డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతామన్నారు.. టాప్-5లో చోటు దక్కించుకున్నా గొప్పే.. ఫైనల్ రేసు నుంచి పాక్ ఔట్

First Published Dec 12, 2022, 4:52 PM IST

PAKvsENG 2nd Test: ఇంగ్లాండ్ చేతిలో వరుసగా రెండు టెస్టులు ఓడిన   పాకిస్తాన్‌కు మరో భారీ షాక్ తాకింది. ఆ జట్టు  ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ నుంచి  కూడా అధికారికంగా నిష్క్రమించింది. 

‘మేం వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ఆడేందుకు ఆశగా ఎదురుచూస్తున్నాం. ఇది చాలా ముఖ్యమైన సిరీస్. వచ్చే ఐదు టెస్టుల్లో మేం నాలుగు గెలిచినా, ఫైనల్ ఆడేందుకు అవకాశం ఉంటుంది.. ఈ సిరీస్‌కి ముందు మాకు కావాల్సినంత విశ్రాంతి సమయం దొరికింది..మా బౌలింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. ఇంగ్లాండ్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తాం. నసీం షా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు... మేం ఈ టెస్టు సిరీస్ గెలుస్తామనే నమ్మకం ఉంది..’  ఇంగ్లాండ్ తో  టెస్టు సిరీస్  ప్రారంభానికి ముందు రావల్పిండిలో బాబర్ ఆజమ్  స్టేట్మెంట్ ఇది. 

రెండు వారాల తర్వాత  అంతా తలకిందులు.  రావల్పిండి టెస్టులో పాకిస్తాన్ కు బజ్ బాల్ ఆట ఎలా ఉంటుందో రుచి చూపించిన  ఇంగ్లాండ్.. ముల్తాన్ లో దానికి  ఇంకాస్త  కొసరు దట్టించి మరీ   అపజయాన్ని  అందించింది. ఉత్కంఠగా ముగిసిన రెండు టెస్టులలోనూ  ఇంగ్లాండ్ దే విజయం. 

ముల్తాన్ టెస్టు విజయంతో ఇంగ్లాండ్ 2-0 తేడాతో మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ఇంగ్లాండ్ కు కొత్తగా వచ్చేదేమీ లేకున్నా  పాకిస్తాన్ కు మాత్రం  ఉన్న ఒక్క ఆశా పోయింది. ఇప్పుడు ఆ జట్టు  వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్  రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. రావల్పిండి టెస్టుకు  ముందు డబ్ల్యూటీసీ  పాయింట్ల పట్టికలో  ఐదో స్థానంలో ఉన్న  పాకిస్తాన్.. ఈ ఓటమి తర్వాత ఆరో స్థానానికి పడిపోయింది. 

రావల్పిండి టెస్టులో 74 పరుగుల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్.. ముల్తాన్ లో 26 రన్స్ తేడాతో  గెలిచి  పాక్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఆశల మీద నీళ్లు చల్లింది.  ఇక ఈ ఓటమితో  పాకిస్తాన్.. కరాచీలో జరుగబోయే మూడో టెస్టుతో పాటు  తర్వాత  సొంతగడ్డమీద ఆడబోయే ఐదు టెస్టులలో గెలిచినా ఓడినా పెద్ద ప్రయోజనమేమీ లేదు. 

ప్రస్తుతం  డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను ఓసారి పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా   108 పాయింట్లు  సాధించి  75 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా  సౌతాఫ్రికా  72 పాయింట్లు 60 శాతంతో రెండో స్థానంలో ఉంది. శ్రీలంకకు 64 పాయింట్లు (53.33 శాతం) ఉండగా టీమిండియా.. 75 పాయింట్లు, 52.08శాతంతో నాలుగో స్థానంలో ఉంది.  

ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ చేరాలంటే రాబోయే బంగ్లాదేశ్ సిరీస్ ను 2-0తో ఓడించి తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా   సిరీస్ ను 3-0 లేదా 4-0 తో గెలిస్తే అప్పుడు ఫైనల్ చేరడానికి భారత్ కు అవకాశాలుంటాయి.  
 

click me!