D Gukesh: అంతర్జాతీయ వేదికపై తెలుగోడు సత్తా చాటాడు. చైనాకు షాకిస్తూ ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి భారత జెండాను రెపరెపలాడించాడు. విశ్వనాథ్ ఆనంద్ తర్వాత చెస్‌లో భారత్‌కు మరో ప్రపంచ చెస్ ఛాంపియన్ లభించాడు. అతనే గుకేష్ దొమ్మరాజు. డిసెంబరు 12న కేవలం 18 ఏళ్ల వయస్సులో తెలుగు బిడ్డ డి గుకేశ్ డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన అతి పిన్న వయస్కుడిగా ఘనత సాధించాడు. 7 సంవత్సరాల వయస్సులో పాఠశాలలో చదరంగం ఆడటం మొదలు పెట్టిన యంగ్ గ్రాండ్‌మాస్టర్ 10 ఏళ్లలో ఎలా ప్రపంచ ఛాంపియన్ స్థాయికి చేరుకున్నాడనే విషయం ఎప్పుడు తెలుసుకుందాం.
GUKESH
చైనా చెస్ మాస్టర్‌ను ఓడించిన డి గుకేష్
డిసెంబర్ 12న, సింగపూర్‌లో డి గుకేష్-చైనా డిఫెండింగ్ ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ మధ్య నిర్ణయాత్మక మ్యాచ్ జరిగింది. 14వ గేమ్‌లో అతను చివరి కదలికలో డింగ్ లిరెన్‌ను ఓడించాడు. ఈ విజయంతో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత క్లాసికల్ చెస్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన రెండవ భారతీయుడిగా 18 ఏళ్ల గుకేష్ ఘనత సాధించాడు. 22 ఏళ్ల వయసులో ఈ ఘనత సాధించిన రష్యా లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ రికార్డును గుకేశ్ బద్దలు కొట్టాడు.
D Gukesh In Tears
చైనా తో గుకేష్ హోరాహోరీ మ్యాచ్
గుకేశ్, డింగ్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. నిర్ణయాత్మక మ్యాచ్ వరకు ఇద్దరూ 6.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. అయితే చైనా ఛాంపియన్ చేసిన ఒక్క పొరపాటుతో మ్యాచ్ కోల్పోయాడు. టైమ్ ఒత్తిడిని జయించిన గుకేష్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. విజయం తర్వాత ఉద్వేగానికి లోనైన గుకేశ్ తన తండ్రిని కౌగిలించుకున్నాడు. విజయం తర్వాత గుకేశ్ మాట్లాడుతూ, 'ఇది నా జీవితంలో అత్యుత్తమ రోజు'గా పేర్కొన్నాడు.
ఎవరీ గుకేష్ దొమ్మరాజు?
డి గుకేష్ పూర్తి గుకేష్ దొమ్మరాజు. మే 29, 2006లో జన్మించాడు. తెలుగు కుర్రాడైన గుకేష్ తల్లిదండ్రుల స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా. ప్రస్తుతం చెన్నైలో ENT సర్జన్ అయిన డాక్టర్ రజనీకాంత్, మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ పద్మ దంపతులకు జన్మించారు. తెలుగు కుటుంబానికి చెందిన గుకేశ్ ఏడేళ్ల వయసులో చదరంగం ఆడడం ప్రారంభించాడు. 2015లో ఆసియా స్కూల్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో గుకేష్ తన మొదటి ప్రధాన మైలురాయిని- U9 విభాగంలో గెలుచుకున్నాడు. మూడు సంవత్సరాల తరువాత, అతను U12 ప్రపంచ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.
GUKESH
గుకేష్ కేవలం 12 సంవత్సరాల వయస్సులో 2018 ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లలో వివిధ ఫార్మాట్లలో ఐదు బంగారు పతకాలను సాధించాడు. వాటిలో వ్యక్తిగత ర్యాపిడ్, బ్లిట్జ్, టీమ్ ర్యాపిడ్, బ్లిట్జ్-వ్యక్తిగత క్లాసికల్ విభాగాలు ఉన్నాయి. మార్చి 2017 నాటికి గుకేష్ ఇంటర్నేషనల్ మాస్టర్ బిరుదును సంపాదించాడు. అదే సంవత్సరంలో 12 సంవత్సరాల, 7 నెలలు 17 రోజుల వయస్సులో చరిత్ర సృష్టిస్తూ మూడవ-పిన్నవయస్సు గ్రాండ్‌మాస్టర్ అయ్యాడు.
10 ఏళ్లలో ప్రపంచ ఛాంపియన్ గా మారిన గుకేష్
ఏడేళ్ల వయస్సులో చెస్ ఆడటం ప్రారంభించిన గుకేష్.. తర్వాతి 10 ఏళ్లలో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచాడు. అంతర్జాతీయ వేదికపై సత్తా చాటాడు. చెస్ చరిత్రలో 2750 రేటింగ్ సాధించిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా ఆగస్ట్ 2023లో ఘనత సాధించాడు. ఆ తర్వాత భారతదేశపు టాప్-ర్యాంక్ చెస్ ప్లేయర్‌గా విశ్వనాథన్ ఆనంద్ 37 ఏళ్ల రికార్డును బ్రేక్ చేశాడు. 2019లో 12 ఏళ్ల వయసులో గ్రాండ్‌మాస్టర్ టైటిల్‌ను సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు గుకేశ్. ఉన్నదానితో ఎప్పుడూ సంతృప్తి చెందకండి అనే చెప్పే డి గుకేష్.. ఎప్పుడు మెరుగైన స్థాయి కోసం ప్రయత్నం చేయాలనేది తన విజయ మంత్రంగా పేర్కొన్నాడు. అదే తనను ఇప్పుడు ప్రపంచ ఛాంపియన్ స్థానం వరకు నడిపింది.