ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ విజయం వెనక టీమిండియా... గతంలో రెండుసార్లు అలాగే...

First Published Nov 15, 2021, 12:28 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో విజయం అందుకుని, మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్‌ను అందుకుంది. అయితే ఆసీస్ విజయం వెనకాల కూడా టీమిండియా హస్తం ఉందట...

ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచినా, టీ20 వరల్డ్‌కప్ లేని లోటును ఏడో ఎడిషన్‌లో పూడ్చేసుకుంది ఆస్ట్రేలియా జట్టు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆరో స్థానంలో ఉన్న ఆసీస్, వరల్డ్‌కప్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు...

పొట్టి ప్రపంచకప్ టోర్నీకి ముందు వరుసగా ఐదు టీ20 టోర్నీలు ఓడిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ పర్యటనలో దారుణమైన ప్రదర్శన కనబర్చింది. అలాంటి ఆసీస్ టీ20 వరల్డ్‌కప్ గెలవడం ఓ అద్భుత విషయమే...

భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రత్యేకమైన వైరం, శత్రుత్వం ఏమీ లేకపోయినా... ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్ గెలిచిన ఆసీస్‌ను ఓడించడం టీమిండియాకి భలే కిక్ ఇచ్చేది. ఆసీస్ ఆధిపత్యానికి చెక్ పెట్టిన దేశాల్లో టీమిండియా కూడా ఒకటి...

అయితే క్రికెట్ ప్రపంచంలో రెండు దశాబ్దాలపాటు తిరుగులేని ఆధిపత్యం చూపించిన ఆస్ట్రేలియాకి 1987లో మొదటి వన్డే వరల్డ్‌కప్ దక్కింది . 1987లో మొట్టమొదటి సారి వన్డే వరల్డ్‌కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చింది భారత్...

పటిష్ట ఇంగ్లాండ్ జట్టును ఫైనల్‌లో ఓడించి, మొట్టమొదటి వన్డే వరల్డ్‌కప్ అందుకుంది ఆసీస్. అదే అక్కడే ఆస్ట్రేలియా, క్రికెట్ వరల్డ్‌లో తిరుగులేని శక్తిగా ఎదగడానికి నాంది పడింది...

అలాగే 2006లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చింది టీమిండియా. ఈ సీజన్‌లో వెస్టిండీస్‌ను ఫైనల్‌లో ఓడించి, మొట్టమొదటి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ అందుకుంది ఆస్ట్రేలియా...

ఇప్పుడు 2021లోనూ ఐసీసీ టీ20 మెన్స్ వరల్డ్‌కప్ టోర్నీ నిర్వహణ బాధ్యతలన్నీ చేపట్టింది బీసీసీఐ. భారత జట్టు పర్యవేక్షణలో జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ఆసీస్ తమ మొట్టమొదటి పొట్టి ప్రపంచకప్ గెలిచింది...

ఇలా భారత జట్టు ఆతిథ్యమిచ్చిన, టీమిండియా పర్యవేక్షణలో నిర్వహించబడిన వన్డే వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఆస్ట్రేలియాకి మొట్టమొదటి టైటిల్స్ రావడం విశేషం...

అంతేకాకుండా ఇప్పటివరకూ గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టుతో మ్యాచులు ఆడిన ఏ జట్టూ కూడా టైటిల్ గెలవలేకపోయింది. ఆ సెంటిమెంట్ కూడా ఆస్ట్రేలియా టైటిల్ గెలవడానికి కారణమైంది...

2007 టోర్నీ నుంచి ఇప్పటివరకూ ఏడు ఎడిషన్లలో టీమిండియాతో కలిసి ఒకే గ్రూప్‌లో మ్యాచులు ఆడిన ఏ జట్టూ టైటిల్ గెలవలేదు. ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తూ, గ్రూప్ స్టేజ్‌లో భారత జట్టును ఓడించిన న్యూజిలాండ్, ఫైనల్‌లో ఆసీస్ చేతుల్లో ఓడింది...

click me!