పాకిస్తాన్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ - హార్దిక్ పాండ్యాలు సెంచరీ భాగస్వామ్యంతో టీమిండియాను విజయతీరాలకు చేర్చారు. చివర్లో పాండ్యా నిష్క్రమించినా కోహ్లీ వీరోచిత పోరాటం చేసి భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
అయితే ప్రతీసారి కోహ్లీ మీద ఆధారపడితే భారత్ టీ20 ప్రపంచకప్ గెలవలేదని అంటున్నాడు 1983 వరల్డ్ కప్ లో భారత జట్టులోని సభ్యుడు, మాజీ సెలక్టర్ మదన్ లాల్. కోహ్లీ మీద ఆధారపడితే కుదరదని.. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ కూడా ఆడి సమిష్టిగా ఆడితేనే భారత్ లక్ష్యం చేరుకుంటుందని సూచించాడు.
తాజాగా ఆయన పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మదన్ లాల్ మాట్లాడుతూ.. ‘పాకిస్తాన్ తో మ్యాచ్ లో కోహ్లీ ఇన్నింగ్స్ అద్భుతం. గతంలో ఇలాంటి ఇన్నింగ్స్ నేను ఎప్పుడూ చూడలేదు. అయితే ఒక్క కోహ్లీ మీదే ఆధారపడటం సరికాదు. కోహ్లీ మీకు ప్రతీ మ్యాచ్ గెలిపించలేడు. ప్రపంచకప్ అనేది చాలా పెద్ద టోర్నమెంట్. ఇంత పెద్ద టోర్నీని ఒక్కడే గెలిపించడం అసాధ్యం.
పాకిస్తాన్ తో మ్యాచ్ లో విఫలమైన రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లు ఇకనైనా మేల్కొంటే మంచిది. వాళ్లిద్దరిమీద అభిమానులు కోట్లాది ఆశలు పెట్టుకున్నారు. ప్రతీ మ్యాచ్ కు కొత్త హీరో ఉంటాడు. అందరూ సమిష్టిగా ఆడితేనే భారత్ లక్ష్యం నెరవేరుతుంది..
ప్రపంచకప్ లో భారత ప్రయాణం ఇప్పుడే మొదలైంది. టీ20 ఫార్మాట్ లో ఏ జట్టునూ తక్కువగా అంచనా వేయడానికి లేదు. నెదర్లాండ్ కూడా మంచి జట్టే. ప్రత్యర్థులను బట్టి మన తుది జట్టులో కూడా మార్పులుండాలి. ప్రతీ మ్యాచ్ కూ ఒకే జట్టంటే కుదరదు. పేసర్లు, స్పిన్నర్లు, ఆల్ రౌండర్లతో జట్టులో సమతూకం ఉండాలి.
వికెట్ కీపర్ రిషభ్ పంత్ ను కూడా ప్రతీ మ్యాచ్ లో ఆడించాలి. పంత్ ఐదు మ్యాచ్ లు ఆడితే అందులో కచ్చితంగా మూడు మ్యాచ్ లను గెలిపిస్తాడు. అతడికి ఛాన్సులు ఇవ్వాలి...’ అని మదన్ లాల్ తెలిపాడు. భారత జట్టు తర్వాత మ్యాచ్ లో ఈనెల 27న నెదర్లాండ్స్ తో పోటీ పడనుంది. సిడ్నీ వేదికగా జరుగబోయే మ్యాచ్ లో భారత తుది జట్టులో మార్పులు ఉండే అవకాశాలున్నాయి.