గంగూలీ మొదలెట్టాడు, కోహ్లీ దాన్ని ఎక్కువ చేశాడు... గుడ్లు ఉరిమి చూడకుండా కూడా...

First Published Aug 25, 2021, 10:35 PM IST

లార్డ్స్ టెస్టులో టీమిండియా చూపించిన ఆటతీరు, యావత్ క్రికెట్ ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేసింది. ఐదో రోజు బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లో అదరగొట్టిన భారత జట్టు... ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి భారీ విజయాన్ని దక్కించుకుంది. అయితే టీమిండియా ఆటగాళ్ల దూకుడుపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది...

ఎప్పుడూ లేనట్టుగా భారత జట్టు విదేశాల్లో ఈ రేంజ్‌లో దూకుడు చూపించడం, ఇంగ్లాండ్ క్రికెటర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. విరాట్ కోహ్లీతో పాటు భారత ప్లేయర్లు అందరూ అగ్రెసివ్‌ ఆటతీరుతో ఇంగ్లాండ్‌ను వణికించారు...

ఈ విషయం గురించి భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ మధ్య ఆసక్తికర చర్చ జరిగింది... ‘ఇంతకుముందు భారత జట్టుతో పోలిస్తే, ఇప్పుడు టీమిండియా ఆటతీరు పూర్తిగా మారిపోయింది, ఒప్పుకుంటాను.

నువ్వు, ఈ జట్టు, పూర్వపు జట్లలా వేధించబడదేమోనని అన్నావు. ఇంతకుముందు జట్టు అంటే ఏ తరమో కొంచెం క్లారిటీ ఇస్తావా? అసలు వేధించడం అంటే అర్థం ఏమిటి...’ అంటూ ప్రశ్నించాడు సునీల్ గవాస్కర్.

దానికి హుస్సేన్ ఏదో వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. ‘ఇంతకుముందు భారత జట్లు కోపం వస్తే, నో నో నో అంటూ అరిచేవాళ్లు. కానీ ఇప్పుడు కోహ్లీ చేస్తున్నది మాత్రం పూర్తిగా వేరు... ఇది ప్రత్యర్థులను భయపెట్టేలా ఉంటోంది...

సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో ఇది కొంచెం కనిపించేది. ఇప్పుడు విరాట్ కోహ్లీ దాన్ని మరింత పెంచి, దూకుడు నేర్పించాడు. విరాట్ కోహ్లీ లేకపోయినా, అతను నింపిన దూకుడు మంత్రం మాత్రం జట్టులో నిండిపోయింది...

ఆస్ట్రేలియాలో అజింకా రహానే కెప్టెన్సీలో టీమిండియా ఆటతీరు కూడా నన్ను ఆశ్చర్యపర్చింది. ఇప్పుడు ఈ భారత జట్టుతో గొడవ పడాలని ఎవ్వరూ అనుకోరు...’ అంటూ సమాధానం ఇచ్చాడు నాసర్ హుస్సేన్...

‘కానీ పూర్వం భారత జట్లు తిట్టినా సహించేవారనేదాన్ని నేను ఒప్పుకోను. ఎందుకంటే నేను ఆడే సమయంలో కూడా మేం ఓటమిని భరించేవాళ్లం కాదు. రికార్డులను చూస్తే 1971లో నా మొదటి టూర్‌లో మేం గెలిచాం...

1974లో మాకు కొన్ని అంతర్గత సమస్యలు ఉండడంతో సిరీస్ కోల్పోయాం. 1979లో విజయానికి 9 పరుగుల దూరంలో మ్యాచ్ ఆగిపోవడంతో సిరీస్ డ్రా అయ్యింది... ఓవల్ టెస్టులో 438 టార్గెట్‌తో బ్యాటింగ్ చేసి 429/8 పరుగులు చేయగలిగాం...

1982లో ఓడినా, 1986లో సిరీస్ గెలిచాం. వాతావరణం సహకరించి ఉంటే... 3-0 తేడాతో గెలిచేవాళ్లం కూడా. మా తరం కూడా ఎప్పుడూ వేధింపులను భరించింది లేదు... ’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్.

‘అగ్రెషన్ అంటే ప్రత్యర్థిని ఎదుర్కోవడం, అంతే కానీ వాళ్ల ముఖంలో ముఖం పెట్టి కోపంగా చూడడం కాదు... వికెట్ పడిన ప్రతీసారి కోపంగా అరుస్తూ, గుడ్లు ఉరిమి చూస్తూ సెలబ్రేట్ చేసుకోకుండా కూడా ఆటలో అంకితభావం, కమ్మిట్‌మెంట్ చూపించవచ్చు...’ అంటూ విరాట్ కోహ్లీ అండ్ టీమ్‌కి కౌంటర్ ఇచ్చాడు సునీల్ గవాస్కర్.

click me!