వచ్చే ఐపీఎల్ వేలంలో అతడికే ఫుల్ డిమాండ్.. ఆసీస్ ఆల్‌రౌండర్‌పై కమిన్స్ ప్రశంసలు

First Published Sep 30, 2022, 5:02 PM IST

IPL 2023 Auction: ఐపీఎల్-16 సీజన్ వచ్చే ఏడాది  మార్చి నుంచి మొదలుకానుండగా అందుకు సంబంధించిన  వేలం ఈ ఏడాది డిసెంబర్ లో జరిగే అవకాశముంది. 

అభిమానులకు వినోదంతో పాటు  క్రికెటర్లకు కాసులు కురిపించే క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో ఆడాలని ఏ క్రికెటర్ కోరుకోడు..?  మరీ ముఖ్యంగా టాలెంట్ ఉండి బంతిని బలంగా బాదగలిగే హిట్టర్ కైతే ఐపీఎల్  ఒక బంగారు గుడ్లు పెట్టే బాతు వంటిది. ఈ లీగ్ ద్వారా అటువంటి ఆటగాళ్లు కోటానుకోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు. 
 

ఆ జాబితాలోకి తర్వాత రాబోయే ఆటగాడు ఆస్ట్రేలియా యువ ఆల్ రౌండర్ కామెరూన్ గ్రీన్ అవుతాడని  ఆ జట్టు టెస్టు సారథి  పాట్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు.   వచ్చే ఐపీఎల్ మినీ వేలంలో గ్రీన్ కు ఫుల్ డిమాండ్ ఉంటుందని జోస్యం చెప్పాడు. 

టీమిండియాతో ఇటీవలే ముగిసిన టీ20 సిరీస్ లో  ఓపెనర్ గా బరిలోకి  దిగిన గ్రీన్.. బాదుడే మంత్రంగా ఆడాడు. తొలి టీ20లో 30 బంతుల్లోనే 61 పరుగులు చేసిన అతడు.. హైదరాబాద్ లో ముగిసిన మూడో మ్యాచ్ లో కూడా 21 బంతుల్లోనే 50 ప్లస్ స్కోరు చేశాడు.  ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఫ్రాంచైజీల కన్ను గ్రీన్ పై పడింది. 

ఇక ఇదే విషయమై కమిన్స్ మాట్లాడుతూ.. ‘ఐపీఎల్ లో  గ్రీన్ కు భారీ డిమాండ్ ఉంటుంది. ఒక్క ఐపీఎల్ లోనే కాదు ప్రపంచంలోని ఏ లీగ్ లో ఆడినా గ్రీన్ కు మంచి డిమాండ్ ఉంటుంది.  త్వరలోనే ఇందుకు సంబంధించిన నిర్ణయాలు మీరు చూస్తారు..’ అని చెప్పాడు. 

నెట్స్ లో  గ్రీన్ కు బౌలింగ్ చేసేప్పుడు  అతడిని రెచ్చగొట్టమని   కమిన్స్  తెలిపాడు.  దేశవాళీలో వెస్ట్ ఆస్ట్రేలియా తరఫున ఆడే గ్రీన్.. టీ20  ప్రపంచకప్ కు ఎంపిక చేసిన ఆసీస్ జట్టులో లేడు. కానీ  ఇండియాపై అతడి ఆటను చూశాక  క్రికెట్ ఆస్ట్రేలియా   మనసు మార్చుకుంది.

గ్రీన్ ను తుది జట్టులో ఆడించడం అత్యంత ఆవశ్యకమని భావిస్తున్నది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ కూడా చేయగలిగే సామర్థ్యమున్న గ్రీన్..  మరో షేన్ వాట్సన్ అవుతాడని అంతా భావిస్తున్నారు. 

ఇప్పటికే  ఐపీఎల్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీలైన  ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో పాటు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా వేలంలో గ్రీన్ ను దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

click me!