కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో కారణం చెప్పలేదు.. తీవ్ర నిరాశలో ఉన్నా.. మనసులో బాధ బయటపెట్టిన వార్నర్ భాయ్

First Published Oct 13, 2021, 4:14 PM IST

IPL2021 David Warner: దాదాపు ఏడు సంవత్సరాల పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ తో అనుబంధాన్ని కొనసాగించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్.. వచ్చే ఏడాది ఆ జట్టుతో ఆడేది లేనిది సందిగ్ధంగా ఉంది. అయితే ఉన్నట్టుండి తనను కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పించారో తనకు తెలియదన్నాడు. 

ఈ ఐపీఎల్ సీజన్ లో Sun Risers Hyderabad అత్యంత పేలవ ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. ఆటగాళ్లను, ఏకంగా కెప్టెన్లను మార్చినా ఆ జట్టు తలరాత మారలేదు. ఆడిన 14 మ్యాచుల్లో 11 మ్యాచ్ లు ఓడి  తీవ్ర విమర్శల పాలైంది. 

అయితే IPL-14 సీజన్ తొలి అంచెకు ముందు ఐదు మ్యాచ్ లాడిన హైదరాబాద్ టీమ్.. ఆరో మ్యాచ్ కు ముందు మాజీ కెప్టెన్ David Warner ను సారథ్య బాధ్యతల నుంచి తప్పించింది. 

వార్నర్ స్థానంలో న్యూజిలాండ్ కెప్టెన్ Kane williamson ను జట్టుకు నాయకుడిగా ప్రకటించింది. ఇక రెండో అంచె మొదలైన తర్వాత వార్నర్ ను ఏకంగా పక్కనబెట్టింది. 

దీనిపై తీవ్ర నిరాశలో ఉన్న వార్నర్ భాయ్ నోరు విప్పాడు. ఓ స్పోర్ట్స్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వార్నర్ మాట్లాడుతూ..‘సన్ రైజర్స్ యజమానులు, ట్రెవోర్ బేలిస్, వీవీఎస్ లక్ష్మణ్, టామ్ మూడీ, ముత్తయ్య మురళీధరన్ లపై నాకు అమితమైన గౌరవముంది. నా విషయంలో నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏకగ్రీవంగా ఉండాలి. కానీ నన్ను సారథ్య బాధ్యతల నుంచి ఎవరు తప్పించారో నాకు ఇంతవరకు చెప్పలేదు’ అంటూ బాధపడ్డాడు. 
 

అంతేగాక.. ‘నన్ను ఇంకా నిరాశపరిచే విషయమేమిటంటే.. నన్ను కెప్టెన్ గా తప్పించినట్టు మీడియాకు చెప్పారు. కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ, ఫ్రాంచైజీ గానీ నన్ను ఎందుకు తప్పిస్తున్నారో చెప్పలేదు. ఒకవేళ  నా ఫామ్ సమస్య అయితే అదైనా చెప్పాలి. కెప్టెన్సీ వేరు.. బ్యాట్స్మెన్ గా నా ఫామ్ వేరు. కొన్నేళ్లుగా సన్ రైజర్స్ కు నేనేం చేశానో అందరికీ తెలుసు. నాలుగైదు మ్యాచుల్లో ఓడితే కెప్టెన్సీ నుంచి తొలగించడం బాధ కలిగించింది. అయినా నేనిప్పుడు ఇవేమీ ఆలోచించడం లేదు. ఏది జరిగినా జీవితంలో ముందుకు సాగాల్సిందే కదా.. ’ అని అన్నాడు. 

హైదరాబాద్ ను వీడటం తనకు బాధ కలిగిస్తుందన్న వార్నర్ అవకాశముంటే మళ్లీ ఈ జట్టుకే ఆడాలని ఉందని అన్నాడు. ‘హైదరాబాద్ నా రెండో ఇల్లు వంటిది. ఇక్కడి అభిమానులు నన్ను ఎంతో ఆరాధించారు. నా భార్యా, పిల్లల పట్ల వెలకట్టలేని అభిమానం చూపెట్టారు.  హైదరాబాద్ అభిమానుల కోసమైనా SRH తరఫున  ఆడాలని అనిపిస్తోంది. కానీ అది నా చేతుల్లో లేదు’ అని  వార్నర్ భాయ్ చెప్పుకొచ్చాడు. 

ఇక తన ఐపీఎల్ భవితవ్యం ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని వార్నర్ అన్నాడు. వచ్చే ఏడాది వేలంలో తాను ఏ జట్టుకు వెళ్తానో తెలియదని చెప్పాడు.నాకైతే హైదరాబాద్ కు ఆడాలని ఉందని వార్నర్ తన అభిమానాన్ని చాటుకున్నాడు. 

2014 నుంచి వార్నర్ హైదరాబాద్ కు ఆడుతున్నాడు.  ఆ తర్వాత సీజన్ లో కెప్టెన్ అయ్యాడు. దానితర్వాత హైదరాబాద్ 2016 సీజన్ లో ఏకంగా ఐపీఎల్ కప్పు కొట్టింది. జట్టు అనుకున్నంతగా రాణించకపోయినా.. బ్యాట్స్మెన్ గా మాత్రం వార్నర్ ఏనాడూ విఫలం కాలేదు. కానీ ఐపీఎల్-14 సీజన్ మాత్రం అతడికి ఓ పీడకల లా మారింది. 

click me!