వాళ్లు బాదుతున్నారుగా.. ఇక ధావన్ కు కష్టకాలమే.. లంకతో వన్డే సిరీస్ లో చోటు అనుమానమే.. కార్తీక్ కామెంట్స్

First Published Dec 12, 2022, 6:55 PM IST

టీమిండియాలో వన్డేలకు రోహిత్ శర్మ లేనప్పుడు  సారథిగా వ్యవహరిస్తున్న  శిఖర్ ధావన్ కెరీర్ దాదాపు ముగింపుదశకు చేరిందని అంటున్నాడు  వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్.  ఇకపై ధావన్  తుది జట్టులో స్థానం దక్కించుకోవడం కష్టమే అని చెబుతున్నాడు. 

వన్డే క్రికెట్ లో భారత్ కు ఆధునిక క్రికెట్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ల తర్వాత శిఖర్ ధావన్ చాలా ముఖ్యుడు. గత దశాబ్దంలో  గబ్బర్.. హిట్ మ్యాన్ తో కలిసి   మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లు ఎన్నో ఆడాడు.  అయితే  వన్డేలలో ఆడే ధావన్.. చాలాకాలంగా ఈ ఒక్క ఫార్మాట్ కే పరిమితమయ్యాడు. టెస్టు, టీ20లలో  ధావన్ ను  బీసీసీఐ పట్టించుకోవడం లేదు. 

ఇక వన్డేలలో కూడా ధావన్ ఇటీవల కాలంలో  పేలవ ఫామ్ తో  నిరాశపరుస్తున్నాడు. వెస్టిండీస్, జింబాబ్వే సిరీస్ లలో ఫర్వాలేదనిపించిన ధావన్..  స్వదేశంలో సౌతాఫ్రికా సిరీస్ తో పాటు కొద్దిరోజుల క్రితం ముగిసిన న్యూజిలాండ్ సిరీస్ లో కూడా విఫలమ్యాడు.  తాజాగా బంగ్లాదేశ్  తో వన్డే సిరీస్ లో మూడు మ్యాచ్ లలో కలిపి 18 పరుగులే  చేశాడు. 

అయితే రెండో వన్డేలో  గాయపడ్డ రోహిత్ శర్మ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేయడం.. మరోవైపు శుభమన్ గిల్ కూడా  నిలకడగా రాణిస్తుండటంతో  వన్డే జట్టులో ధావన్ కు చోటు దక్కడం అనుమానంగానే మారింది. వన్డే ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టును తయారుచేస్తున్న టీమిండియా.. ధావన్  ను  పక్కనబెట్టి కొత్త ఆటగాళ్లను ప్రయత్నించాలని  వాదనలు వినిపిస్తున్నాయి. 
 

రోహిత్  తిరిగి జట్టులోకి వస్తే అతడే ఓపెనర్ గా వస్తాడు. అతడికి  జోడీగా ఇషాన్ గానీ, శుభమన్ గిల్ ను గానీ  ఎంపిక  చేస్తే అప్పుడు ధావన్ కు చోటు దక్కదు.  సెలక్టర్లు కూడా  త్వరలో శ్రీలంకతో జరిగే  వన్డే సిరీస్ కు ధావన్ ను కాకుండా ఇషాన్  ను గానీ గిల్ ను గానీ ఆడించాలని  భావిస్తే  తుది జట్టులో గబ్బర్ ప్లేస్ గోవిందా.. అని  టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్  అంటున్నాడు. 

ఇషాన్ డబుల్ సెంచరీ, గిల్ నిలకడైన ప్రదర్శనల  నేపథ్యంలో  కార్తీక్ మాట్లాడుతూ.. ‘స్వదేశంలో శ్రీలంకతో  జరిగే వన్డే సిరీస్ కు ధావన్ కు చోటు దక్కడం అనుమానమే.  ఓపెనింగ్ స్థానానికి చాలా పోటీ ఉంది.   డబుల్ సెంచరీ తర్వాత ఇషాన్ ను పక్కనబెట్టే సాహసం సెలక్టర్లు చేయకపోవచ్చు.   మరోవైపు గిల్ కూడా రాణిస్తున్నాడు.  రోహిత్ తిరిగి జట్టులో చేరితే  వీరి ముగ్గురిలో  ఎవరినైనా తప్పించాల్సి వస్తే అది ధావనే అవుతాడని నా అభిప్రాయం. 
 

ఒకవేళ ఇదే జరిగితే  ధావన్ అద్భుత కెరీర్ కు విషాదకరమైన ముగింపు తప్పేలా లేదు.  సీనియర్, అతడు టీమిండియాకు చేసిన సేవల దృష్ట్యా  జట్టులోకి తీసుకున్నా  తుది జట్టులో చోటు దక్కడం ప్రశ్నార్థకమే..ఈ ప్రశ్నలకు  కొత్తగా వచ్చే సెలక్టర్లు సమాధానం చెప్పాల్సి ఉంది..’ అని  క్రిక్ బజ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు. 

click me!