నేను చేసిన బిగ్గెస్ట్ గ్యాంబిల్ అదే... ఆస్ట్రేలియా టూర్‌లో ఆ టెస్టు మ్యాచ్ గెలవడానికి...

First Published Dec 30, 2021, 8:41 PM IST

రవిశాస్త్రి కోచింగ్‌లో, విరాట్ కోహ్లీ సారథ్యంలో టెస్టుల్లో తిరుగులేని శక్తిగా ఎదిగింది భారత జట్టు. ఆస్ట్రేలియా టూర్‌లో రెండు సార్లు టెస్టు సిరీస్‌లు గెలిచిన భారత జట్టు, ఇంగ్లాండ్ పర్యటనలోనూ సిరీస్ గెలవగలిగింది...

2018-19 ఆసీస్ టూర్‌లో ఆతిథ్య జట్టును చిత్తు చేసి 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది భారత జట్టు. ఆస్ట్రేలియా గడ్డపై గెలిచిన మొట్టమొదటి టెస్టు సిరీస్ ఇదే...

ఆడిలైడ్‌లో జరిగిన టెస్టులో 31 పరుగుల తేడాతో గెలిచిన విరాట్ సేన, ఆ తర్వాత పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో 146 పరుగుల తేడాతో ఓడింది. ఈ సమయంలో తాను కోచ్‌గా అతిపెద్ద గ్యాంబ్లింగ్ చేశానని అంటున్నాడు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

‘2019 ఆస్ట్రేలియా సిరీస్‌ చాలా అద్భుతంగా సాగింది. టెస్టును విజయంతో ఆరంభిస్తే, సిరీస్ గెలవడానికి అవకాశం ఉంటుందని ముందుగానే భావించాం...

అనుకున్నట్టుగానే ఆడిలైడ్‌ టెస్టులో విజయాన్ని అందుకున్నాడు. గెలిచింది 30 పరుగుల తేడాతో అయినా, అది కూడా చాలా గొప్ప విజయమే ఎందుకంటే ఆఖరి దాకా పట్టువదలకుండా గెలుస్తామనే ధీమాతో ఆడాం...

పెర్త్‌లో మ్యాచ్ ఓడిపోయాం. ఆ పిచ్ వారి బౌలింగ్‌కి బాగా సహకరించింది, కాబట్టి భారత జట్టును చిత్తుగా ఓడించగలిగారు. అయితే పెర్త్‌లో విరాట్ కోహ్లీ చేసిన సెంచరీ, అతని కెరీర్‌లో చాలా మంచి సెంచరీల్లో ఒకటి...

మెల్‌బోర్న్‌ టెస్టుకి ముందు జడేజా గాయం నుంచి కోలుకున్నాడు. అశ్విన్ గాయపడి జట్టుకి దూరమయ్యాడు. కాబట్టి మరో ప్లేయర్ అవసరం వచ్చింది. అప్పటికే సిరీస్ 1-1 తేడాతో సమంగా ఉంది...

మా ఓపెనర్లు సిరీస్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోయారు. కాబట్టి మూడో టెస్టులో గెలిచి, ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలంటే మంచి ఓపెనర్లు అవసరమని భావించాం... అందుకే మెల్‌బోర్న్ టెస్టులో ఓపెనర్లను మార్చాలని డిసైడ్ అయ్యాం...

ఇద్దరు కొత్త ప్లేయర్లతో ఓపెనింగ్ చేయించాలని అనుకున్నాం. మయాంక్ అగర్వాల్... ఆ మ్యాచ్‌కి మూడు రోజుల ముందే ఆస్ట్రేలియాకి వచ్చాడు, అప్పుడు అతనికి సిద్ధంగా ఉండమని చెప్పాను...

ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై ఆడుతున్నాననే ఆలోచన లేకుండా, మరో మ్యాచ్‌గా మాత్రమే చూడమని చెప్పా. అతనితో పాటు హనుమ విహారిని ఓపెనర్‌గా దింపాం. ఇద్దరూ తొలి సెషన్‌లో బాగా రాణించారు...

భారీ భాగస్వామ్యం నెలకొల్పకపోయినా మొదటి సెషన్‌లో ఎక్కువ బంతులు ఎదుర్కొని, బంతి పాతబడేదాకా క్రీజులో పాతుకుపోవాలని సూచించాం. వాళ్లు అదే చేశాం... ఆ తర్వాతే జరిగింది అందరికీ తెలిసిందే...’ అంటూ చెప్పుకొచ్చాడు రవిశాస్త్రి...

మయాంక్ అగర్వాల్ మెల్‌బోర్న్ టెస్టులో 76 పరుగులు చేయగా, ఓపెనర్‌గా వచ్చిన హనుమ విహారి 66 బంతుల్లో 8 పరుగులు చేశాడు. 

పూజారా 106, విరాట్ కోహ్లీ 82, అజింకా రహానే 34, రోహిత్ శర్మ 64, రిషబ్ పంత్ 39 పరుగులు చేయడంతో తొలి ఇన్నింగ్స్‌లో 443/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది భారత జట్టు...

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 151 పరుగులకి ఆలౌట్ అయ్యింది. బుమ్రా 6 వికెట్లు తీయగా, జడేజా 2, ఇషాంత్, షమీ చెరో వికెట్ తీశారు. రెండో  ఇన్నింగ్స్‌లో భారత జట్టు 106/8 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. 

398 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలో దిగిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్‌లో 261 పరుగులకి ఆలౌట్ అయ్యింది. 137 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న భారత జట్టు, సిడ్నీలో జరిగిన నాలుగో టెస్టును డ్రా చేసుకుని 2-1 తేడాతో టెస్టు సిరీస్ గెలిచింది.

click me!