మొన్న న్యూజిలాండ్, నిన్న ఆస్ట్రేలియా... రెండు సెమీ ఫైనల్స్ మధ్య ఇన్ని పోలికలా.

First Published Nov 12, 2021, 11:41 AM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ క్లైమాక్స్‌కి చేరుకుంది. ఆదివారం నవంబర్ 14న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలబడబోతున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటిదాకా టైటిల్ గెలవకపోవడంతో ఈసారి కొత్త విజేతని చూసే అవకాశం దక్కనుంది...

ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ను సెమీస్‌లో ఓడించి ఫైనల్ చేరితే... న్యూజిలాండ్ జట్టు, ఇంగ్లాండ్ టీమ్‌ను ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించింది. అయితే ఈ రెండు జట్ల సెమీ ఫైనల్ మ్యాచ్‌లో చాలా పోలికలు ఉండడం విశేషం...

ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన కేన్ విలియంసన్, మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్, 166 పరుగులు చేసింది...

పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆరోన్ ఫించ్ కూడా మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ కూడా నిర్ణీత 20 ఓవర్లలో సరిగ్గా నాలుగు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది...

ఇంగ్లాండ్ స్కోరుకి, పాకిస్తాన్‌ స్కోరుకి మధ్య తేడా 10 పరుగులు మాత్రమే. ఇరు జట్ల లక్ష్యం 7తో ముగిసేదే... మొదటి సెమీస్‌లో లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మూడో బంతికే మార్టిన్ గుప్టిల్ వికెట్ కోల్పోయింది...

రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఇన్నింగ్స్ మూడో బంతికే అవుట్ అయ్యాడు. ఆసీస్ కెప్టెన్ డకౌట్ అయితే కివీస్ కెప్టెన్ 5 పరుగులు చేసి సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యాడు...

మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌కి ఆఖరి 2 ఓవర్లలో 20 పరుగులు కావాల్సి వచ్చింది. పాకిస్తాన్‌తో జరిగిన రెండో సెమీస్‌లో ఆస్ట్రేలియాకి ఆఖరి రెండు ఓవర్లలో 12 బంతుల్లో 22 పరుగులు కావాల్సి వచ్చింది...

న్యూజిలాండ్ తరుపున డార్ల్ మిచెల్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 20 పరుగులు రాబట్టి మ్యాచ్‌ని ముగించాడు.  ఆస్ట్రేలియా తరుపున మాథ్యూ వేడ్ ఆ బాధ్యత తీసుకుని హ్యాట్రిక్ సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించాడు...

ఈ రెండు సెమీ ఫైనల్ మ్యాచులు 19 ఓవర్లలోనే ముగియగా... విజయానికి కావాల్సిన పరుగులు చేసిన ప్లేయర్లు డార్ల్ మిచెల్, మాథ్యూ వేడ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ కావడం విశేషం... 

అదీకాకుండా మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మార్టిన్ గుప్టిల్ వికెట్ తీసిన క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో మిచెల్ 20 పరుగులు రాబట్టి మ్యాచ్‌ని ఫినిష్ చేస్తే... రెండో సెమీ ఫైనల్‌లో ఆరోన్ ఫించ్ వికెట్ తీసిన షాహీన్ ఆఫ్రిదీ బౌలింగ్‌లో మ్యాచ్‌ను ముగించాడు మాథ్యూ వేడ్...

ఈ పోలికలు ఇక్కడితో ఆగలేదండోయ్... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు బంగ్లాదేశ్ టూర్‌లో టీ20 సిరీస్ ఓడిపోయి రావడం విశేషం...

బంగ్లాదేశ్ టూర్‌కి వెళ్లిన ఆస్ట్రేలియా 1-4 తేడాతో టీ20 సిరీస్ ఓడిపోతే, న్యూజిలాండ్ కూడా బంగ్లా చేతుల్లో 2-3 తేడాతో టీ20 సిరీస్‌ను ఓడిపోయి పొట్టి ప్రపంచకప్‌ 2021 టోర్నీలో అడుగుపెట్టింది...

న్యూజిలాండ్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఫైనల్ చేరడం ఇదే తొలిసారి కాగా, ఆస్ట్రేలియాకి రెండోసారి. ఇంతకుముందు 2010 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతుల్లో ఓడింది ఆసీస్...

click me!