BCCI Vs Kohli: ఫోన్ ఎత్తి మాట్లాడుకోండి.. దేశాన్ని తలెత్తుకునేలా చేయండి : కోహ్లి, గంగూలీకి కపిల్ సూచన

First Published Jan 26, 2022, 10:50 AM IST

Kapil Dev Comments On Kohli and BCCI Row: కోహ్లి-గంగూలీ మధ్య విబేధాలున్నాయనేది బహిరంగ రహస్యమే. భారత క్రికెట్ లోని ఇద్దరు దిగ్గజాల మధ్య తలెత్తిన విబేధాలు జట్టు మీద తీవ్ర  ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశానికి తొలి ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్ స్పందిస్తూ... 
 

భారత క్రికెట్ లో  గత కొన్నాళ్లుగా  ఏ ఇద్దరిని కదిలిచ్చినా ఒకటే చర్చ. అదే భారత క్రికెట్ కంట్రోల్  బోర్డు (బీసీసీఐ), విరాట్ కోహ్లి మధ్య విబేధాల గురించి.. గతేడాది సెప్టెంబర్ లో దీనికి బీజం పడినా  డిసెంబర్ లో బహిర్గతమైంది.. 
 

కోహ్లి టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం.. ఆ తదనతరం బీసీసీఐ అతడిని వన్డే కెప్టెన్ గా తొలగించి రోహిత్ శర్మను  సారథిగా చేయడం.. ఆ వెనువెంటనే దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు పాత్రికేయుల సమావేశంలో బీసీసీఐ అధ్యక్షుడు  సౌరవ్ గంగూలీ మీద  విరాట్ కోహ్లి చేసిన వ్యాఖ్యలు.. ఆ  తర్వాత  సఫారీలతో టెస్టు సిరీస్ ముగిశాక టెస్టు కెప్టెన్ గా కూడా కోహ్లి వైదొలగడం.. అదేదో సినిమాలో చెప్పినట్టు అంతా కమ్ అండ్ గో లా జరిగిపోయింది. 

పైకి ఎవరెన్ని చెప్పినా  కోహ్లి-గంగూలీ మధ్య విబేధాలున్నాయనేది బహిరంగ రహస్యమే.  అయితే   భారత క్రికెట్ లోని ఇద్దరు దిగ్గజాల  మధ్య తలెత్తిన విబేధాలు జట్టు మీద తీవ్ర  ప్రభావం చూపుతున్నాయి. సౌతాఫ్రికాలో వన్డే సిరీస్ ఓటమికి కారణం భారత జట్టు ప్రదర్శన కంటే కూడా కోహ్లి-బీసీసీఐ ప్రభావమే ఎక్కువగా కనిపించందన్న వాదన కూడా వినిపించింది. 

ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం, దేశానికి తొలి వన్డే  ప్రపంచకప్ అందించిన కపిల్ దేవ్  స్పందించాడు. ఈ ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుంటే గానీ ఈ సమస్య  పరిష్కారం కాదని సూచించాడు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కారణంగా దేశం అబాసుపాలు కాకూడదని సున్నితంగా హెచ్చరించాడు. 

ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ‘వాళ్లు (విరాట్ కోహ్లి-బీసీసీఐ)  ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకుని  సమస్యను పరిష్కరించుకోవాలి. కోహ్లి-గంగూలీలు ఒకరి ఫోన్ ఒకరు ఎత్తి వారి విబేధాల పరిష్కార మార్గం కనుగొనాలి.  ఇద్దరూ కలిసి దేశాన్ని తలెత్తుకునేలా చేయండి.. 

నేను కెప్టెన్ గా ఉన్న సమయంలో కూడా ఇలాంటివి జరిగాయి.  కొత్తగా సారథి అయినప్పుడు నాకు కావాల్సినవన్నీ  దక్కాయి. కానీ తర్వాత పరిస్థితులు మారతాయి. అయినంత మాత్రానా కెప్టెన్సీ వదిలేయాలని కాదు. ఒకవేళ అతడు (కోహ్లి) ఆ కారణంగానే వైదొలిగితే మాత్రం  అతడికి నేనేం చెప్పాలో నాకు తెలియడం లేదు. 

కోహ్లి గొప్ప ఆటగాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అతడు ఇంకా ఎక్కువ పరుగులు  సాధించాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా టెస్టు క్రికెట్ లో అతడు మరిన్ని పరుగులు సాధిస్తే చూడాలనుకుంటున్నాను..’ అని  అన్నాడు. 

click me!