ఇండియాకి వెళ్లి, ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండా టెస్టు సిరీస్ ఆడతారా? - మైకేల్ క్లార్క్ కామెంట్...

First Published Jan 25, 2023, 10:12 AM IST

స్వదేశంలో శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను గెలిచిన భారత జట్టు, న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్‌ని 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. తొలి వన్డేలో మంచి పోరాటం చూపించిన న్యూజిలాండ్ జట్టు, మిగిలిన రెండు వన్డేల్లో పెద్దగా పోరాడకుండానే చేతులు ఎత్తేసింది. అయితే ఇప్పుడు అందరి ఫోకస్ వచ్చే నెలలో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీపైనే ఉంది...
 

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ని ముగించుకున్న టీమిండియా... టీ20 సిరీస్ ఆడనుంది. అయితే సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అండ్ కో నేరుగా టెస్టు సిరీస్ కోసం బీసీసీఐ క్యాంపులో పాల్గొనబోతున్నారు. టెస్టు టీమ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, కుల్దీప్ యాదవ్ మాత్రమే టీ20 సిరీస్‌లోనూ ఆడబోతున్నారు...
 

ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టు, ఫిబ్రవరి తొలి వారంలో ఇండియాలో అడుగుపెట్టనుంది. అయితే ఇండియా టూర్‌లో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడడం లేదు ఆస్ట్రేలియా..

‘ఇది నాకు అర్థం కావడం లేదు. ఇండియాలో టెస్టు సిరీస్‌కి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ఎందుకు ఆడడం లేదు. ఇండియాలో పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రాక్టీస్ మ్యాచులు చాలా అవసరం. ఇండియాలో వన్డే, టీ20ల్లో ఆడడం, టెస్టు మ్యాచులు ఆడడం ఒక్కటి కాదు...

ఇండియాలో రాణించాలంటే పూర్తిగా భిన్నంగా ఆలోచించాలి. ఆస్ట్రేలియాలో ఆడినట్టు ఆడతామంటే కుదరదు. ఇండియా పిచ్‌ మీద స్పిన్ బౌలింగ్‌ని ఫేస్ చేయడం అంత తేలికైన విషయం కాదు. కాస్త ఏమరపాటు చూపించినా, కళ్లు మూసి తెరిచేలోపు రెండు, మూడు రోజుల్లో మ్యాచ్ రిజల్ట్ వచ్చేస్తుంది..

ఇండియాలో బ్యాటింగ్‌ చేయడం చాలా కఠినమైన ఛాలెంజ్. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు, ఆస్ట్రేలియాలో ఎక్కడా కనిపించవు. ఎంత ఓపిక్కా ఆడితే అంత మంచి రిజల్ట్ దక్కుతుంది. ఇండియాలో రెండో ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది...

ఆస్ట్రేలియాలో స్పిన్ బౌలింగ్‌ని ఫేస్ చేయడం పెద్దగా ఇబ్బంది అనిపించదు. అయితే ఇండియాలో అలా ఉండదు. బంతి ఎక్కడ పడి, ఎలా తిరిగి ఎటు వస్తుందో అర్థం చేసుకునేలోపు వికెట్ పడిపోతుంది. ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రాక్టీస్ మ్యాచులు ఉపయోగపడతాయి..’ అంటూ చెప్పుకొచ్చాడు ఆసీస్ మాజీ సారథి మైకేల్ క్లార్క్...

Michael Clarke

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కామెంటేటర్‌గా మారిన మైకేల్ క్లార్క్, బోర్డర్ గవాస్కర్ 2023 ట్రోఫీకి కామెంటేటర్‌గా వ్యవహరించాల్సి ఉంది. అయితే వ్యక్తిగత వివాదంలో ఇరుక్కున్న మైకేల్ క్లార్క్‌ని ఇండియాలో టెస్టు సిరీస్‌ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ... 

click me!