ఇలా ఆడితే టీమిండియా ప్రపంచకప్ గెలవదు.. గంగూలీ షాకింగ్ కామెంట్స్

First Published Sep 23, 2022, 3:26 PM IST

Sourav Ganguly: టీమిండియా  వరుస ఓటములపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆందోళన వ్యక్తం చేశాడు. ఒకరిద్దరు ఆడితే విజయాలు రావని.. ప్రపంచకప్ లో ఈ ఆట ఆడితే మొదటికే మోసం వస్తుందని చెప్పాడు. 

ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలలో అద్భుతాలు చేసిన టీమిండియా.. ఆసియా కప్ నుంచి గాడి తప్పుతున్నది. ఆసియా కప్ లో  సూపర్-4కే పరిమితమైన భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తొలి టీ20లో ఓడింది. ఓటముల కన్నా భారత్ ను భయపెడుతున్నది మాత్రం పేలవ బౌలింగ్. ప్రధాన బౌలర్ బుమ్రా లేకపోవడంతో  భారత బౌలింగ్ తీవ్ర నిరాశపరుస్తున్నది. ఫలితంగా జట్టు ఓటముల బాట పట్టాల్సి వస్తున్నది. 
 

మొహాలీలో టీమిండియా మంచి స్కోరే చేసినా బౌలర్ల  వైఫల్యంతో  ఓడింది. అయితే ఓటములపై ఇన్నాళ్లు మౌనం దాల్చిన బీసీసీఐ.. తొలిసారి స్పందించింది. స్వయంగా బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీయే భారత ప్రదర్శనపై ఆందోళన వ్యక్తం చేశాడు. ఇలా ఆడితే ప్రపంచకప్ నెగ్గడం చాలా కష్టమని చెప్పుకొచ్చాడు. 
 

Rohit Sharma

కోల్కతాలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న దాదా మాట్లాడుతూ.. ‘టీమిండియా గత రెండు మెగా టోర్నీ (టీ20 ప్రపంచకప్ 2021, ఆసియా కప్) లలో విఫలమైంది.  ఈ విషయమ్మీద బీసీసీఐ ఇదివరకే జట్టు సారథి, హెడ్ కోచ్ లతో చర్చలు జరిపింది. కానీ వచ్చే  టీ20 ప్రపంచకప్ లో వాళ్లు మెరుగవుతారని ఆశిస్తున్నా.. 

రోహిత్, రాహుల్ లు జట్టు గురించి ఆందోళన చెందుతున్నారని  నాకు తెలుసు. నేను నాగ్‌పూర్ (రెండో టీ20 కోసం) వెళ్తున్నాను. టీమిండియా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. అయితే ఇలా ఆడితే మాత్రం  వచ్చే ప్రపంచకప్ లో విజయం సాధించడం కష్టం.. 

జట్టులో ప్రతీ ఒక్క ఆటగాడు తమవంతుగా  మెరుగైన ప్రదర్శన చేయాలి. అలా అయితేనే టీమిండియా ప్రపంచకప్ నెగ్గుతుంది. ఒక్కరిద్దరు ఆటగాళ్ల ఆట మీద ఆధారపడితే  ప్రయోజనం లేదు. బ్యాటర్లలో కోహ్లీ, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, హార్ధిక్ పాండ్యా, సూర్యకుమార్ లతో పాటు బౌలర్లు కూడా రాణించాలి.  ప్రతీ ఆటగాడు తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడే విజయాలు సొంతమవుతాయి..’ అని  దాదా తెలిపాడు. 
 

గతేడాది టీ20 ప్రపంచకప్ ముగిశాక తర్వాత ఆడిన ప్రతీ సిరీస్ లోనూ విజయాలు సాధిస్తూనే ఉంది. ఆసియా కప్ వరకు అసలు భారత జట్టు స్వదేశంలో గానీ విదేశాల్లో గానీ టీ20 సిరీస్ ఓడలేదు. కానీ ఆసియాకప్ లో  అంచనాలు తలకిందులయ్యాయి. టైటిల్ ఫేవరేట్లుగా బరిలోకి దిగిన భారత జట్టు.. సూపర్-4లో వరుస పరాజయాలతో ఇంటిముఖం పట్టింది. 

ఆసియా కప్ ఓటముల గురించి మాట్లాడుతూ.. ‘ఆటలో గెలుపోటములు సహజం. ఇటీవల భారత్ కొన్ని కీలక మ్యాచ్ లు ఓడింది. కానీ టీ20లలో రోహిత్ శర్మ  విన్నింగ్ పర్సంటేజీ 82 శాతంగా ఉంది. కెప్టెన్ గా అతడు చాలా తక్కువ మ్యాచ్ లలో ఓడిపోయాడు..’ అని దాదా అన్నాడు. టీమిండియా త్వరలోనే మళ్లీ  ఫామ్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. 

click me!