ఫస్ట్ బ్యాటింగ్.. మినిమం మూడు వందలు దాటాల్సిందే.. బాదుడే మంత్రంగా మారిన టీమిండియా అప్రోచ్..

First Published Jan 24, 2023, 6:26 PM IST

INDvsNZ 3rd ODI Live: గతేడాది బంగ్లాదేశ్ తో చివరి వన్డేతో పాటు  శ్రీలంకతో మూడు మ్యాచ్ లు,  కివీస్ తో సిరీస్ లో భారత్  ఆరు సార్లు మొదట బ్యాటింగ్ కు వచ్చి  300  ప్లస్ స్కోరు చేసింది.  
 

గతేడాది టీ20 ప్రపంచకప్ లో వైఫల్యమో లేక   వన్డే  వరల్డ్ కప్ ముందు  సన్నాహకాలో ఏమో గానీ  వన్డేలలో భారత జట్టు అప్రోచ్  మారింది.  టాస్ గెలిచినా, ఓడినా తొలుత బ్యాటింగ్ చేయాల్సి వస్తే  దుమ్ము దులుపుతున్నది. న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ తో పాటు ఇటీవల ముగిసిన   శ్రీలంకతో  సిరీస్ లలో స్కోర్లు చూస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నది.  

2022 డిసెంబర్ లో బంగ్లాదేశ్ తో చివరి వన్డేతో పాటు  శ్రీలంకతో మూడు మ్యాచ్ లు,  కివీస్ తో సిరీస్ లో భారత్  ఆరు సార్లు మొదట బ్యాటింగ్ కు వచ్చి  300  ప్లస్ స్కోరు చేసింది.  బంగ్లాదేశ్ తో  ముగిసిన మూడో వన్డేలో భారత్.. తొలుత బ్యాటింగ్ చేసి 409-8 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్ లోనే ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ చేశాడు. కోహ్లీ సెంచరీ బాదాడు.  

ఆ తర్వాత శ్రీలంకతో గువహతిలో  తొలి వన్డేలో  భారత్.. 373-7 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్ లో కూడా కోహ్లీ సెంచరీ చేశాడు. ఓపెనర్లిద్దరూ సెంచరీ పార్ట్నర్ షిప్ నమోదు చేశారు.   ఈ మ్యాచ్ లో విజయంతో భారత్ బోణీ కొట్టింది.  

తర్వాత లంకతో మూడో వన్డేలో  (త్రివేండ్రం)   కూడా భారత్ చెలరేగి ఆడింది.  శుభమన్ గిల్, కోహ్లీల సెంచరీతో  తొలుత బ్యాటింగ్ కు వచ్చి  390-5 పరుగుల భారీ స్కోరు సాధించింది.   లంకతో  భారీ విజయాన్ని నమోదు చేసి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. 

ఇక న్యూజిలాండ్ తో  వన్డే సీరీస్ లో భాగంగా కూడా ఇదే దూకుడును అనుసరిస్తున్నది. హైదరాబాద్ లో ముగిసిన తొలి వన్డేలో   మొదట బ్యాటింగ్ చేసి  349-8  పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ డబుల్ సెంచరీ చేశాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ పోరులో భారత్ దే విజయం.  

తాజాగా ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో కూడా  టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు వచ్చిన ఇండియా.. 385-9  రన్స్ చేసింది.  అంటే గడిచిన ఏడు వన్డేలలో   భారత్ తొలిసారి బ్యాటింగ్ చేసిన ఒక్కసారి కూడా  345కి తక్కువ స్కోరు చేయలేదు.  మధ్యలో శ్రీలంకతో ఒకసారి  219, న్యూజిలాండ్ తో  108 పరుగులను ఛేదించాల్సి వచ్చింది. అప్పుడు ఆ జట్లు భారత బౌలింగ్ కు కకావికలమయ్యాయి.   కనీస పోటీ కూడా లేకుండానే భారత్ ఈ మ్యాచ్ లను గెలుచుకుంది. 

గతంలో   300 స్కోరు చేయడమంటే అదో సాహసం.  300 ప్లస్ స్కోరు చేస్తే మ్యాచ్ లో విజయం  పక్కా అన్నంత ధీమాలో ఉండేవాళ్లు ఆటగాళ్లు. కానీ టీ20ల పుణ్యమా అని పరిస్థితులు మారాయి.    బ్యాటర్లు బాదుడే మంత్రంగా ఆడుతున్నారు. దీంతో గతంలో మాదిరిగా 250 ప్లస్ స్కోరు చేసినా గెలుస్తామన్న ధీమా లేదు. హైదరాబాద్ వన్డేలో భారత్  349 పరుగులు చేసినా కివీస్ బ్యాటర్లు  బ్రాస్‌వెల్, సాంట్నర్ ల దూకుడుతో ఆ జట్టు గెలిచినంత పనిచేసింది.   

వన్డే వరల్డ్ కప్ ముందున్న నేపథ్యంలో దూకుడుగా ఆడటమే టీమిండియా ముందుకు  సాగుతున్నది.  ప్రత్యర్థి జట్లపై ఆది  నుంచీ   పైచేయి సాధించేందుకు గాను   గత కొన్నాళ్లుగా ఇంగ్లాండ్ ఈ దూకుడు మంత్రాన్ని పఠిస్తున్నది. ఈ క్రమంలో ఆ జట్టు సక్సెస్ అవుతోంది. టీమిండియా కూడా ఇప్పుడు ఇదే మంత్రం   ఒంటబట్టించుకుంది.  మరి  ఇదే దూకుడు  అక్టోబర్ లో  జరిగే ప్రపంచకప్ వరకూ కొనసాగిస్తారా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. 

click me!