స్టార్ హీరోల సినిమాలు రిలీజైతే వేరే హీరోల అభిమానులు నెగిటివ్ కామెంట్స్ చేయడం సహజం. సినిమా నిజంగా బాగాలేకపోతే సొంత అభిమానులు కూడా ట్రోల్ చేస్తారు. కానీ సెలెబ్రిటీలు మాత్రం స్టార్ హీరోల చిత్రాలు బాగాలేదు అని చెప్పే సాహసం చేయరు. సెలెబ్రిటీలే నెగిటివ్ కామెంట్స్ చేస్తే కాంట్రవర్సీ అవుతుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నటుడు ఒకరు పవన్ కళ్యాణ్ సినిమా విషయంలో వివాదంలో చిక్కుకున్నారు.
పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్ డిజాస్టర్ చిత్రాల్లో కొమరం పులి ఒకటి. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. దీనికితోడు ఆ సమయంలో తెలంగాణ ఉద్యమం కూడా సాగుతోంది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. అయితే మూవీ రిలీజ్ అయిన వెంటనే టాలీవుడ్ ప్రముఖ నటుడు సమీర్ తన సోషల్ మీడియాలో బ్యాడ్ కామెంట్స్ చేస్తూ పోస్ట్ పెట్టారు.
కొమరం పులి చిత్రం దరిద్రంగా ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి హీరోని పెట్టుకుని పనికిమాలిన సినిమా చేశారు అంటూ సమీర్ తీవ్రమైన నెగిటివ్ కామెంట్స్ చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద రచ్చే జరిగింది. ఇది గమనించిన మెగా బ్రదర్ నాగబాబు వెంటనే సమీర్ కి ఫోన్ చేసి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారట. ఈ విషయాన్ని సమీర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు.
నాగబాబు గారితో, మెగా ఫ్యామిలీతో నాకు మంచి అనుబంధం ఉంది. నాగబాబు గారు ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేశారు. నువ్వు మా ఇంట్లో మనిషివే అని అనుకుంటున్నాం. ఇలాంటి పోస్ట్ పేట్టావేంటి ? నువ్వేమైనా జర్నలిస్ట్ అనుకుంటున్నావా అంటూ విపరీతంగా తిట్టేశారు. ఆయన తిట్టడం అయ్యాక.. లేదన్నయ్యా నేను కళ్యాణ్ గారి గురించి ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. కళ్యాణ్ గారి సినిమాని చెడగొట్టారు అనే బాధతోనే ఆ పోస్ట్ పెట్టాను అని చెప్పా. ఏదైనా కానీ నీ పోస్ట్ చూసి 20 మంది ఆగిపోయినా నిర్మాతకి నష్టమే కదా అని తిట్టారు. దీనితో వెంటనే ఆ పోస్ట్ ని డిలీట్ చేశా.
మళ్ళీ మధ్యాహ్నం ఒక ఫోన్ వచ్చింది. కళ్యాణ్ గారి దగ్గర ఉండే నర్రా శ్రీనివాస్ ఫోన్ చేశారు. కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా ఉన్నారు. నువ్వు ఊరు వదిలి ఎక్కడికైనా పారిపో అని భయపెట్టాడు. నేనేమి తప్పుగా పోస్ట్ పెట్టలేదు. బాధపడుతూ పెట్టా అని అతడికి కూడా చెప్పా.నన్ను బయపెట్టాడని కళ్యాణ్ గారే సరదాగా అలా మాట్లాడించారు. వెంటనే కళ్యాణ్ గారు ఫోన్ తీసుకుని ఒకసారి ఇంటికి రా అని పిలిచారు. ఏంటి ఏదో రాశావంట అని అడిగారు. జరిగింది చెప్పా. సరే ఒకసారి ఇంటికి రా అని పిలిస్తే.. అన్నయ్య నాకు భయంగా ఉంది ఇప్పుడు రాలేను అని చెప్పినట్లు సమీర్ తెలిపారు. ఆ తర్వాత సమీర్.. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే.