‘గ్లోబల్’ సొబగులు అద్దుకుంటున్న ఐపీఎల్.. ఈసారి వేలం ఇండియాలో కాదట..

First Published Oct 26, 2022, 12:49 PM IST

IPL 2023 Auction: ఈ ఏడాది మే లో ముగిసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా రైట్స్ తో భారీ  ధరను దక్కించుకుని ప్రపంచ క్రీడలలో  ప్రఖ్యాతిగాంచిన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) ను వెనక్కినెట్టి సెకండ్ ఫేమస్ స్పోర్ట్ గా  గుర్తింపు దక్కించుకున్న ఐపీఎల్ ఆ దిశగా మరో ముందడుగు వేయనుంది. 

సాధారణంగా భారత్ లోని ముంబై లేదా బెంగళూరులో నిర్వహించే ఐపీఎల్ వేలం ప్రక్రియను  ఈసారి టర్కీ రాజధాని ఇస్తాంబుల్ లో నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తుందని సమాచారం. దీనిపై నవంబర్ మొదటివారంలో నిర్ణయం వెలువడే అవకాశమున్నది. 

ఐపీఎల్-16 కోసం డిసెంబర్ 16న  బీసీసీఐ వేలం ప్రక్రియ నిర్వహించునన్నట్టు సమాచారం. ఈమేరకు వేదికను   గత వేలం మాదిరిగానే బెంగళూరులో అనుకున్నా తాజాగా దానిని మార్చినట్టు తెలుస్తున్నది.  

బీసీసీఐ ఈ వేదికను మార్చడానికి కారణమున్నది. ఐపీఎల్ కు ప్రపంచ స్థాయిలో క్రేజ్ ఉన్నందున దీని పరిధిని విశ్వవ్యాప్తం చేసేందుకు బీసీసీఐ ప్రయత్నాలు మొదలుపెట్టింది. మీడియా హక్కుల వేలంలో రూ. 48 వేల కోట్లను దక్కించుకుని విలువపరంగా రెండో అతిపెద్ద  స్పోర్ట్స్ లీగ్ గా గుర్తింపు పొందింది.   ఫ్రాంచైజీలకు, బీసీసీఐకి, బ్రాడ్కాస్టర్లకు లాభాల పంట పండిస్తున్న ఐపీఎల్ పరిధిని  పెంచేందుకు బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు  సమాచారం.

నవంబర్ మొదటివారంలో జరిగే సమావేశంలో  బీసీసీఐ గనక  ఐపీఎల్ - 16 వేలం వేదికను  ఇస్తాంబుల్  లో నిర్వహించాలని ఫిక్స్ చేస్తే  విదేశాలలో జరిగే మొదటి ఐపీఎల్ వేలం ఇదే కానుంది. 

గతంలో కూడా బీసీసీఐ సింగపూర్, లండన్ లలో  ఐపీఎల్ వేలాన్ని నిర్వహించాలని చూసింది. కానీ అది ఎందుకో కార్యరూపం దాల్చలేదు. కానీ ఇప్పట్నుంచి మాత్రం ఆ అవకాశాన్ని వదులుకోకూడదని బీసీసీఐ  పెద్దలు భావిస్తున్నారు. 

ఇస్తాంబుల్ లో వేలం నిర్వహణ పట్ల ఫ్రాంచైజీ ఓనర్లు పెద్దగా ఆసక్తి చూపకపోయినా  బీసీసీఐ మాత్రం వాళ్లను ఒప్పించే పనిలో నిమగ్నమైంది.  ఇస్తాంబుల్ లో అయితే ఖర్చు తడిసి మోపెడు అవుతుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. కానీ బీసీసీఐ మాత్రం వారిని ఒప్పించే పనిలో నిమగ్నమైంది. 

click me!