
ఒకప్పుడు వంద కోట్లు కలెక్ట్ చేయడమంటే గొప్ప. కానీ ఇప్పుడు చిన్న సినిమాలు కూడా వంద కోట్లు ఈజీగా దాటేస్తున్నాయి. అంతేకాదు రెండు, మూడు వందల కోట్ల కలెక్షన్లు కూడా అవలీలగా దాటుతున్నాయి. ఆడియెన్స్ ని ఆకట్టుకునే కంటెంట్ ఉంటే కలెక్షన్లకి లిమిట్ లేదు. అదే సమయంలో సరైన కంటెంట్ లేని వందల కోట్ల సినిమాలు కూడా వంద కోట్లు రాబట్టడానికి నానా తంటాలు పడుతున్నాయి. అయితే కంటెంట్‌లో దమ్మున్న చిత్రాలు ఐదు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు కూడా ఈజీగా వసూళు చేస్తున్నాయి. ఈ గురువారం రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు విడుదలయ్యాయి. రజనీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ వంటి వారు కలిసి నటించిన `కూలీ`, ఎన్టీఆర్, హృతిక్ కలిసి నటించిన `వార్ 2` చిత్రాలు ఆడియెన్స్ ముందుకు వచ్చాయి.
అయితే ఇప్పటి వరకు తెలుగు నుంచి, కన్నడ నుంచి, హిందీ నుంచి వెయ్యి కోట్లకుపైగా వసూళ్లని రాబట్టిన చిత్రాలున్నాయి. కానీ కోలీవుడ్ నుంచి ఒక్క మూవీ కూడా లేదు. ఇప్పుడు `కూలీ` ఆ టార్గెట్‌ని చేరుకుంటుందా? ఆ రికార్డుని బ్రేక్ చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారిన నేపథ్యంలో ఇప్పటి వరకు వెయ్యి కోట్లు దాటిన సినిమాలెన్ని, అవేంటి? ఏ భాష నుంచి ఎన్ని సినిమాలున్నాయనేది ఓ సారి చూద్దాం.
వెయ్యి కోట్ల క్లబ్‌లో కాదు, ఏకంగా రెండు వేల కోట్ల క్లబ్‌లో చేరిన తొలి సినిమా అమీర్ ఖాన్ నటించిన `దంగల్`. నితీష్ తివారి రూపొందించిన ఈ సినిమా 2016లో విడుదలైంది. బయోగ్రఫీ స్పోర్ట్స్ డ్రామాగా ఇది రూపొంది సంచలన విజయం సాధించింది. అయితే ఈ సినిమా ఇండియాలో కంటే చైనాలో ఎక్కువ కలెక్షన్లని వసూలు చేసింది. ఇండియాలో ఐదు వందల కోట్లు వసూలు చేస్తే, ఓవర్సీస్‌లో రెండు వందల కోట్లు రాబట్టింది. అయితే కొంత గ్యాప్ తర్వాత చైనా, తైవాన్‌లో రిలీజ్ చేశారు. అక్కడ ఇది సుమారు రూ.1300కోట్లు రాబట్టడం విశేషం.
2017లో `బాహుబలి 2` వచ్చింది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ, నాజర్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఇండియాలోనే రూ.1430కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది. ఇండియన్ బాక్సాఫీసుని షేక్ చేసింది. అన్ని రికార్డులను తిరగరాసింది. ఇండియాలో వెయ్యి కోట్లు దాటిన తొలి సినిమాగా నిలిచింది. ఓవర్సీస్‌లో ఇది రూ.380కోట్లు రాబట్టింది. ఫైనల్‌గా ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ.1810 కోట్లు రాబట్టింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప 2` సైతం గతేడాది డిసెంబర్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఏకంగా రూ. 1705కోట్లు వసూలు చేసింది. అయితే మరికొన్ని నివేదికల ప్రకారం ఈ సినిమా రూ.1870కోట్లు వసూలు చేసిందని సమాచారం. ఏదేమైనా వెయ్యి కోట్లు దాటిన చిత్రంగా నిలిచింది.
రాజమౌళి దర్శకత్వంలోనే రూపొందిన మరో మూవీ `ఆర్‌ఆర్‌ఆర్` సైతం వెయ్యి కోట్లు దాటింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ 2022లో విడుదలైంది. ఏకంగా రూ.1280కోట్లు రాబట్టింది. అలాగే `నాటు నాటు` పాటకి ఆస్కార్‌ని కూడా సొంతం చేసుకుంది. ఆస్కార్ సాధించిన తొలి ఇండియన్ మూవీగా నిలిచింది.
తెలుగు నుంచి వెయ్యి కోట్లు దాటిన మరో సినిమా ప్రభాస్ నటించిన `కల్కి 2898 ఏడీ`. నాగ్ అశ్విన్ రూపొందించిన ఈ సినిమాలో ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనె, శోభన ముఖ్య పాత్రలు పోషించారు. దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, ఆర్జీవీ, రాజమౌళి గెస్ట్ రోల్స్ చేశారు. ఏడాది క్రితం వచ్చిన ఈ మూవీ కూడా రూ.1275కోట్లు రాబట్టింది.
కన్నడ నుంచి వెయ్యి కోట్లు దాటిన సినిమాగా `కేజీఎఫ్ 2` నిలిచింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో యష్ హీరోగా నటించారు. 2022లో `ఆర్‌ఆర్‌ఆర్` విడుదలైన కొన్ని రోజుల్లోనే `కేజీఎఫ్2` రిలీజ్ అయిన ఈ సినిమా సైతం బాక్సాఫీసు ని షేక్ చేసింది. రూ.1220కోట్లని సాధించింది. వెయ్యి కోట్లు దాటిన తొలి కన్నడ మూవీగా నిలిచింది.
బాలీవుడ్ లో `దంగల్` తర్వాత వెయ్యి కోట్లు దాటిన మూవీగా షారూఖ్‌ఖాన్ `పఠాన్` నిలిచింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో షారూఖ్ తోపాటు దీపికా పదుకొనె నటించింది. స్పై యాక్షన్ మూవీగా 2023లో విడుదలైన ఈ మూవీ ఏకంగా రూ.1050కోట్లు వసూళు చేసింది.
2023లోనే మరో మూవీ `జవాన్`తో సంచలన విజయాన్ని అందుకున్నారు షారూఖ్ ఖాన్. అట్లీ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, దీపికా పదుకొనె హీరోయిన్లుగా నటించగా ఈ మూవీ కూడా విశేషంగా ఆదరణ పొందింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా రూ.1148కోట్లు రాబట్టింది. బాలీవుడ్ నుంచి వెయ్యి కోట్లు రాబట్టిన మూడో సినిమాగా నిలిచింది. ఇలా టాలీవుడ్ నుంచి నాలుగు సినిమాలు, బాలీవుడ్ నుంచి మూడు సినిమాలు, కన్నడ నుంచి ఒక్కటి వెయ్యి కోట్లు దాటిన సినిమాలున్నాయి. తమిళం నుంచే ఒక్క చిత్రం కూడా లేదు. మలయాళ మూవీస్ మార్కెట్ చిన్నది. వాటి నుంచి ఆ స్థాయిని ఆశించలేం.
తమిళ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు వెయ్యి కోట్లకు ఏ మూవీ చేరలేదు. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన `కూలీ` చిత్రం నుంచి ఆశిస్తున్నారు. వెయ్యి కోట్ల మూవీ అంటూ ఇప్పటికే ప్రచారం జరిగింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ గురువారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ డివైడ్ టాక్ వస్తోంది. ఓపెనింగ్స్ భారీగానే వచ్చే ఛాన్స్ ఉంది. కానీ లాంగ్ రన్‌లో ఈ మూవీ వెయ్యి కోట్లు దాటుతుందా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. క్రిటిక్స్, ట్రేడ్ వర్గాల అభిప్రాయం ప్రకారం ఈ సినిమా వెయ్యి కోట్లు రాబట్టడం కష్టమే అని తెలుస్తోంది. కోలీవుడ్ సినీ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్న వెయ్యికోట్ల టార్గెట్‌ని `కూలీ` రీచ్ అవుతుందా? ఎప్పటిలాగే అది కలగానే మిగిలిపోతుందా అనేది చూడాలి.