స్టేడియానికి లక్ష మంది ప్రేక్షకులు... తప్పిన వరుణ గండం! ఇండియా- పాక్ మ్యాచ్‌కి భారీ క్రేజ్...

First Published | Oct 23, 2022, 9:11 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో అందరూ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్‌కి మరికొన్ని నిమిషాల్లోనే సైరన్ మోగనుంది. ఆదివారం మధ్యాహ్నం 1:30 ని.లకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌ చూడడానికి స్టేడియం వద్ద ఉదయం నుంచే ప్రేక్షకుల సందడి మొదలైపోయింది...

india

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఇండియా- పాకిస్తాన్‌ మ్యాచ్‌కి దాదాపు 1 లక్ష టికెట్లు అమ్ముడైపోయాయి. క్రికెట్ చరిత్రలో అత్యధిక మంది ప్రేక్షకులు హాజరైన మ్యాచ్‌గా ఇండో- పాక్ మ్యాచ్ రికార్డు క్రియేట్ చేయనుంది. ఇంతకుముందు మెల్‌బోర్న్‌లో జరిగిన 2015 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 93,013 మంది ప్రేక్షకులు హాజరుకావడమే ఇప్పటిదాకా రికార్డుగా ఉంది. ఆ రికార్డును భారత్, పాక్ మ్యాచ్ చెరిపేయడం ఖాయంగా కనిపిస్తోంది....

మెల్‌బోర్న్ స్టేడియం పూర్తి కెపాసిటీ 100024. అయితే పూర్తి కెపాసిటీతో ఈ మ్యాచ్‌ జరిగితే లక్ష మంది ప్రేక్షకుల కేరింతల మధ్య భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతోంది. పాకిస్తాన్ ఆతిథ్యమివ్వాల్సిన ఆసియా కప్ 2023 గురించి ఇరుదేశాల క్రికెట్ బోర్డుల మధ్య వాగ్వాదం జరుగుతున్న సమయంలో ఈ మ్యాచ్... క్రికెట్ టీమ్స్‌కి మధ్యే కాకుండా క్రికెట్ బోర్డులకు మధ్య ఆధిక్యపు పోరులా మారింది...


ఆదివారం మెల్‌బోర్న్‌లో 80 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. అయితే మెల్లిమెల్లిగా ఈ శాతం తగ్గుతూ వస్తోంది. శనివారం వేసిన అంచనా ప్రకారం మ్యాచ్ రోజు వర్షం కురిసే ఛాన్స్ 10 శాతం మాత్రమే. ఆదివారం ఉదయానికి ఇది కూడా లేదు...

ఆదివారం ఆకాశం మేఘావృత్తమై ఉన్నా, వర్షం కురిసి మ్యాచ్ నిలిచే అవకాశాలైతే కనిపించడం లేదని వాతావరణ శాఖ తెలియచేసింది. దీంతో మ్యాచ్ సజావుగా సాగుతుందని ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

యూఏఈలో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో టీమిండియాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది పాకిస్తాన్. ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో పాకిస్తాన్ చేతుల్లో టీమిండియాకి ఎదురైన తొలి పరాభవం ఇదే. దీంతో ఈ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి కసిగా ఎదురుచూస్తోంది భారత జట్టు...

ఆసియా కప్ 2022 టోర్నీలో తొలి మ్యాచ్‌లో పాక్‌పై విజయం సాధించినా సూపర్ 4 రౌండ్‌లో మరోసారి టీమిండియాకి పరాజయం ఎదురైంది. గత ఏడాదిలో మూడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకున్న భారత జట్టు, ఈ మ్యాచ్‌లో గెలిచి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తోంది.. 

పాక్ స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదీ, గాయం నుంచి కోలుకుని టీ20 వరల్డ్ కప్ 2022లో టీమిండియాతో మ్యాచ్ ఆడబోతున్నాడు. మరోవైపు భారత జట్టు మాత్రం జస్ప్రిత్ బుమ్రా, రవీంద్ర జడేజా వంటి ఇద్దరు కీలక ప్లేయర్లను దూరం చేసుకుంది... 

Latest Videos

click me!