ఐపీఎల్‌ టైటిల్ గెలవడం, టీమిండియా కెప్టెన్సీ ఒక్కటి కాదు రోహిత్... టీ20 వరల్డ్ కప్ పరాజయంతో...

First Published | Nov 10, 2022, 5:04 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 ట్రోఫీలో టీమిండియా సెమీ ఫైనల్‌లో ఓడి, ఇంటిదారి పట్టింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ స్టేజీలకు వెళ్తున్నా... టైటిల్‌ని మాత్రం అందుకోలేకపోతోంది భారత జట్టు. 2015 వన్డే వరల్డ్ కప్‌లో ఎంఎస్ ధోనీ, 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ స్టేజీల్లో విరాట్ కోహ్లీ... భారత జట్టుకు విజయాలను అందించలేకపోయారు. అయితే ఈసారి టీమిండియా వరల్డ్ కప్ గెలుస్తుందని అనుకున్నారంతా.. కారణం రోహిత్ శర్మ...
 

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఓడింది. అప్పటిదాకా గ్రూప్ మ్యాచుల్లో వరుసగా ఐదు సెంచరీలు చేసిన రోహిత్, సెమీస్‌లో ఫ్లాప్ అయ్యాడు...

Rohit Sharma

టాపార్డర్ కూడా విఫలం కావడంతో వన్డే వరల్డ్ కప్‌లో సెమీస్ నుంచే ఇంటిదారి పట్టింది భారత జట్టు. ఈ పరాజయం నుంచే కెప్టెన్ విరాట్ కోహ్లీపై విమర్శలు రావడం మొదలైంది. ఐపీఎల్‌లో ఒక్క టైటిల్ గెలవలేకపోయిన విరాట్ కోహ్లీ కంటే ముంబై ఇండియన్స్‌ని ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్‌కి కెప్టెన్సీ ఇస్తే బెటర్ అంటూ కామెంట్లు వినిపించాయి..

Latest Videos


టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో పాకిస్తాన్, న్యూజిలాండ్ చేతుల్లో చిత్తుగా ఓడిన టీమిండియా.. గ్రూప్ స్టేజీ నుంచే నిష్కమించింది. ఈ టైమ్‌లో కూడా ఐదు సార్లు ఐపీఎల్ విన్నర్ రోహిత్‌కి టీమిండియా వైట్ వాల్ కెప్టెన్సీ ఇవ్వాలని విమర్శలు వచ్చాయి...

Image credit: Getty

సాధారణ ఐపీఎల్ ఫ్యాన్స్‌తో పాటు సునీల్ గవాస్కర్, గౌతమ్ గంభీర్ వంటి మాజీ క్రికెటర్లు కూడా రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇస్తే టీమిండియా వరల్డ్ కప్స్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరూ అనుకున్నట్టుగానే విరాట్ నుంచి టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు రోహిత్ శర్మ...

Image credit: PTI

రోహిత్, ఐపీఎల్ ట్రాక్ రికార్డు కారణంగా విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పించింది బీసీసీఐ. మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీసుల్లో గెలుస్తూ వచ్చింది భారత జట్టు. అయితే ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 స్టేజీ నుంచే నిష్కమించింది టీమిండియా...

తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో పాక్ చేతుల్లో ఎదురైన పరాభవానికి, 2019 వన్డే వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ చేతుల్లో ఎదురైన పరాజయానికి... ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌ 2022 సెమీస్ ఓటమికి తేడా ఏమీ లేదు... కెప్టెన్లు మాత్రమే వేరు... 

Image credit: PTI

అప్పుడు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎలాగైతే టీమిండియాని విజయతీరాలకు చేర్చడంలో విఫలమయ్యాడో ఇప్పుడు రోహిత్ శర్మ కూడా అలాగే ఫెయిల్ అయ్యాడు. ఐపీఎల్‌లో జట్టును నడిపించడం, టీమిండియాని ఐసీసీ టోర్నీల్లో గెలిపించడం రెండూ ఒక్కటి కాదని ఇప్పటికైనా క్రికెట్ మేధావులు తెలుసుకుంటే మంచిదని కామెంట్లు చేస్తున్నారు కోహ్లీ అభిమానులు.. 

click me!