రోహిత్ శర్మ గాయంపై అనుమానాలు... అదే నిజమైతే నెల రోజుల్లో రికవరీ సాధ్యమేనా...

First Published Dec 16, 2021, 3:57 PM IST

సౌతాఫ్రికా టూర్‌కి ముందు రోహిత్ శర్మ గాయపడడంతో పూర్తిగా టెస్టు సిరీస్‌కి దూరమైన విషయం తెలిసిందే. అయితే తొడ కండరాలు పట్టేయడంతో రోహిత్ శర్మ, టెస్టు సిరీస్‌‌కి దూరమయ్యాడని బీసీసీఐ ప్రకటించడంపై అనుమానాలు రేగుతున్నాయి...

క్రికెట్, ఫుట్‌బాల్, టెన్నిస్ వంటి క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులందరికీ ఈ ‘హామ్‌స్ట్రింగ్ గాయం’ (తొడ కండరాలు పట్టేయడం) సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది...

సరైన ఫిట్‌నెస్ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఆకస్మాత్తుగా కాళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడినప్పుడు... ఇలా తొడ కండరాలు పట్టేస్తుంటాయి...

తాజాగా సౌతాఫ్రికా టూర్‌కి ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కి దూరమైన టెస్టు టీమ్ ప్లేయర్లు అందరూ తమ ఫిట్‌‌నెస్ నిరూపించుకునేందుకు ముంబైలో బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే ఏర్పాటు చేసిన మినీ క్యాంపులో పాల్గొన్నారు. 

రోహిత్ శర్మతో పాటు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి ముందు గాయపడిన కెఎల్ రాహుల్, గాయంతో రెండో టెస్టులో బరిలో దిగని అజింకా రహానే... న్యూజిలాండ్‌తో సిరీస్ నుంచి విశ్రాంతి తీసుకున్న శార్దూల్ ఠాకూర్, రిషబ్ పంత్, జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ ఈ మినీ క్యాంపులో పాల్గొన్నారు...

ఈ మినీ క్యాంపులోనే రోహిత్ శర్మకు ఎడమ కాలికి హామ్‌స్ట్రింగ్ గాయమైందని, ఈ గాయం కారణంగానే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కి అతను అందుబాటులో ఉండడని, ప్రియాంక్ పంచల్‌కి అవకాశం ఇస్తున్నట్టు ప్రకటించింది బీసీసీఐ...

అయితే డాక్టర్ల అంచనా ప్రకారం హార్మ్‌స్ట్రింగ్ గాయాన్ని టియర్ 1,2,3గా విభజిస్తారు. టియర్ 1 అంటే సాధారణ గాయం, టియర్ 2 అంటే సాధారణం కంటే ఎక్కువ, టియర్ 3 అంటే తీవ్రమైన గాయం...

టియర్ 1 గాయం నుంచి కోలుకోవడానికి అథ్లెట్స్ కనీసం 8 నుంచి 10 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. టియర్ 2, 3 గాయమైతే కనీసం నాలుగైదు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిందే...

ఈ హామ్‌స్ట్రింగ్ గాయం పూర్తిగా తగ్గకుండా మళ్లీ ఆడితే, అది మరింత తీవ్రం అవుతుంది. ఆస్ట్రేలియా టూర్‌లో డేవిడ్ వార్నర్‌కి ఇలాగే జరిగింది. రెండో టీ20లో గాయపడిన వార్నర్, పూర్తిగా కోలుకోకపోయినా జట్టు కోసం మూడో టెస్టులో ఆడించింది ఆస్ట్రేలియా...

గాయం తిరగబెట్టడంతో దాదాపు నాలుగు నెలల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కి దూరంగా గడిపాడు డేవిడ్ వార్నర్. మరి రోహిత్ శర్మ, కేవలం నెల రోజుల్లో ఈ గాయం నుంచి ఎలా కోలుకుంటాడు? వన్డే సిరీస్ సమయానికి జట్టుకి ఎలా అందుబాటులోకి వస్తాడు? టీమిండియా ఫ్యాన్స్‌ను కలవరబెడుతున్న అనుమానాలు ఇవి...

ఈ మధ్య టీమిండియా గాయాలను రిప్లేస్‌మెంట్ ఆప్షన్లుగా వాడుతోంది. న్యూజిలాండ్‌తో టూర్‌కి ముందు గాయపడిన కెఎల్ రాహుల్, తన గర్ల్‌ఫ్రెండ్‌తో పార్టీలకు హాజరవుతూ కనిపించాడు. రాహుల్ గాయం నిజమా? లేక గర్ల్‌ఫ్రెండ్‌‌తో తిరగడానికి గాయాన్ని సాకుగా చూపించాడా? అనే అనుమానాలు రేగాయి...

ఇప్పుడు తొడ కండరాలు పట్టేయడంతో టెస్టు సిరీస్‌కి దూరమైన రోహిత్ శర్మ, నిజంగా గాయపడ్డాడా? లేక సౌతాఫ్రికా పిచ్‌లపై ఏ మాత్రం మెరుగైన రికార్డు లేని రోహిత్, అక్కడ ఫెయిల్ అయితే మరోసారి తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ వంకతో తప్పుకున్నాడా? అని అనుమానిస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్...

నిజంగా రోహిత్ శర్మకు అయిన గాయం నిజమైతే, అతను వన్డే సిరీస్‌ సమయానికి కోలుకోవడం కష్టమే. కనీసం 8 వారాల విశ్రాంతి తీసుకోవాలంటే, టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ కూడా ముగిసిపోతుంది. ఒకవేళ రోహిత్ వన్డే సిరీస్‌లో ఆడితే మాత్రం... అతని గాయం నుంచి ఇంత త్వరగా ఎలా కోలుకున్నాడనేది అంతుచిక్కని ప్రశ్నగా మారనుంది...

click me!