ఆస్ట్రేలియా టూర్‌లో అద్భుతం చేసిన టీమిండియా, స్వదేశంలోనూ ఇంగ్లాండ్ జట్టును చిత్తు చేస్తూ భారీ విజయాలు అందుకుంది. టీమిండియా విజయాలకి భారత సారథి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రియే కారణం అంటున్నాడు సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్.
‘టీమిండియా ఇప్పుడున్న పొజిషన్‌కి భారత సారథి విరాట్ కోహ్లీయే కారణం. జట్టులో ప్రతీ ప్లేయర్‌కి కావాల్సిన స్వేచ్ఛను ఇస్తాడు విరాట్ కోహ్లీ, వారిపై వారికి నమ్మకం పెంచి, నూరు శాతం పర్ఫామెన్స్ రాబడతాడు.
భారత జట్టును అతను నడిపిస్తున్న విధానం నిజంగా అద్భుతం. బ్యాట్స్‌మెన్ అయినా బౌలర్ అయినా కెప్టెన్ నుంచి కావాల్సిన మోరల్ సపోర్ట్ దొరికితే, అద్భుతాలు చేయగలరు. ఇప్పుడు భారత జట్టులో చూస్తున్నది అదే.
నిజానికి భారత జట్టు ఇప్పుడున్న పొజిషన్‌కి చేరడానికి ఎంతో కష్టపడ్డారు విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి భాయ్. క్రికెట్ క్రీజులోకి అడుగుపెట్టాక విరాట్ కోహ్లీలో అగ్రెషన్ మాత్రమే జనాలకు కనిపిస్తుంది. కానీ అతను తన ప్లేయర్లను ఎంతో బ్యాకప్ చేస్తాడు, ఎంతగానో సపోర్ట్ అందిస్తాడు.
ప్రస్తుతం జట్టులో ఉన్న 11 మంది మధ్య ఓ స్పెషల్ సింక్ ఏర్పడింది. దానికి క్రెడిట్ మొత్తం విరాట్ కోహ్లీ, రవిశాస్త్రికే దక్కుతుంది. జట్టులో ఎవ్వరూ ఎలాంటి ఇబ్బంది పడడం లేదు.
ఓ టీమ్ స్పిరిట్ ఏర్పడింది. అంతకుముందు జట్టులో ఓ మంచి వాతావరణం నెలకొంది. రిజర్వు బెంచ్ ఎంత బలంగా ఉందో కూడా మీరందరూ చూస్తున్నారు...’ అంటూ వివరించాడు భారత పేసర్ ఉమేశ్ యాదవ్.
భారత జట్టు తరుపున 48 టెస్టులు ఆడిన ఉమేశ్ యాదవ్, 148 వికెట్లు తీశాడు. 75 టెస్టుల్లో 106 వికెట్లు పడగొట్టగా, 7 టీ20 మ్యాచుల్లో 9 వికెట్లు తీశాడు.
2018 నుంచి 2020 వరకూ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడిన ఉమేశ్ యాదవ్‌ను ఐపీఎల్ 2021 వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఫస్ట్ హాఫ్‌లో అతనికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు.
ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కి ఎంపికైన ఉమేశ్ యాదవ్, ప్రస్తుతం ముంబైలో బీసీసీఐ ఏర్పాటుచేసిన బయో బబుల్‌లో క్వారంటైన్‌లో గడుపుతున్నాడు.