వుమెన్స్ ఐపీఎల్‌కి దూరంగా చెన్నై సూపర్ కింగ్స్... ఆ రెండు జట్లు కూడా! కారణం ఇదే...

First Published Jan 25, 2023, 11:53 AM IST

బీసీసీఐ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెస్తున్న లీగ్ వుమెన్స్ ఐపీఎల్. పురుషుల ఐపీఎల్ ప్రారంభమైన 16 ఏళ్లకు మహిళల కోసం ప్రత్యేకంగా లీగ్ తీసుకొచ్చే ఆలోచనతో ముందుకొచ్చింది బీసీసీఐ. అచ్చం మెన్స్ ఐపీఎల్ మాదిరిగానే అన్ని హంగులతో ఈ ఏడాది మహిళల ఐపీఎల్ ప్రారంభం కానుంది...

ఇప్పటికే వుమెన్స్ ఐపీఎల్ 2023-27 సీజన్లకు సంబంధించిన మీడియా హక్కుల విక్రయం కూడా జరిగిపోయింది. రూ.951 కోట్ల భారీ ధరకు వయాకామ్18 నెట్‌వర్క్, మహిళా ఐపీఎల్ మీడియా హక్కులను సొంతం చేసుకుంది. ఒక్కో వుమెన్స్ ఐపీఎల్ మ్యాచ్ ద్వారా మీడియా హక్కుల రూపంలో రూ.7.09 కోట్లు బీసీసీఐ ఖాతాలో చేరబోతున్నాయి...

Smriti Mandhana-Harmanpreet Kaur

వుమెన్స్ ఐపీఎల్ కోసం ఇప్పటికే రిజస్ట్రేషన్ ప్రోగ్రామ్ ప్రారంభం అయ్యింది. జనవరి 26తో మహిళా క్రికెటర్ల రిజస్ట్రేషన్‌కి గడువు ముగియనుంది. పురుషుల ఐపీఎల్ మాదిరిగానే బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చే ప్లేయర్లను ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయబోతున్నాయి...

Dhoni IPL Trophy

అయితే మహిళా ఐపీఎల్ ఫ్రాంఛైజీ కొనుగోలుకి చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు ఆసక్తి చూపించకపోవడం విశేషం. గుజరాత్ టైటాన్స్, లక్నో జట్లు కొత్తగా ఐపీఎల్ 2022 సీజన్‌లోనే ఎంట్రీ ఇచ్చాయి. అయితే 16 సీజన్లుగా ఉంటున్న సీఎస్‌కే, ఎందుకుని వుమెన్స్ ఐపీఎల్ టీమ్ కోసం ప్రయత్నించలేదు...

వుమెన్స్ ఐపీఎల్ కోసం బిడ్ వేయాలంటే ఆ కంపెనీ విలువ రూ.1000 కోట్లకు పైగా ఉండాలి. అయితే చెన్నై సూపర్ కింగ్స్ నెట్ వాల్యూ రూ.850-900 కోట్ల వరకే ఉంది. ఐపీఎల్‌తో పాటు సౌతాఫ్రికా20లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌ని సొంతం చేసుకున్న సీఎస్‌కే, వుమెన్స్ ఐపీఎల్‌లో ఉండకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచే విషయమే...

Smriti Mandhana BBL

చెన్నై సూపర్ కింగ్స్‌, వుమెన్స్ ఐపీఎల్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించకపోయినా ఆ ఫ్రాంఛైజీ భాగస్వామి ఇండియా సిమెంట్స్ మాత్రం మహిళల టీమ్‌ని కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇండియా సిమెంట్స్‌తో పాటు అదానీ గ్రూప్, టొరెంట్ ఫార్మా, చెట్టినాడ్ సిమెంట్, జేకే సిమెంట్, హల్దీరామ్ వంటి కార్పొరేట్ కంపెనీలు... మహిళా ఐపీఎల్ ఫ్రాంఛైజీల కోసం బిడ్ వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం...

లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కొనుగోలు కోసం భారీగా ఖర్చు చేసిన ఆర్‌పీ సంజీవ్ గోయింకా గ్రూప్, సౌతాఫ్రికా20 లీగ్‌లో డర్భన్స్ సూపర్ జెయింట్స్ టీమ్‌ని కొనుగోలు చేసింది. ఈ రెండు కొత్త టీమ్స్ కారణంగా వుమెన్స్ ఐపీఎల్‌లోకి లేటుగా ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడట సంజీవ్ గోయింకా..

గుజరాత్ టైటాన్స్‌ టీమ్‌ యజమాని సీవీసీ క్యాపిటల్ పాట్నర్స్ కూడా ఇదే ఫార్ములాని నమ్ముకుంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన సీవీసీ క్యాపిటల్, పురుషుల లీగ్ ద్వారా ఇంకా ఆదాయాన్ని ఆర్జించడం మొదలెట్టలేదు. కాబట్టి వుమెన్స్ ఐపీఎల్‌లోనూ పెట్టుబడి పెట్టడం రిస్క్ అని ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం...

click me!