బుమ్రా గాయం గురించి ఏడాది ముందే హెచ్చరించిన షోయబ్ అక్తర్... టీ20 వరల్డ్ కప్ ముందు...

First Published Oct 1, 2022, 1:52 PM IST

పొరుగు దేశం పాకిస్తాన్‌కి వాళ్ల దేశం మీద కంటే పక్క దేశమైన భారత్‌ మీదే ఆసక్తి ఎక్కువ. విరాట్ కోహ్లీ ఫామ్ గురించి తెగ గగ్గోలు పెట్టిన పాక్ మాజీ క్రికెటర్లు, టీమిండియా ఏ మ్యాచ్ ఎలా ఆడాలో కూడా చెప్పడానికి సిద్ధంగా ఉంటారు. తాజాగా జస్ప్రిత్ బుమ్రా గాయం గురించి సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది...

bumrah

ఆసియా కప్‌కి ముందు వెన్నునొప్పితో జట్టుకి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, దాదాపు నెల రోజుల విశ్రాంతి తర్వాత తిరిగి జట్టుతో కలిశాడు. ఆస్ట్రేలియాపై రెండు టీ20 మ్యాచులు ఆడి, ఆరంటే ఆరు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన జస్ప్రిత్ బుమ్రా, గాయం మళ్లీ తిరగబెట్టడంతో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కి దూరమయ్యాడు...

Image credit: Getty

జస్ప్రిత్ బుమ్రా గాయం ఇప్పట్లో తగ్గదని, అతనికి ఎంత లేదన్నా మూడు నాలుగు నెలల బెడ్ రెస్ట్ కావాలని వార్తలు వినిపించాయి. అయితే బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ మాత్రం అదేం లేదని, త్వరలోనే అతను రీఎంట్రీ ఇస్తాడని, టీ20 వరల్డ్ కప్ కూడా ఆడే అవకాశాలు ఉన్నాయని కామెంట్ చేశాడు...

Bumrah-Akthar

జస్ప్రిత్ బుమ్రా, టీ20 వరల్డ్ కప్ ఆడతాడా? లేదా? అనే విషయం పక్కనబెడితే భారత స్టార్ పేసర్ గాయం గురించి ఏడాది కిందటే కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

‘జస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ యాక్షన్ గమనిస్తే అతను ముక్కుసూటిగా బౌలింగ్ చేస్తాడు. అతని బౌలింగ్ రన్నప్, యాక్షన్, డెలివరీ అన్నీ నేరుగా ఉంటాయి. దీనివల్ల అతని వెన్నెముకపై, భుజాలపై ఎక్కువగా ప్రెషర్ పడుతుంది...

మేం సైడ్ యాక్షన్‌తో బౌలింగ్ చేసేవాళ్లం. అంటే బంతి డెలివరీ చేసేముందు చేతులను అడ్డంగా పెట్టేవాళ్లం. దీనివల్ల ప్రెషర్ వెన్నెముకపై పడదు. భుజాలపై కూడా ఒత్తిడి పడదు. బుమ్రా తన భుజాలను బలంగా లాగుతూ బంతిని డెలివరీ చేస్తాడు...

బుమ్రా ఇలా చేయడం వల్ల అతని వెన్నెముకపై తీవ్రమైన ప్రెషర్ పడుతోంది. అతను పూర్తిగా ఫిట్‌గా జట్టుకి ఎక్కువ కాలం అందుబాటులో ఉండాలంటే ఐదు మ్యాచుల్లో మూడు మ్యాచుల్లో బుమ్రాని ఆడించి, మిగిలిన రెండు మ్యాచుల్లో విశ్రాంతి ఇవ్వాలి... ప్రతీ మ్యాచ్ ఆడిస్తే... బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడలేడు’ అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్...


ఏడాది కిందట ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ, ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆసియా కప్ 2022 టోర్నీ ఆరంభానికి ముందు విరాట్ కోహ్లీ మణికట్టు బ్యాటర్ కాదని, అతను ఫామ్ కోల్పోతే తిరిగి అందిపుచ్చుకోలేడని పాక్ మాజీ క్రికెటర్ మహ్మద్ అసిఫ్ చేసిన కామెంట్లు తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే... 

click me!