
జనసేన పార్టీ గుర్తు కేటాయింపుపై గుడ్ న్యూస్ వచ్చేసినట్లే. ఆ పార్టీకి పూర్తి రిలీఫ్ లభించింది. అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ గాజు గ్లాసు సింబల్ విషయంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న వివాదానికి త్వరలోనే తెరపడినట్లే. తాజా ఎన్నికల్లో జనసేన సాధించిన ఓటింగ్‌తో గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి ఈసీ శాశ్వతంగా కేటాయించనుంది. త్వరలోనే దీనిపై కీలక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాస్’ను ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చుతూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఏపీలో ఎన్డీయే కూటమి పార్టీలను కలవరానికి గురిచేసిందనే చెప్పాలి. జనసేన అభ్యర్థులు పోటీలో లేని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు ఈ సింబల్‌ను కేటాయించనుండంతో కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు ఆందోళన చెందాయి.
జనసేన అభ్యర్థి అనుకొని ఇతరులకు ఓట్లు వేసే అవకాశం ఉంటుందని కూటమి నేతలు టెన్షన్ పడ్డాయి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసింది. మిగతా స్థానాల్లో టీడీపీ, బీజేపీ అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో జనసేన అభ్యర్థులు పోటీలో లేనిచోట్ల ఫ్రీ సింబల్‌గా గాజు గ్లాసు నష్టం చేయవచ్చునని కూటమి పార్టీల నేతలు ఆందోళన చెందుతున్నట్టు కథనాలు వచ్చాయి. అయితే ఈ పరిష్కారానికి జనసేన పార్టీ చివరి వరకూ ప్రయత్నం చేసింది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం.. ఏదైనా రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు మొత్తం పోలైన ఓట్లలో 6 శాతం సాధించాల్సి ఉంటుంది. నిర్దేశిత శాతంలో ఓట్లతో పాటు కనీసం 2 సీట్లలోనైనా ఆ పార్టీ అభ్యర్థులు గెలవాల్సి ఉంటుంది. అప్పుడే ఆ పార్టీకి ప్రాంతీయ పార్టీ గుర్తింపు లభిస్తుంది.
అయితే 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 6 శాతం ఓట్లు సాధించినప్పటికీ 2 సీట్లు సాధించలేకపోయింది. ఫలితంగా ఆ పార్టీ తన గుర్తును కోల్పోవాల్సి వచ్చింది. గతంలో బద్వేలు, తిరుపతి లోక్‌సభకు జరిగిన ఉప ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తును ఇతరులకు ఎన్నికల సంఘం కేటాయించింది. తాజా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం కూటమి పార్టీ నాయకులు, శ్రేణులను ఆందోళనకు గురిచేసింది. అయితే ఇప్పుడు సీన్ మారింది.
పవన్ కల్యాణ్ నాయకత్వంలోని జనసేన పార్టీ ఏపీ ఎన్నికల్లో మహత్తర విజయాలు నమోదు చేసింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాలకే పరిమితమైన ఆ పార్టీ... అనూహ్య రీతిలో పోటీ చేసిన ప్రతి చోటా విజయదుందుభి మోగించింది.
ఓటమన్నదే లేని రీతిలో 21 అసెంబ్లీ స్థానాలకు 21... రెండు ఎంపీ స్థానాలకు రెండు ఎంపీ స్థానాల్లో గెలిచి రాజకీయ విశ్లేషకులకు సైతం షాక్ ఇచ్చింది. తద్వారా 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించింది.
దాంతో గతంలో సరైన ఎన్నికల ప్రాతినిధ్యం లేకపోవడం, ఎన్నికల ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండడం వంటి కారణాలను చూపి గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ గా పేర్కొన్న ఎన్నికల సంఘం... ఈసారి గాజు గ్లాసును జనసేనకు శాశ్వతం చేయనుంది.
రూల్ ప్రకారం ఓ పార్టీకి శాశ్వత గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాలి. కనీసం రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటు గెలవాలి. కానీ, తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేసిన జనసేన.. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ సీట్లలోనూ విజయం సాధించింది.
ఇక జనసేన మొత్తంగా 8.53 శాతం ఓట్ షేర్‌ను దక్కించుకుంది. మరోవైపు జనసైనికులు ప్రభుత్వంలో పవన్‌కల్యాణ్‌కు కీలక పదవి ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాతో పాటు కీలక మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఏదైమైనా ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్‌న్యూస్.