విరాట్‌కి చెక్ పెట్టేందుకే అతన్ని రంగంలోకి దించుతున్న సౌరవ్ గంగూలీ... ఇకపై అంతా కోహ్లీ చెప్పినట్టే...

First Published Sep 18, 2021, 12:02 PM IST

బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, టీమిండియాలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా భారత క్రికెట్‌లో వరుసగా జరుగుతున్న పరిణామాలు, టీమిండియాలో విరాట్ కోహ్లీకి చెక్ పెట్టేందుకే సాగుతున్నట్టుగా ఉన్నాయి...

తొలుత విరాట్ కోహ్లీ టీ20, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత బీసీసీఐ ట్రెజరర్ స్వయంగా మీడియా ముందుకొచ్చి, ఆ వార్తలన్నీ వట్టి పుకార్లేనని కొట్టిపారేశాడు...

ఇది జరిగిన కొన్ని గంటలకే టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు సంచలన ప్రకటన చేశాడు విరాట్ కోహ్లీ... అయితే ఇది కూడా ఓ పథకం ప్రకారమే సాగినట్టు అనుమానిస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు...

ముందుగా విరాట్ కోహ్లీని పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కెప్టెన్సీ నుంచి తొలగిస్తామని బీసీసీఐ హెచ్చరికలు జారీ చేసినట్టు వార్తలు వైరల్ అయ్యేలా చేసి, అతను ఈ నిర్ణయం తీసుకునేలా ఉసిగొల్పినట్టు అనుమానిస్తున్నారు...

ఇదంతా ఒక ఎత్తు అయితే, విరాట్ కోహ్లీ బద్ధ శత్రువులా భావించే అనిల్ కుంబ్లేని భారత జట్టు హెడ్‌కోచ్‌గా నియమించాలని చేస్తున్న ప్రయత్నాలు... మరో ఎత్తు.

అనిల్ కుంబ్లే హెడ్‌కోచ్‌గా ఉన్న సమయంలో తనకి ఏ మాత్రం స్వేచ్ఛ ఇవ్వడం లేదని, ఓ హెడ్ మాస్టర్‌లా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ...

అప్పటిదాకా వరుస విజయాలు అందుకుంటూ దూసుకుపోతున్న టీమిండియా, హెడ్‌కోచ్ అనిల్ కుంబ్లే మీద ఉన్న కోపంతోనే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ చేతుల్లో చిత్తుగా ఓడిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి...

అన్నింటికీ మించి హెడ్‌కోచ్‌గా రవిశాస్త్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ ఆడింది ఆట, పాడింది పాటగా మారింది... జట్టులో ఎవరు ఉండాలి? ఎవరు ఉండకూడదు కూడా విరాట్ కోహ్లీయే డిసైడ్ చేస్తున్నారు..

ఓ రకంగా చెప్పాలంటే రవిశాస్త్రి కేవలం నామమాత్రపు కోచ్ మాత్రమే, విరాట్ కోహ్లీయే టీమిండియా అన్నీ అన్నట్టుగా తయారయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి..

ఏదైతేనేం టీమిండియాకి వరుసగా విజయాలు వస్తున్నాయి. విదేశాల్లో అద్భుత విజయాలు అందుకుంటోంది భారత్. ఎవరికైనా కావాల్సింది ఇదే కదా... అని విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ వాదన...

అయితే బ్యాటింగ్‌లో తాను రాణిస్తూ, ముందుండి జట్టును నడిపించినప్పుడు ఎన్ని చేసినా, ఏం చేసినా నడుస్తుంది. అయితే ఇప్పుడు సీన్ మారిపోయింది. విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌లో ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు.

ఇంగ్లాండ్ టూర్‌లో మ్యాచ్ విన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను నాలుగు టెస్టుల్లో ఆడించకపోవడం, హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి చెప్పా పెట్టకుండా ప్రైవేట్ కార్యక్రమానికి హాజరుకావడం, ఐదో టెస్టు ఆరంభానికి ముందు మ్యాచ్ ఆడేందుకు ఇష్టం లేదంటూ ప్రకటించడం వంటి సంఘటనలపై బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం...

అందుకే భారత జట్టులో విరాట్ కోహ్లీ ఆధిపత్యాన్ని తగ్గించడానికే అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్ వంటి క్రమశిక్షణను కచ్ఛితంగా ఫాలో అయ్యేవారిని హెడ్‌కోచ్‌లుగా నియమించేందుకు బీసీసీఐ పావులు కదుపుతోందని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఉన్న సమయంలో కూడా భారత జట్టుకు అద్వితీయ విజయాలు అందించాడు. అయితే అతని ఆధిపత్యానికి గ్రెగ్ ఛాపెల్ హెడ్‌కోచ్‌గా ఎంట్రీ ఇవ్వడంతో ఫుల్‌ స్టాప్ పడింది. అదే మహేంద్ర సింగ్ ధోనీ లాంటి కెప్టెన్ రావడానికి దారి తీసింది...

అలాగే ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆధిపత్యాన్ని అడ్డుకుంటూనే భవిష్యత్తులో భారత జట్టు మరింత బలమైన, శక్తివంతమైన జట్టుగా తయారవుతుందని గంగూలీ భావిస్తున్నట్టుగా అంచనా వేస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

click me!