Virat Kohli 5 Unbreakable World Records: భారత్ గర్వించదగ్గ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకరు. ప్రపంచ క్రికెట్ లో అత్యుత్తమ ప్లేయర్లలో ఒకరు. కోహ్లీ తన సుప్రసిద్ధ కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 16 సంవత్సరాలను పూర్తి చేసుకున్నాడు. ఆధునిక క్రికెట్ లో టాప్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా కొనసాగుతున్నాడు.
భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో అద్భుతాలు చేశాడు. అనేక రికార్డులు సృష్టించాడు. ఇటీవల నిర్వహించిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 భారత్ ఛాంపియన్ గా నిలవడంలో ఫైనల్ మ్యాచ్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీ20 ప్రపంచ కప్ 2024 గెలిచిన తర్వాత తనను తాను ఎలైట్ క్లబ్‌లో చేర్చుకున్నాడు. మూడు వన్డే ప్రపంచ కప్ టోర్నీలు, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్ గెలిచిన అతి కొద్ది మంది భారతీయ ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు.
విరాట్ కోహ్లీ 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటివరకు 113 టెస్టు మ్యాచ్‌ల్లో ఆడాడు. 49.1 సగటుతో 8848 పరుగులు చేశాడు. ఇప్పటివరకు కోహ్లీ టెస్టు క్రికెట్ లో 29 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో విరాట్ 295 మ్యాచ్‌ల్లో 58.2 సగటుతో 13906 పరుగులు చేశాడు.
వన్డేల్లో 50 సెంచరీలు, 72 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 125 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో కోహ్లీ 48.7 సగటుతో 4188 పరుగులు చేశాడు. కోహ్లి కెరీర్‌లో చిరకాలం నిలిచే ఎన్నో రికార్డులు ఉన్నాయి. విరాట్ కోహ్లీ సాధించిన బద్దలు కొట్టడం చాలా కష్టమైన 5 రికార్డులు గమనిస్తే..
వన్డేల్లో అత్యధిక సెంచరీలు
35 ఏళ్ల వయసులో వన్డేల్లో 50 సెంచరీలు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. గత ఏడాది ప్రపంచకప్ సందర్భంగా సాధించిన సెంచరీతో ఈ ఘనతను అందుకున్నాడు.
అలాగే, గాడ్ ఆఫ్ క్రికెట్, తన ఆరాధ్యదైవం సచిన్ టెండూల్కర్ 49 సెంచరీల రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. 2027 వన్డే ప్రపంచకప్‌పై కోహ్లీ దృష్టి సారించాడు. ప్రస్తుతం 31 వన్డే సెంచరీలతో కోహ్లీకి అత్యంత సన్నిహిత ఆటగాడిగా రోహిత్ శర్మ ఉన్నాడు. అయితే, కోహ్లీ వన్డే సెంచరీల రికార్డును అందుకోవడం అంత సులువు కాదు.
virat.jpg
ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల రికార్డు
2023 వన్డే ప్రపంచకప్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త రికార్డు సృష్టించాడు. 11 మ్యాచ్‌ల్లో ఆకట్టుకునే 765 పరుగులతో అదరగొట్టాడు. లెజెండరీ ప్లేయర్ల రికార్డులను బ్రేక్ చేశాడు.
2003 ప్రపంచ కప్ లో సచిన్ టెండూల్కర్ సాధించిన 673 పరుగుల రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. కోహ్లీ సేన భారత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లినా.. ఆ జట్టు విజయాన్ని చేజార్చుకుంది. అయినప్పటికీ అతని రికార్డ్ బ్రేకింగ్ ఫీట్ అతని కెరీర్‌లో ముఖ్యమైన హైలైట్‌గా మిగిలిపోయింది.
ఐపీఎల్ లో తిరుగులేని ఆధిపత్యం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కోహ్లీ అద్భుతమైన ప్రయాణం చేస్తున్నాడు. 2016 సీజన్ అసాధారణమైన ఆటతో అదరగొట్టాడు. 973 పరుగులు చేశాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఇదే.
2023లో 890 పరుగులతో ఈ రికార్డును బ్రేక్ చేయడానికి శుభ్‌మాన్ గిల్ దగ్గరగా వచ్చాడు. కానీ, కోహ్లీ రికార్డును అందుకోలేకపోయాడు. ఇప్పటి వరకు మరే ఇతర ఆటగాడు కూడా ఐపీఎల్ ఒక సీజన్‌లో 900 పరుగుల మార్కును దాటలేకపోయాడు.
ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ
ఛేజింగ్ లోనూ విరాట్ కోహ్లీ అద్భుతమైన రికార్డులు సాధించాడు. పరుగుల వేటలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వన్డేలో కోహ్లీదే ఆధిపత్యం. ఛేజింగ్ సమయంలో 27 సెంచరీలు చేశాడు. ఈ విషయంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు.
విరాట్ కోహ్లీ తర్వాత సచిన్ టెండూల్కర్ ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న సచిన్ టెండూల్కర్ ఛేజింగ్ సమయంలో 17 సెంచరీలు చేశాడు. ఒత్తిడిలో తన జట్టును విజయతీరాలకు చేర్చడంలో కోహ్లీ సత్తా అసాధారణమైనది చెప్పవచ్చు.
అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు కోహ్లీవే
21 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుల రికార్డు ద్వారా అన్ని ఫార్మాట్లలో కోహ్లీ ఆధిపత్యం మరింత రుజువైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న ఆటగాడు కోహ్లీ. ఇందులో వన్డేల్లో 11, టెస్టులో 3, టీ20లో 7 అవార్డులు ఉన్నాయి. ఇక్కడ కూడా సచిన్ ను కోహ్లీ అధిగమించాడు. సచిన్ టెండూల్కర్ 20 ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులతో రెండో స్థానంలో ఉన్నాడు.