
ఈ సంవత్సరం ఆఖరులో వచ్చిన ఈ చిత్రంకు పబ్లిసిటీ ఎక్కువగా వివాదంతోనే జరిగింది. పాజిటివ్ గానో,నెగిటివ్ గానో జనాల నోట్లో బాగానే నలిగింది. మీడియా కూడా హాట్ టాపిక్ గా ఈ సినిమాకు ప్రయారిటీ ఇస్తూ వచ్చింది. అలాగే ట్రైలర్ బాగుంది. దాంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. బ్రిటీష్ కాలం నాటి కథ ,పీరియాడిక్ లుక్ కావటం, క్రైమ్ థ్రిల్లర్ కావటంతో ఓ వర్గం వాళ్లు ఖచ్చితంగా ఓ సారి చూద్దామనుకుంటారు. అయితే థియేటర్ లో చూస్తారా,ఓటిటిలో చూస్తారా అనేది రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. మరి ఈ సినిమా వెంటనే థియేటర్స్ కు పరుగెత్తించి చూసేయాలి అనిపించే రీతిలో ఉందా లేక మెల్లిగా ఓటిటిలో వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లు ఉందా... అసలు కథేంటి వంటి విషయాలు చూద్దాం.
కథా నేఫధ్య కాలం 1945. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీలోని రాసపాడు గ్రామం. అక్కడ జమీందారు కూతురు విజయ (అభిరామి) హత్య జరుగుతుంది. పాలేరు మాయం అవుతారు. అయితే కూతుర్ని హత్య చేశారన్న ఆరోపణల మీద జమీందారుని అరెస్ట్ చేస్తారు. అసలు ఎవరు ఈ హత్య చేసారు. అందుకు కారణం ఏమిటి అనే ఈ కేసును చేధించేందుకు బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ డెవిల్ (కళ్యాణ్ రామ్) ని ప్రభుత్వం పంపుతుంది. అక్కడికి వెళ్లిన డెవిల్ కు ఈ కేసులో జమీందారు మేనకోడలు నైషధ (సంయుక్త మీనన్)పై అనుమానం. ఆమెను ఇన్విస్టిగేట్ చేసే క్రమంలో ఆమెతో ప్రేమలో పడతాడు. ఇదిలా జరుగుతూండగానే “Operation Tiger Hunt.”అనే కొత్త మిషన్ ని డెవిల్ కు అప్పచెప్తుంది ప్రభుత్వం..అదేమిటీ అంటే...
ఆ స్వతంత్ర ఉద్యమరోజుల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటే బ్రిటీష్ ప్రభుత్వానికి భయం. తమకు పెద్ద అడ్డంకిగా తయారైన ఆయన్ను పట్టుకోవాలని బ్రిటీష్ ప్రభుత్వం నానా రకాలుగా ట్రై చేస్తుంది. ఈలోగా ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) చీఫ్ నేతాజి సుభాష్ చంద్రబోస్ ఇండియాకు వస్తున్నట్టు, ఆ మిషన్‌ను బాధ్యతను త్రివర్ణకు అప్పగించినట్టు బ్రిటిష్ ప్రభుత్వానికి (కోడ్) సమాచారం అందుతుంది. ఆ కోడ్‌ను డీకోడ్ చేసే బాధ్యతను డెవిల్‌కు అప్పగిస్తారు. అప్పుడే డెవిల్ కు సంభందించిన ఓ షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి... ఓ ప్రక్క మర్డర్ కేసు...మరో ప్రక్క సుభాష్ చంద్రబోస్ పట్టుకునేందుకు ప్రయత్నాలు ఈ రెండు డెవిల్ సమర్దవంతంగా చేయగలిగాడా..అసలు మర్డర్ కేసుకు, బోస్‌ను పట్టుకునే మిషన్‌కు ఉన్న లింక్ ఏంటి? ఇంతకీ త్రివర్ణ ఎవరు? మణిమేఖల (మాళవిక నాయర్) పాత్ర ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఇలాంటి historical fiction కథలకు స్టోరీ వరల్డ్ బిల్డింగ్ చాలా ముఖ్యం. గత కాలంలో రియల్ టైమ్ పీరియడ్ లో జరిగే ఫిక్షన్ కథలను ఈ ఫార్మాట్ లో చెప్తారు. వీటికి ప్రత్యేకమైన జాగ్రఫీ అవసరం. కథ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ నుంచి ఎక్కడికి ట్రాన్స్ ఫార్మ్ అవుతుందనేది సహజంగా అనిపిస్తేనే పండుతాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు మంచి మార్కులే పడతాయి. ఆ కష్టం ప్రతీ డిపార్టమెంట్ పడింది. చరిత్రలో ఓ మూవ్ మెంట్ ని ఎంచుకుని దాని చుట్టూ అల్లిన కథ అయ్యినప్పుడు అప్పటి కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు...అప్పటి జనాల ఆలోచనలు సైతం ప్రతిబించాలి. ఇది బ్రిటీష్ టైమ్ లో స్వతంత్ర్య ఉద్యమం నేపధ్యం కూడా కలిగి ఉంది. అలాగని దేశభక్తి మీద వెళ్లకుండా అప్పటి క్రైమ్ ని చూపించే ప్రయత్నం చేయటం కొత్తగా అనిపించింది. అయితే ఏ కథ అయితే చెప్తున్నారో అది కాకుండా వేరే వాటికి ప్రయారిటి ఇచ్చారు.
అలాగే హిస్టారికల్ ఫిక్షన్ రాసుకునేటప్పుడు... కొత్త ఫిక్షన్ క్యారక్టర్స్ ని అయినా బలంగా నిజంగా అప్పట్లో ఉన్నయా అన్నట్లు రాసుకోవాలి లేదా..ఆల్రెడీ లో ఉన్న హిస్టరీ ఫిగర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ క్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఎంచుకోవటం మంచి ఆలోచన. ఆయన జీవితంలో చాలా మిస్టరీ ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకునే కల్పిత కథ రాసుకున్నారు. ఈ క్రమంలో ఫస్టాఫ్ లో ఎక్కువ భాగం సెటప్ కే కేటాయించటంతో చాలా స్లోగా , ఇంట్రస్ట్ లేకుండా సాగుతుంది. ఇంట్రవెల్ ముందు దాకా కథ వేడెక్కదు. దానికి తోడు అడ్డొచ్చే పాటలు. సెకండాఫ్ లో అసలైన కథలోకు వెళ్తాము.
అక్కర్లేని డిటేల్స్ ఇవ్వట,అవకాసం లేని చోట కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ ఇరికించటం,సాదా సీదాగా అనిపించే కొన్ని విషయాలను గ్లామరైజ్ చేయటం జరిగింది. ఆర్టిస్టిక్ లైసెన్స్ తీసుకోవచ్చు కానీ ఆ క్రమంలో మరీ టేకిట్ గ్రాంటెడ్ గా కథ చెప్పినా ఇబ్బందే. అదే జరిగింది కొంతవరకూ. అలాగే ఇలాంటి ఇన్వెస్టగేషన్ థ్రిల్లర్ లో ఒకొక్క ముడి వీడినప్పుడు ఆ ట్విస్ట్ లకు టర్న్ లకు మనం థ్రిల్ అవ్వాలి. అయితే ఇక్కడ అంత అనిపించదు..క్యాజువల్ గా అనిపిస్తుంది. అయితే ఈ కథ లో మెచ్చుకునే ఎలిమెంట్స్ కూడా చాలా వున్నాయి. రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ కాకుండా కొత్తగా చెప్పాలనే ప్రయత్నం..పీరియడ్ బ్యాక్ డ్రాప్. హింసకు శృతిమించని రక్తపాతం, అశ్లీలతకు తావు లేకుండా సీన్స్ మలిచారు. 'డిటెక్టివ్ బ్యూమకేష్ భక్షి' స్ఫూర్తి ని కళ్యాణ్ రామ్ డ్రసింగ్ డిజైన్ దాకానే తీసుకున్నట్లున్నారు. ఏవి ఎలా ఉన్నా అచ్చ తెలుగు సినిమా సంప్రదాయం అన్నట్లు క్లైమాక్స్ లో బ్రిటీష్ సైన్యాన్ని కళ్యాణ్ రామ్ ఊచకోత కోత కోసే సీన్స్ మాత్రం కాస్త ఇబ్బందే. అలాంటివి కాస్త ప్రక్కన పెట్టాల్సింది.
ఈ సినిమాలో ఫస్ట్ హైలెట్ గా చెప్పుకోవాల్సింది సౌందర్య రాజన్ అందించిన సినిమాటోగ్రఫీ . బ్రిటిష్ కాలం నాటి రోజులను రీ క్రియేట్ చేయడంలో విజువల్ గా ఆయన పడిన కష్టం కనిపిస్తుంది. రీసెంట్ గా యానిమల్ తో దుమ్ము రేపిన హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన మ్యూజిక్ ఆ స్దాయిలో లేదు కానీ ఉన్నంతలో బాగా ప్లస్ అయ్యింది. మిస్టీరియస్ గా అనిపించే కొన్ని ట్విస్ట్ లు బాగున్నాయి కానీ వాటి ఎగ్జిక్యూషన్ ఆ స్జాయిలో లేదు. ఎడిటర్ తమ్మి రాజు ఇంకాస్త షార్ప్ చేస్తే కొంత లాగ్ తగ్గేది. ఫస్టాఫ్ లెంగ్త్ తగ్గించవచ్చు అనిపించింది. యాక్షన్ సీన్స్ లో విఎఫ్ ఎక్స్ వర్క్ కూడా రిచ్ గా లేదు. కొన్ని చోట్ల తేలిపోయినట్లు అనిపించింది. లైటింగ్ కలర్ గ్రేడింగ్ బాగుంది. ఆ కాలానికి తీసుకెళ్లటంలో ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగా కనిపిస్తుంది.
. కళ్యాణ్ రామ్ షెర్లాక్ హోమ్ మార్క్ హీరోయిజంతో స్పై పాత్రలో ఒదిగిపోయాడు .యాక్షన్ పంచడంతో పాటు ఎమోషన్ సన్నివేశాల్లో తన నటన ఆకట్టుకుంటుంది. సంయుక్తా మీనన్ సినిమాకు ప్రాధాన్యత ఉన్న పాత్రే. అందంగా ఉంది. మాళవిక నాయర్ పాత్ర చిన్నదైనా ఫెరఫెక్ట్ ఆప్షన్. రమణ పాత్రలో చక్రపాణి ఆనంద, శంకరన్నగా ఉత్తేజ్, పట్వారీగా అజయ్ తమ పాత్రల పరిధి మేరకు బాగా చేసారు. ఇంకా హరితేజ, ఎస్తేరా తదితరులు తమకు ఇచ్చిన చిన్న చిన్న పాత్రల్లో ఆకట్టుకొన్నారు.
Positives:
👉కళ్యాణ్ రామ్ ఫెరఫార్మెన్స్
👉 BGM
👉ప్రొడక్షన్ వాల్యూస్
👉ఆర్ట్ డిపార్టమెంట్,కాస్ట్యూమ్స్
👉సౌందర్య రాజన్ విజువల్స్
👉స్క్రీన్ ప్లే ప్లాట్ గా సాగటం
👉 చాలా చోట్ల కథకు సంభంధం లేని కమర్షియల్ మెరుపులు,
👉 ల్యాగ్ సీన్స్
👉 క్లైమాక్స్
ఫైనల్ థాట్
#Devil సర్పైజ్ లు పెద్దగా ఇవ్వని ఇన్విస్టిగేటివ్ థ్రిల్లర్, ప్లాట్ నేరేషన్ కథలో బ్యూటీని మసకబారేలా చేసింది. పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా చూస్తే బాగుందనిపిస్తుంది. అద్బుతం కాదు తీసిపారేసేది కాదు. ఓ సారి చూడచ్చు.
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.25
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్తా మీనన్, మాళవికా నాయర్, సీత, 'స్వామి రారా' సత్య, అజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా
ఛాయాగ్రహణం: సౌందర్ రాజన్!
సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్!
నిర్మాణం, దర్శకత్వం: అభిషేక్ నామా!
విడుదల తేదీ: డిసెంబర్ 29, 2023