వెంటనే ఆమె రజినీకాంత్ దగ్గరకు పరుగెత్తుకెళ్లి, 'నన్ను క్షమించండి. దయచేసి క్షమించండి. మీరు ఎవరో నాకు నిజంగా తెలియదు' అని వేడుకుంది. అప్పుడు రజినీకాంత్ ఆ మహిళతో 'అమ్మా, మీరు నన్ను క్షమించమని అడగకండి. నిజానికి ఇది దేవుడే నాకు గుర్తుచేస్తున్న ఒక అద్భుతమైన పాఠం. నా అసలు స్వరూపం ఏంటో దేవుడు మీ ద్వారా నాకు తెలియజేశాడు. దేవుడి ముందు మనమందరం బిచ్చగాళ్లమే. ఆయన దర్బారులో మన యోగ్యత, అంతస్తు, డబ్బు దేనికీ విలువ లేదు. అందరూ ఒక్కటే' అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ, 'నాకు ఎలాంటి అహంకారం, గర్వం రాకుండా ఆపడానికే దేవుడు మీ ద్వారా నాకు సందేశం ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ 10 రూపాయలు నాకు కేవలం డబ్బు కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం' అని చెప్పారు. ఆ మహిళ ఇచ్చిన 10 రూపాయల నోటును చివరి వరకు తన దగ్గరే భద్రంగా ఉంచుకుంటానని చెప్పారు. ఇప్పటికీ ఆ 10 రూపాయల నోటు రజినీకాంత్ దగ్గర ఓ పవిత్రమైన జ్ఞాపకంగా ఉంది.