బ్యాటింగ్ చేయనివ్వలేదు, బౌలింగ్ ఇవ్వలేదు... రోహిత్ శర్మపై వెంకటేశ్ అయ్యర్ కామెంట్స్...

First Published Nov 24, 2022, 9:55 AM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో హార్ధిక్ పాండ్యా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించని కారణంగా బౌలింగ్‌లో ఇంప్రెస్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, బ్యాటుతోనూ పెద్దగా మెరుపులు మెరిపించలేకపోయాడు.దీంతో టీమిండియాకి వెంకటేశ్ అయ్యర్ ఆశాకిరణంలా కనిపించాడు... అయితే వచ్చినట్టే వచ్చి, అంతలోనే టీమిండియాలో చోటు కోల్పోయాడు వెంకటేశ్ అయ్యర్... 

venkatesh Iyer

ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో జట్టులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, 10 మ్యాచుల్లో 370 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బ్యాటుతోనే కాకుండా 140+ స్పీడ్‌తో బౌలింగ్ చేసి మెప్పించాడు. ఈ పర్ఫామెన్స్ కారణంగానే టీమిండియాలోకి జెట్ స్పీడ్‌లోకి దూసుకొచ్చాడు అయ్యర్...

అయితే వెంకటేశ్ అయ్యర్‌ని సరిగ్గా వాడుకోలేకపోయింది టీమిండియా. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కి ఎంపికైన వెంకటేశ్ అయ్యర్... మూడు మ్యాచుల్లో బ్యాటింగ్‌కి వచ్చింది ఒకేసారి. బౌలింగ్ వేసింది ఒకే ఒక్క ఓవర్..

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓపెనర్‌గా వచ్చి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న కేకేఆర్‌ని అనూహ్యంగా ఫైనల్ చేర్చాడు వెంకటేశ్ అయ్యర్... సీఎస్‌కేతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ హాఫ్ సెంచరీ చేసి ఒంటరిపోరాటం చేశాడు. అలాంటి అయ్యర్‌ని ఆరో స్థానంలో, ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి పంపింది టీమిండియా.. 

‘నేను టీమిండియాలోకి వచ్చినప్పుడు ఓపెనింగ్ పొజిషన్ కోసం నలుగురు పోటీపుడుతున్నారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, కెఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ జట్టులో ఉన్నారు. ఇక నాకు ఓపెనింగ్ దక్కదని తేలిపోయింది. రాహుల్ ద్రావిడ్ సర్‌ని కలవగానే ఇదే విషయం అడిగా...

ఐపీఎల్‌లో నేను ఓపెనింగ్ చేసేవాడిని, కానీ టీమిండియాకి ఫినిషర్‌ రోల్‌కి వాడబోతున్నట్టు ద్రావిడ్ సర్ చెప్పారు. నాకు ఆ బ్యాటింగ్ పొజిషన్ కొత్త. కుదురుకోవడానికి కాస్త సమయం పట్టింది. భయపడాల్సిన పనిలేదు, కావాల్సినన్ని మ్యాచులు ఆడిస్తామని రోహిత్ భాయ్, రాహుల్ సర్ భరోసా ఇచ్చారు...
 

కోచ్, కెప్టెన్ సపోర్ట్ ఇస్తే ఏ ప్లేయర్‌కి అయినా భరోసా పెరుగుతుంది. అయితే నిజం చెప్పాలంటే నన్ను సరిగ్గా వాడుకోలేకపోయారని అనిపించింది. జట్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లు ఉన్నప్పుడు, ఆరో బౌలర్ అవసరం ఏముంటుంది. రోహిత్ భయ్యా కూడా ఇదే అనుకుని ఉంటాడు...

అయితే నాకు మాత్రం ఓపెనర్‌గా వచ్చి 20 ఓవర్లు ఆడాలని, బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేయాలని ఉండేది. ఆ అవకాశం మాత్రం ఎప్పుడూ దక్కకపోవడం తీవ్ర నిరాశకు గురి చేసింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు వెంకటేశ్ అయ్యర్. 

భారీ అంచనాలతో టీమిండియాలోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, కొద్దికాలానికే జట్టులో చోటు కోల్పోయాడు.. ఐపీఎల్ 2022లో 12 మ్యాచుల్లో కలిపి 182 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచిన వెంకటేశ్  అయ్యర్, హార్ధిక్ పాండ్యా రీఎంట్రీతో టీమిండియాకి పూర్తిగా దూరమయ్యాడు...

click me!