అమరావతి: రాజధానిని అమరావతిలోనేకొనసాగించాలని కోరుతూ ఎర్రబాలెంలో రైతులు చేస్తున్న దీక్షకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకలకు దూరంగా వున్న ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా రైతుల దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి తన చేతి గాజులను రాజధాని రైతుల ఉద్యమానికి విరాళంగా అందించారు. దీనిపై టిడిపి వర్గాలు ప్రశంసలు కురిపిస్తుండగా అధికార వైసిపి నాయకులు మాత్రం ఇందంతా చంద్రబాబు మరో నాటకమని ఆరోపిస్తున్నారు.
ఈ విషయంపై స్పందిస్తూ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దంపతులకు రైతులపై అంత ప్రేముంటే ముందుగా వారినే కలిసేవారని... అలాకాకుండా ముందుగా విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని తాపీగా కలిసేవారు కాదన్నారు. దీన్నిబట్టే వారికి రైతులపై ఎంత ప్రేముందో అర్థమవుతుందన్నారు.
నారా భువనేశ్వరి రైతులకు గాజులివ్వడం కాదని.. భూములివ్వాలని బొత్స డిమాండ్ చేశారు. తనను చూసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి భయపడేవారని చంద్రబాబు చెబుతున్నారని అది తనకు ఆశ్చర్యంగా అనిపిస్తోందన్నారు. 5 కోట్ల మంది ఆంధ్రుల్లో ఏ ఒక్కరిని అడిగినా ఈ ప్రశ్నకు సమాధానం సరైన సమాధానం చెబుతారని బొత్స సెటైర్లు వేశారు.
నారా భువనేశ్వరి రాజధాని రైతుల కోసం తన బంగారు గాజులు విరాళంగా ఇవ్వడంపై డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి స్పందించారు. తన కుటుంబ సభ్యులు సహా పార్టీ నాయకులు, సహచరులు రాజధాని పేరుమీద చేసిన అక్రమాలు బయటకొస్తున్నాయన్న ఆందోళనతో చంద్రబాబు నూతన సంవత్సరం రోజే మరో నూతన డ్రామా చేశారని విమర్శించారు.
కుటుంబ సభ్యులను కలుపుకుని మరో నటనకు తెరలేపారంటూ డిప్యూటీ సీఎం మండిపడ్డారు. రాజధాని ఉద్యమానికి తన వంతు విరాళం అన్నట్టుగా ఆయన భార్యచేత గాజులు ఇప్పించారని ఎద్దేవా చేశారు. అయితే ఇవ్వాల్సింది గాజులు కాదని.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ పేరుతో పప్పుబెల్లాల మాదిరిగా చవగ్గా కొట్టేసిన రైతుల భూములు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
''భువనేశ్వరి గారు... మీ కంపెనీ హెరిటేజ్ పేరుతో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడి 14.22 ఎకరాల భూమిని చవగ్గానే కొట్టేశారు. దయచేసి 14 ఎకరాలను తిరిగి ఆ రైతులకు ఇచ్చేయండి. ఇవాళ మీరిచ్చే గాజులకన్నా.. ఆ రైతుకు కలిగిన నష్టం వందల రెట్లు పెద్దది'' అని భువనేశ్వరిని డిప్యూటీ సీఎం శ్రీవాణి నిలదీశారు.
ఇక ఈ విమర్శలను టిడిపి నాయకులు కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. గత 20 సంవత్సారాలకుపైగా పైగా ఎలాంటి ఆరోపణలు లేకుండా హెరిటేజ్ సంస్ధను పారదర్శకంగా నడుపుతూ..మహిళాలోకానికి ఆదర్శమైన నారా భువనేశ్వరిని పుష్ప శ్రీవాణి విమర్శించటం విడ్డూరంగా ఉందని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత అన్నారు.
బోగస్ సర్టిఫికెట్లతో ఎస్టీ అని చెప్పుకొని ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి నారా భువనేశ్వరి విమర్శించే నైతిక అర్హత లేదన్నారు. టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత అన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్ గురించి మాట్లాడుతున్న పుష్ప శ్రీవాణికి దాని అర్ధం తెలుసా? హెరిటేజ్ భూములకు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలకు అసలు సంబందం లేదన్నారు. హెరిటేజ్ సంస్ధ తన కంపెనీ విస్తరణ దృష్ట్యా రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో భూములు కొనాలని 2014 మార్చిలోనే హెరిటేజ్ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు.
మరో టిడిపి మహిళా నాయకురాలు పంచుమర్తి అనురాధ కూడా భువనేశ్వరిపై పుష్ఫ శ్రీవాణి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తన భర్త సీఎంగా పనిచేసిన కాలంలో కూడా భువనేశ్వరి మొదటి నుంచి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఉపముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తులు అవమానకరంగా మాట్లాడటం దారుణమన్నారు.
రాజధాని రైతుల కన్నీరు చూసి నారా భువనేశ్వరి నూతన సంవత్సరం వేడుకను పక్కనబెట్టి మహిళలకు సంఘీభావం తెలియజేయాలనే సంకల్పంతో రాజధానికి రావడం జరిగిందన్నారు. ఈ పర్యటనలో భాగంగానే చేతి గాజులు విరాలళంగా ఇవ్వడం జరిగిందన్నారు. పుష్ప శ్రీవాణి ఇకనైనా ఆ టిక్ టాక్ వీడియోలు చేయడం మనేసి వాస్తవాలను తెలుసుకుని మాట్లాడితే మంచిదని హెచ్చరించారు.