ధోని ఉన్నప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు.. కానీ ఇప్పుడు మేమే పోటీదారులం: పాక్ మాజీ సారథి కామెంట్స్

First Published Oct 9, 2022, 12:08 PM IST

IND vs PAK T20I: టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ మధ్య మరో రసవత్తర పోరుకు మెల్బోర్న్ క్రికెట్  గ్రౌండ్ ఆథిత్యమివవ్వనున్నది. ఈ నేపథ్యంలో పాక్ మాజీలు మైండ్ గేమ్ కు తెరలేపారు.  గతేడాది ఫలితం రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

క్రికెట్ లో అత్యంత ఆసక్తికరపోరులలో ఒకటిగా గుర్తింపుపొందిన  భారత్-పాకిస్తాన్ మ్యాచ్ గురించి ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. పలు కారణాల వల్ల ఈ రెండు జట్ల మధ్య ఐసీసీ, ఆసియా టోర్నీలలో మినహా  ద్వైపాక్షిక సిరీస్ లు లేవు. ఈ నేపథ్యంలో రాబోయే టీ20  ప్రపంచకప్ లో ఎవరు గెలుస్తారు..?అనే విషయమై చర్చలు జోరుగా సాగుతున్నాయి. 

ఐసీసీ టోర్నీలలో తొలిసారిగా  పాకిస్తాన్ జట్టు.. గతేడాది టీ20  ప్రపంచకప్ లో భాగంగా భారత్ ను ఓడించింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అన్ని రంగాల్లో విఫలమై ఓటమిని కొనితెచ్చుకుంది.  ఇక కొద్దిరోజుల క్రితం ఆసియా కప్ లో ఇరు జట్లు రెండు సార్లు తలపడగా భారత్, పాక్ లు తలో మ్యాచ్ గెలిచాయి.  

ఇక రాబోయే మ్యాచ్ లో  గెలుపెవరది..? అనే చర్చలో భాగంగా   పాకిస్తాన్  మాజీ సారథి షాహిద్ అఫ్రిది ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గతంలో భారత జట్టుకు మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు పాకిస్తాన్ ను అంతగా పట్టించుకోలేదని కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని చెప్పాడు. 

మెగా ఫైట్ కు మరో రెండు వారాల సమయమున్న నేపథ్యంలో పాకిస్తాన్ లోని ఓ టీవీ ఛానెల్ చర్చలో పాల్గొన్న అఫ్రిది.. ‘ధోని సారథ్యంలో భారత జట్టు  అప్రోచ్ పూర్తిగా మారింది. ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ లలో సాధారణంగా ఉండే వైరాన్ని అతడు పెద్దగా పట్టించుకోలేదు.  పాక్ తో ఆడిన  మ్యాచ్ లలో విజయాలు ఎక్కువగా సాధించాడు. 

ధోని తమ ప్రధాన ప్రత్యర్థులుగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను చూశాడే తప్ప పాకిస్తాన్ ను అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్తాన్ టీ20 ఫార్మాట్ లో అద్భుతాలు సృష్టిస్తున్నది.  భారత్ కు కఠిన సవాళ్లు విసరడానికి పాక్ సిద్ధంగా ఉన్నది. అందుకు గతేడాది టీ20 ప్రపంచకప్ విజయమే  సాక్ష్యం..’అని అన్నాడు. 

టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత్-పాకిస్తాన్ లు ఈనెల 23న మెల్బోర్న్ లో తలపడబోతున్న విషయం తెలిసిందే.  స్వదేశంలో వరుస సిరీస్ విజయాలతో దూసుకుపోతున్న రోహిత్ అండ్ కో.. పాకిస్తాన్ తో తొలి మ్యాచ్  ద్వారా ప్రపంచకప్ వేటను  ప్రారంభించనున్నది. ఈ మెగా టోర్నీ కోసం భారత జట్టు ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరి ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

click me!