యూఏఈలోనే టీ20 వరల్డ్‌కప్ 2021... ప్రకటించిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

First Published | Jun 28, 2021, 3:38 PM IST

కొన్నిరోజులుగా వినిపిస్తున్న వార్తలను ఖరారు చేస్తూ, భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ వేదికను యూఏఈకి తరలించినట్టు ప్రకటించాడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ...

‘ఇప్పటికే ఐసీసీకి టీ20 వరల్డ్‌కప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నట్టు తెలియచేశాం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియచేయబడతాయి...’ అంటూ తెలిపాడు సౌరవ్ గంగూలీ.
దేశంలో కరోనా సెకండ్ వేవ్‌తో పాటు పన్నుల విషయంలో ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాలు కూడా టీ20 వరల్డ్‌కప్‌ను యూఏఈ వేదికగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడానికి కారణంగా తెలుస్తోంది.

షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 17 నుంచి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ప్రారంభించి, ఫైనల్‌ మ్యాచ్‌ను నవంబర్ 14న నిర్వహించాలని ఐసీసీ షెడ్యూల్ ఖరారు చేసింది.
16 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో 12 జట్లు సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తారు. సూపర్ 12 రౌండ్స్ అక్టోబర్ 24 నుంచి ప్రారంభం అవుతాయి. సూపర్ 8 తర్వాత మూడు ఫ్లేఆఫ్ మ్యాచులు, రెండు సెమీ ఫైనల్స్, ఓ ఫైనల్‌తో టీ20 వరల్డ్‌కప్ ముగుస్తుంది.
బంగ్లాదేశ్, శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నమీబియా, ఓమన్, పపూవ న్యూ జినోవా జట్లు సూపర్ 12లో ప్లేస్‌ కోసం పోరాడబోతున్నాయి.
అంటే షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 17న ప్రారంభమైన టీమిండియికా అక్టోబర్ 24వరకూ సమయం ఉంటుంది.ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా నేరుగా ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల కోసం యూఏఈ చేరుకుంటుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 14లో మిగిలిన మ్యాచులు పూర్తి అయిన తర్వాత నేరుగా టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొంటారు క్రికెటర్లు...
ఐపీఎల్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ కూడా యూఏఈ వేదికగా జరుగుతుండడంతో విదేశీ ప్లేయర్లు కూడా లీగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించే అవకాశం ఉంది.
ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా ప్లేయర్లు ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచుల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తుండగా, ఇంగ్లాండ్ ప్లేయర్ల రాకపై అనుమానాలున్నాయి.
ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్ 19న ప్రారంభించి... అక్టోబర్ 15న ముగించాలని భావిస్తోంది బీసీసీఐ. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన రెండు రోజులకే టీ20 వరల్డ్‌కప్ ప్రారంభం కానుంది.

Latest Videos

click me!