ఇప్పటికైతే అన్నీ మంచి శకునములే.. కానీ ఈ సెంచరీల మొనగాళ్లు, వికెట్ల వీరులు ‘ఓవల్’లో మెరుస్తారా..?

First Published | May 27, 2023, 11:13 AM IST

WTC Finals 2023:  ఐపీఎల్ - 16 సీజన్ ద్వారా టీమిండియాకు  కాస్త మంచే జరిగింది.  వచ్చే నెల  7 - 11 మధ్య ఆసీస్ తో  జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  ఫైనల్  కు ముందు  టీమిండియా ఆటగాళ్లు భీకర ఫామ్ లో  ఉన్నారు. 

Image credit: PTI

బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీ ముగిసిన తర్వాత మొదలైన  ఇండియన్ ప్రీమియర్ లీగ్  - 16వ ఎడిషన్ లో   పాల్గొన్న  భారత  క్రికెటర్లకు.. వచ్చే నెల   7 నుంచి 11 వరకూ   ‘ది ఓవల్’ వేదికగా ఆసీస్ తో జరుగబోయే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  ఫైనల్ కు ముందు మంచి మ్యాచ్ ప్రాక్టీస్ దొరికింది.  

భారత స్టార్ ఆటగాళ్లు అయిన విరాట్ కోహ్లీ,  శుభ్‌మన్ గిల్ లు ఈ  సీజన్ లో పరుగుల వరద పారిస్తున్నారు.  గిల్.. 16 మ్యాచ్ లు ఆడి 16 ఇన్నింగ్స్ లో 60కి  పైగా సగటుతో  851 పరుగులు చేశాడు. ఈ ఏడాది వన్డేలు, టీ20లు, టెస్టులలో  చేసిన సెంచరీలను ఐపీఎల్ లో కూడా కొనసాగించాడు. గిల్ భీకర ఫామ్ లో  మూడు సెంచరీలు కూడా ఉన్నాయి. 


మరోవైపు  గతేడాది ఆగస్టులో ఆసియా కప్ ద్వారా ఫామ్ లోకి వచ్చిన కోహ్లీ.. ఈ ఏడాది  ఆరంభంలో న్యూజిలాండ్, శ్రీలంకతో పాటు ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ టెస్టులో కూడాక సెంచరీ చేశాడు.  ఐపీఎల్ -16 లో  కూడా  కోహ్లీ..  14 మ్యాచ్ లు ఆడి   14 ఇన్నింగ్స్ లలో  56 సగటుతో 639 రన్స్ చేశాడు.  కోహ్లీ కూడా రెండు  బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో జోరుమీదే ఉన్నాడు. 

కోహ్లీ - గిల్ లు మాత్రమే గాక   ఇంగ్లాండ్ లోనే కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్న నయా వాల్ ఛతేశ్వర్ పుజారా కూడా ఈ సీజన్ లో సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. ససెక్స్ టీమ్ తరఫున ఆడుతున్న ఇప్పటికే  పుజారా మూడు సెంచరీలు చేశాడు. 

ఈ ముగ్గురూ  వేర్వేరు టీమ్ లకు ఆడుతూ సెంచరీలు చేసినా టీమిండియా   కోణంలో చూస్తే  భారత జట్టుకు మేలు చేసేదే.  టాపార్డర్ లో ఈ ముగ్గురూ కీలక బ్యాటర్లు.  డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో భారత జట్టు బ్యాటింగ్ ఆశలన్నీ వీరిమీదే ఉన్నాయి. వీరికి తోడు  తిరిగి జట్టులోకి వచ్చిన రహానే.. ఐపీఎల్ -16 సీజన్లో మెరుపులు మెరిపించినా తర్వాత  ఆ  స్థాయి ప్రదర్శన చేయకున్నా  మంచి టచ్ లోనే ఉన్నాడు.  కెప్టెన్ రోహిత్ శర్మ కూడా  ఫామ్ అందుకుంటే ఇక టీమిండియా బ్యాటింగ్ కు తిరుగుండదు. అయితే ఇదేమీ అంత ఈజీ కాదు.  ఐపీఎల్ జరుగుతున్నది ఇండియాలో.. డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరిగేది ఇంగ్లాండ్‌లో..!

Image credit: PTI

బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా భారత్ కు సానుకూలాంశాలు చాలా ఉన్నాయి.   ఐపీఎల్-16 లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో  గుజరాత్ కు ఆడుతున్న టీమిండియా పేసర్ మహ్మద్ షమీ .. 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. 

మరో  భారత  స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కూడా 14 మ్యాచ్ లలో   19 వికెట్లు తీశాడు.  టీమిండియా స్పిన్నర్ రవీంద్ర జడేజా     15 మ్యాచ్ లలో  19 వికెట్లు పడగొట్టి జోరుమీదే ఉన్నాడు. అశ్విన్  సైతం..  13 మ్యాచ్ లలో 14 వికెట్లు పడగొట్టాడు. డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో టీమిండియా ప్రధాన బౌలింగ్ యూనిట్ అంతా   ఐపీఎల్ లో అదరగొట్టే ప్రదర్శనలతో  జోరుమీదున్నవారే. 

Image credit: PTI

మరి ఈ  సెంచరీ  మొనగాళ్లు, వికెట్ల వీరులు డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో  ఇదే ఫామ్ ను కొనసాగిస్తారా..? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.  డబ్ల్యూటీసీ ఫైనల్స్ జరిగే ది ఓవల్ గ్రౌండ్ బంతితో పాటు బ్యాటింగ్ కు కూడా అనుకూలంగా ఉంటుంది.   ఇది కాస్త సానుకూలాంశమే.  

కానీ  ఓవల్ లో టీమిండియాకు చెత్త రికార్డు ఉంది. ‘ది ఓవల్’ గ్రౌండ్ లో ఇంతవరకూ 14 టెస్టులు ఆడిన భారత జట్టు రెండింటిలో మాత్రమే గెలిచి ఐదు ఓడింది.  ఏడు టెస్టులు డ్రా అయ్యాయి.  ఐపీఎల్ లో రాణించి ఐసీసీ ట్రోఫీలలో విఫలమవడం భారత ఆటగాళ్లకు  చాలాకాలంగా ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయమే.. అయితే ఆస్ట్రేలియాకు కూడా ఓవల్ లో గొప్ప రికార్డేమీ లేదు.  ఇక్కడ 38 టెస్టులు ఆడిన ఆసీస్.. ఏడు గెలిచి 17 మ్యాచ్ లు ఓడింది.  14  టెస్టులు డ్రా అయ్యాయి. 

Latest Videos

click me!