నేడే టీ20 వరల్డ్‌కప్‌కి భారత జట్టు ఎంపిక... సెలక్టర్లకు తలనొప్పిగా మారిన జట్టు ఎంపిక...

First Published Sep 7, 2021, 12:11 PM IST

టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీకి సమయం దగ్గర పడింది. వరల్డ్‌కప్ ఆడే జట్లను ప్రకటించేందుకు ఐసీసీ విధించిన డెడ్‌లైన్ కూడా దగ్గర పడింది. దీంతో నేడు భారత సారథి విరాట్ కోహ్లీ, బీసీసీఐ సెలక్టర్లు, ఐసోలేషన్‌లో ఉన్న రవిశాస్త్రి కలిసి వీడియో కాన్ఫిడెన్స్ ద్వారా సమావేశమై, జట్టును ప్రకటించనున్నారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ కోసం కేవలం 15 మంది ప్లేయర్లను మాత్రమే అనుమతిస్తామని ప్రకటించింది ఐసీసీ. అదనంగా రిజర్వు ప్లేయర్లను తేవాలనుకుంటే, వారికయ్యే ఖర్చును ఆయా దేశాల బోర్డులే భరించాల్సి ఉంటుందని తెలిపింది...

టీ20 వరల్డ్‌కప్ కోసం 15 మందితో కూడిన జట్టును ప్రకటించడం, బీసీసీఐ సెలక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రస్తుతం దాదాపు 25 నుంచి 30 మంది ప్లేయర్లు టీమిండియాలో ప్లేస్ కోసం ఎదురుచూస్తుండడంతో తీవ్రమైన పోటీ నెలకొంది...

కేవలం ఓపెనర్ ప్లేస్ కోసమే ఐదుగురు ప్లేయర్లు పోటీలో ఉండడం, భారత జట్టు రిజర్వు బెంచ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓపెనర్‌గా రోహిత్ శర్మ ప్లేస్ కన్ఫార్మ్, అతనితో ఓపెనింగ్ చేసే మరో ప్లేయర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది...

ఐపీఎల్ 2020, 2021 సీజన్ ఫేజ్ 1లో శిఖర్ ధావన్ ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు. అలాగే కెఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఇద్దరితో పాటు పృథ్వీషా కూడా టీ20 వరల్డ్‌కప్‌లో ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నాడు...

ఈ ముగ్గురిలో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి ప్లేస్ ఇస్తారా? లేదా? అనేది అనుమానంగా మారింది. కెఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా కాకపోయినా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా, రెండో వికెట్ కీపర్‌గా ఎంపిక చేయడం ఖాయం...

భారత సారథి విరాట్ కోహ్లీ కూడా అవసరమైతే ఓపెనర్‌గా వచ్చేందుకు సిద్ధమంటూ ఐపీఎల్‌ 2021 ఫేజ్ 1కి ముందే ప్రకటించాడు. దీంతో టీ20 వరల్డ్‌కప్‌లో జట్టు ఎంపిక ఆసక్తికరంగా మారింది...

సూర్యకుమార్ యాదవ్ వన్‌డౌన్ ప్లేయర్‌గా, టూ డౌన్ ప్లేయర్‌గా ఆకట్టుకునే పర్ఫామెన్స్ ఇచ్చాడు. దీంతో టూ డౌన్‌లో సెటిల్ అయిన శ్రేయాస్ అయ్యర్‌కి టీ20 వరల్డ్‌కప్ టీమ్‌లో ప్లేస్ ఉంటుందా? లేదా? అనేది అనుమానంగా మారింది..

గాయం నుంచి కోలుకున్నప్పటికీ శ్రేయాస్ అయ్యర్, ఇప్పటిదాకా ఏ మ్యాచ్ ఆడలేదు. కాబట్టి అతని పర్ఫామెన్స్‌పై సెలక్టర్లకు అనుమానాలు ఉండొచ్చు... 

విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావాలనుకుంటే వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్‌ను లేదా సూర్యకుమార్ యాదవ్‌ను ఆడించే అవకాశం ఉంటుంది.. ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేస్తే, మరో వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కూడా అందుబాటులో ఉంటాడు...

సంజూ శాంసన్, శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. రాకరాక అందివచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు. కాబట్టి అతనికి టీ20 వరల్డ్‌కప్ ఆడే అవకాశం లేనట్టే...

వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్లేస్ కన్ఫార్మ్... ఐపీఎల్ 2020 ముందు కెఎల్ రాహుల్ కారణంగా అతని ప్లేస్‌‌పై అనుమానాలున్నా, ఇప్పుడు పంత్ ఉన్న ఫామ్‌కి టీ20 వరల్డ్‌కప్‌లో అతని అవసరం చాలా ఉంది...

ఫాస్ట్ బౌలర్‌గా జస్ప్రిత్ బుమ్రా, స్పిన్ బౌలర్‌గా యజ్వేంద్ర చాహాల్, ఆల్‌రౌండర్‌లుగా హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా ప్లేస్‌లు కన్ఫార్మ్... మిగిలిన ప్లేస్‌ల కోసం కూడా విపరీతమైన పోటీ ఉంది...

దీపక్ చాహార్, శ్రీలంక టూర్‌లో అదరగొట్టాడు. భువనేశ్వర్ కుమార్ స్థాయికి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు... నటరాజన్, నవ్‌దీప్ సైనీ గాయం నుంచి కోలుకున్న తర్వాత ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు...

శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, రాహుల్ చాహార్, కృనాల్ పాండ్యాలతో పాటు దేవ్‌దత్ పడిక్కల్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి ప్లేయర్లకు టీ20 వరల్డ్‌కప్ 2021 జట్టులో చోటు దక్కొచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

click me!