T20 World Cup 2024: ఇద్ద‌రూ టీమిండియాలో ఉండాల్సిందే.. రోహిత్, కోహ్లీల‌కు మ‌ద్ద‌తుగా సౌర‌వ్ గంగూలీ !

First Published | Jan 8, 2024, 9:05 PM IST

Sourav Ganguly: వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2024 లో పాల్గొనే భార‌త జ‌ట్టులో స్టార్ ప్లేయ‌ర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు కల్పించాల్సిందేన‌ని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భార‌త మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నారు. రోహిత్ శ‌ర్మ‌కు కెప్టెన్సీ ఇవ్వాల‌ని పేర్కొన్నాడు. 
 

Ganguly-Rohit Sharma

T20 World Cup 2024 - Team India : టీ20 వరల్డ్ క‌ప్ 2024 లో భార‌త స్టార్ క్రికెట‌ర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడాలని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. జూన్ 1 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుంది. జూన్ 5న ఐర్లాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్ర‌మంలోనే టీమిండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచారు. ఈ ఇద్ద‌రూ వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడ‌బోయే జ‌ట్టులో ఉండాల్సిందేన‌ని పేర్కొన్నారు.

పొట్టి ఫార్మాట్ లో రోహిత్ శర్మ భార‌త‌ జట్టుకు నాయకత్వం వహించాలనీ, విరాట్ కోహ్లీ కూడా టీమ్ త‌ర‌ఫున ఆడాలని సౌర‌వ్ గంగూలీ అన్నారు. ఇటీవల మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లీ 14 నెలలుగా పొట్టి ఫార్మాట్ కు దూరంగా ఉండటం ఎలాంటి ప్రభావం చూపదని పేర్కొన్నారు. 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత ఈ ఫార్మాట్ కు దూరమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అఫ్గానిస్థాన్ తో జరిగే పొట్టి ఫార్మాట్ సిరీస్ ద్వారా పునరాగమనం చేస్తున్నారు.

Latest Videos


ganguly, rohit, hardik

జూన్ 1 నుంచి వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న 2024 టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్ర‌మంలోనే గంగూలీ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌ధాన్య‌త సంత‌రించుకున్నాయి. 'టీ20 ప్రపంచకప్ లో రోహిత్ శర్మ కచ్చితంగా జట్టుకు నాయకత్వం వహించాలి. విరాట్ కోహ్లీ కూడా ఆడాలి. కోహ్లీ అద్భుతమైన ఆటగాడు. 14 నెలల పాటు ఈ ఫార్మాట్ కు దూరమైన తర్వాత తిరిగి జట్టులోకి వచ్చినా దాని ప్రభావం ఉండదు' అని దాదా  పేర్కొన్నాడు.

అలాగే, భార‌త యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ గురించి కూడా సౌర‌వ్ గంగూలీ ప్ర‌స్తావించారు.  దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో సమర్ధవంతంగా బ్యాటింగ్ చేయడానికి ఇబ్బంది పడిన యువ లెఫ్ట్ హ్యాండర్ యశ‌స్వి జైస్వాల్ తన సత్తాను నిరూపించుకోవడానికి పుష్కలంగా అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నాడు. "రెండో టెస్ట్ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ మంచి బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. అతని కెరీర్ ప్రారంభ దశలో ఉంది. అతనికి చాలా అవకాశాలు లభిస్తాయి" అని గంగూలీ చెప్పారు.

Image credit: Getty

యువ, అనుభవజ్ఞుల కలయికతో బరిలోకి దిగిన భారత్ దక్షిణాఫ్రికా సిరీస్ లో గ‌తంతో పోలిస్తే అద్భుతంగా రాణించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిన భారత్ తిరిగి పుంజుకుని రెండో టెస్టులో విజ‌యం సాధించి సిరీస్ ను 1-1తో సమం చేసింది. 'మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలా విషయాలు చెబుతుంటారు. టీమిండియా బలమైన జట్టు. దక్షిణాఫ్రికా సిరీస్ లో మంచి ప్రదర్శన కనబరిచింది. టీ20, టెస్టు సిరీస్లను సమం చేసి వన్డే సిరీస్ ను గెలుచుకుంది' అని సౌర‌వ్ గంగూలీ గుర్తు చేశారు.

click me!