చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్... ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ కైవసం...

First Published Aug 6, 2021, 10:41 PM IST

క్రికెట్‌లో పసికూనగా పిలువబడిన బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించింది. ఐదు వరల్డ్‌కప్‌ టైటిల్స్ సాధించిన ఆస్ట్రేలియాను చిత్తు చేసి 3-0 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. ఏ ఫార్మాట్‌లో అయినా బంగ్లాదేశ్, వరుసగా ఆస్ట్రేలియాపై మూడు విజయాలు సాధించడం ఇదే ప్రథమం...

తొలి రెండు టీ20ల్లో ఓడిన ఆస్ట్రేలియా, మూడో టీ20లోనూ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది... చేతిలో వికెట్లు ఉన్నా, లక్ష్యం చిన్నదే అయినా బంగ్లా బౌలర్లను ఎదుర్కోవడానికి తీవ్ర ఇబ్బందులు పడి, ఓటమి పాలైంది ఆస్ట్రేలియా...

తొలి మ్యాచ్‌లో ఆసీస్‌పై మొట్టమొదటి టీ20 విజయాన్ని అందుకున్న బంగ్లాదేశ్, ఏకంగా మూడు మ్యాచుల్లో తిరుగులేని విజయాలు అందుకుని ఆస్ట్రేలియాను చిత్తు చేయడం విశేషం...

మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది... బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా 53 బంతుల్లో 4 ఫోర్లతో 52 పరుగులు చేశాడు...

20వ ఓవర్‌లో మహ్మదుల్లా వికెట్ తీసిన ఆీసస్ బౌలర్ నాథన్ ఎల్లీస్, ఆ తర్వాతి బంతులకే ముస్తాఫిజుర్, మెహిడీ హసన్ వికెట్లను పడగొట్టి హ్యాట్రిక్ సాధించాడు... ఆరంగ్రేట మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ సాధించిన బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు నాథన్ ఎల్లీస్...

128 పరుగుల లక్ష్యఛేదనలో మాథ్యూ వేడ్ వికెట్‌ను త్వరగా కోల్పోయినా బెన్ మెక్‌డెర్మాట్, మిచెల్ మార్ష్ కలిసి రెండో వికెట్‌కి 63 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 41 బంతుల్లో 2 సిక్సర్లతో 35 పరుగులు చేసిన డెర్మాట్ అవుటైన తర్వాత హెండ్రీస్ 2 పరుగులకే అవుట్ అయ్యాడు.

47 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 51 పరుగులు చేసిన మిచెల్ మార్ష్ అవుట్ అయ్యే సమయానికి 17 బంతుల్లో 34 పరుగులు చేయాల్సిన దశలో ఉంది ఆసీస్. చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉండడంతో ఈజీగా గెలుస్తుందని అనిపించింది.

18వ ఓవర్‌లో ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. అయితే 19వ ఓవర్‌ వేసిన ముస్తాఫిజుర్ కేవలం ఒకే పరుగు ఇవ్వడంతో ఆఖరి ఓవర్‌లో 22 పరుగులు కావాల్సి వచ్చింది. మొదటి బంతికి ఆలెక్స్ క్యారీ సిక్సర్ బాదినా...ఆ తర్వాత నాలుగు బంతులాడిన డాన్ క్రిస్టియన్ భారీ షాట్స్ ఆడలేకపోయాడు.

దీంతో మూడో టీ20 మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో ఓడిన ఆస్ట్రేలియా, ఐదు మ్యాచుల సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. ఆస్ట్రేలియాకి ఇది వరుసగా ఐదో టీ20 సిరీస్ పరాజయం కావడం విశేషం...

ఇంగ్లాండ్, ఇండియా, న్యూజిలాండ్‌లతో టీ20 సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా... గత నెలలో వెస్టిండీస్ చేతుల్లో, తాజాగా బంగ్లాదేశ్ చేతుల్లో టీ20 సిరీస్‌ను కోల్పోయింది. 

click me!