్టింది.
 

తన అద్భుతమైన అభినయంతో పలు అవార్డులు సొంతం చేసుకున్న జమున ప్రొఫెసర్ జూలూరి రమణారావును వివాహం చేసుకున్నారు. వారికి వంశీ, స్రవంతి అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వంశీ మీడియా ప్రొఫెసర్ గా శాన్ ఫ్యాన్సిస్కో లో పని చేస్తున్నారు. శ్రవంతి కి పెళ్లయింది. కూతురు, మనవడి తో కలిసి ఆమె ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంటున్నారు. జమున 1989 లో కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి లోక్ సభ నియోజకవర్గంకు ఎంపీగా ఎన్నికయ్యారు. 1991 లో అక్కడ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆపై బిజెపిలో చేరారు. చాలా రోజులుగా రాజకీయాలకు, నటనకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 
 

తెలుగులోనే కాదు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో నటించి మెప్పించారు. ఆల్మోస్ట్ తొలితరం స్టార్‌ హీరోలందరితోనూ కలిసి నటించింది జమున. తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా, హీరోలకు దీటుగా నిలిచిన కథానాయికగా పేరుతెచ్చుకుంది. రెబల్‌ యాటిట్యూడ్‌తో పలు వివాదాల్లోనూ నిలిచింది జమున. ఆమె మరణం టాలీవుడ్‌కి తీరని లోటుని చెప్పొచ్చు. 

click me!