బయోపిక్ మూవీకి ధోనీ ఒప్పుకోవడానికి కారణం అదే... ఆ పిల్లాడితో మాట్లాడిన తర్వాత...

First Published Sep 30, 2022, 5:48 PM IST

క్రికెట్ ప్రపంచంలో క్రికెటర్లకు ఫాలోయింగ్, క్రేజ్ ఉండడం చాలా సాధారణ విషయం. అయితే క్రికెట్‌ చూడని జనాల్లో కూడా మాహీకి బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది. క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల క్రేజ్‌తో పోటీపడినా మాస్‌ ఫాలోయింగ్ విషయంలో ధోనీ తోపు. దీనికి ‘ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ’ బయోపిక్ కూడా ఓ కారణం...

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించిన ‘ఎంఎస్ ధోనీ- ది అన్‌టోల్డ్ స్టోరీ’ మూవీ, 2016 సెప్టెంబర్ 30న విడుదలైంది. దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, బాక్సాఫీస్ దగ్గర రూ.216 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

సచిన్ టెండూల్కర్ బయోపిక్ ‘200 నాటౌట్’, కపిల్ దేవ్ బయోపిక్ ‘83’, మిథాలీరాజ్ బయోపిక్ ‘శభాష్ మిథాలీ’ సినిమాలను పట్టించుకోని జనాలు, ఎక్కడో జార్ఖండ్‌లో పుట్టి రైల్వేలో టికెట్ కలెక్టర్‌గా పనిచేసి... టీమిండియా కెప్టెన్‌గా రెండు వరల్డ్ కప్స్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ కథకు బాగా కనెక్ట్ అయిపోయారు...

సచిన్ టెండూల్కర్, అజారుద్దీన్, కపిల్ దేవ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక బయోపిక్ మూవీస్‌కి అంగీకరిస్తే.. ఎంఎస్ ధోనీ మాత్రం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్న సమయంలో బయోపిక్ మూవీకి అంగీకరించాడు. ఈ మూవీ కోసం మాహీ రూ.100 కోట్లు తీసుకున్నాడని ప్రచారం కూడా జరిగింది..

‘2007 టీ20 వరల్డ్ కప్ తర్వాత ఎంఎస్ ధోనీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. మాహీ ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చాడని తెలిసి, అతని కథ తెలుసుకున్నా. ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచే ప్రయాణం తనది... అయితే మాహీని బయోపిక్ కోసం ఒప్పించడానికి రెండేళ్లు కష్టపడాల్సి వచ్చింది...
 

2015లో ధోనీ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు ఓ పిల్లాడు తన దగ్గరికి వచ్చాడు. వచ్చి తాను పై చదువులకు ప్రిపేర్ అవుతున్నానని, తనకు మోటివేషన్ గురించి ఏదైనా చెప్పమని మాహీని అడిగాడు. ధోనీ అతని పక్కనే కూర్చొని తన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పాడు...

నేను ఆ సమయంలో మాహీ పక్కనే ఉన్నా. ఆ పిల్లాడు వెళ్లిపోయాక ‘‘మాహీ ఆ పిల్లాడితో ఇంత సమయం గడపడం అవసరమా? ’’ అని అడిగాడు. దానికి ధోనీ... ‘నా సమాధానాలు అతనికి స్ఫూర్తి కలిగిస్తాయంటే దానికంటేనా...’ అంటూ చెప్పాడు. అప్పుడే ‘నీ కథ ఇలా ఎందరో కుర్రాళ్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది...

జీవితంలో ఏదో సాధించాలనే తపన ఉన్నా, ఏవేవో అడ్డంకులతో ఆగిపోతున్నారు చాలామంది పిల్లలు. వారికి నీ కథ తెలిస్తే ఎక్కడా ఆగకూడదనే గట్టి సంకల్పం తోడవుతుంది. నువ్వు ఇలా కొన్ని లక్షలమంది పిల్లల దగ్గర కూర్చొని మోటివేట్ చేయలేవు’’ అని చెప్పాను...

Image credit: MS DhoniFacebook

దానికి వెంటనే ధోనీ ఒకే చెప్పాడు. మాహీ కథను డెవలప్ చేయడానికి నాలుగేళ్లు పట్టింది. 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో వచ్చిన ఆలోచనను సినిమాగా మలిచేందుకు చాలా కష్టపడ్డా...’ అంటూ చెప్పుకొచ్చాడు ‘ఎంఎస్ ధోనీ ది అన్‌టోల్డ్ స్టోరీ’ సినిమా దర్శకుడు, రచయిత నీరజ్ పాండే...

click me!