సంజు శాంసన్.. ఐపీఎల్ 2020లో దుమ్మురేపుతున్న కేరళ క్రికెటర్. ఆడిన రెండు మ్యాచుల్లోనూ విధ్వంసక ఇన్నింగ్స్‌లతో ప్రత్యర్థుల గుండెల్లో హడలు పుట్టిస్తున్నాడు. షార్జాలో సిక్సర్ల తుఫాన్ రేపుతున్న సంజు శాంసన్ ఇప్పుడు భారత క్రికెట్‌లో హాట్ టాపిక్.
అయితే, సంజు శాంసన్ గురించి తెలిసిన వాళ్లకు ఇది పెద్ద విషయం అనిపించదు. ఏ విషయంలోనైనా సుదీర్ఘ కాలం ఎదురుచూస్తే, సంజు శాంసన్ విశ్వరూపం ఇలాగే ఉంటుంది!. ఇది కేరళ క్రికెటర్ గురించి తెలిసిన వాళ్లలకు కొత్త కాదు. ఎందుకంటే ప్రేమలోనూ సంజు శాంసన్ ఇదే ఒరవడి చూపించాడు.
2013.. సంజు శాంసన్ జీవితంలో అత్యంత ముఖ్యమైన సంవత్సరం. అంతకముందు ఏడాదే ఐపీఎల్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ శిబిరంలో ఉన్న సంజు శాంసన్.. 2013లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ నుంచి ప్రశంసలు అందుకున్నాడు. అదే ఏడాది తన కాలేజ్‌మెట్, స్నేహితురాలు చారులతతో ప్రేమ బంధం మొదలు పెట్టాడు.
జీవితంలో తనలోని ప్రేమనైనా, క్రికెట్‌లో తనలోని విధ్వంసకారుడినైనా బయటి ప్రపంచానికి పరిచయం చేసుకోవటంలో సంజు శైలే వేరు. 2013లో చారులతతో ప్రేమాయాణం మొదలుపెట్టిన సంజు శాంసన్.. ఐదేండ్ల తర్వాత గర్వంగా ప్రకటించుకున్నాడు.
క్రికెట్‌లోనూ శాంసన్ అదే స్టయిల్‌ను ఫాలో అయ్యాడు. ఐదేండ్ల తర్వాత రాజస్థాన్ రాయల్స్ తరఫున వరుస సీజన్లుగా ఐపీఎల్‌లో చెలరేగుతున్నాడు. 2019 సీజన్లోనే హైదరాబాద్‌పై ఉప్పల్ స్టేడియంలో శతకబాదిన సంజు.. తాజాగా యుఏఈలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు.
'రాత్రి 11:11, 22 ఆగస్టు, 2013. నేను ఆమెకు మెసేజ్ పంపిన రోజు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఐదేండ్లుగా ఆమెతో ఉన్న ఫోటోను పంచుకుంటూ, ఈ స్పెషల్ గర్ల్‌తో ప్రేమలో ఉన్నాననే విషయం చెప్పాలని ఆరాటపడ్డాను. మేమిద్దరం విలువైన సమయం కలిసి గడిపాం,కానీ బహిరంగంగా కలిసి అడుగులు వేయలేదు. కానీ మా ఇద్దరి ఏడు అడుగులకు సంతోషంగా అంగీకారం తెలిపినందుకు మా ఇరువురి తల్లితండ్రులకు థ్యాంక్స్ చెబుతున్నాను' అని 2018 స్టెపెంబర్ 8న సంజు శాంసన్ ఫేస్‌బుక్ పేజిలో రాసుకొచ్చాడు.
ఐపీఎల్‌లోనూ సంజు శాంసన్ ఇదే తరహాలో ఎదురుచూశాడు. నైట్‌రైడర్స్ శిబిరంలో ఓ సీజన్ అంతా అవకాశం కోసం ఎదురు చూశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ తరఫున, రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిథ్యం వహించాడు. నిలకడగా అవకాశాలు చిక్కిన తర్వాత, తనలోని విధ్వంసకారుడిని బయటపెట్టేందుకు సంజు శాంసన్ ఏమాత్రం ఆలస్యం చేయలేదు. భారత క్రికెట్ జాతీయ జట్టులోనూ చోటు కోసం పోటీపడుతున్న సంజు శాంసన్ ఎమిరేట్స్‌లో బంతిని కసిగా కొడుతున్నాడు.
'ఏడాది కాలంగా బంతిని బాగా కొడుతున్నాను. నా ఆలోచనలు సానుకూల దృక్పథంలో ఉన్నాయి. గత సీజన్‌తో పోల్చితే నా ఆటలో ఎటువంటి మార్పు లేదు. ముందుగా నాతో నేను విసిగిపోయాను. ఎంతో కఠోరంగా శ్రమించి, ప్రయత్నించాను, అయినా అనుకున్నది అందుకోలేదు. మరింత కష్టపడటం మొదలు పెట్టాను. నేను అనుకున్నది సాధించాలంటే ఏం చేయాలో నన్ను నేను ప్రశ్నించుకున్నాను? నాలో ఓ పదేండ్ల అద్భుతమైన క్రికెట్ ఉందని నాకు నేను చెప్పుకున్నాను. ఈ పదేండ్లు నా శక్తి మేరకు ఆడటమే నా ముందున్న లక్ష్యం. పవర్ హిట్టింగ్ నా రక్తంలోనే ఉంది. మా నాన్న ఎంతో బలవంతమైన వ్యక్తి' పంజాబ్‌తో మ్యాచ్ అనంతరం సంజు శాంసన్ అన్నాడు.
ఇక చారులత, సంజు శాంసన్‌లు తిరువనంతపురంలోని మార్ ఇవానిస్ కాలేజ్‌లో స్నేహితులు. అక్కడే చారు, సంజు మధ్య ప్రేమ చిగురించింది. చారులత తండ్రి బి. రమేశ్ మాతృభూమి దినపత్రికకు చీఫ్ న్యూస్ ఎడిటర్. సంజు శాంసన్ తండ్రి ఢిల్లీ పోలీసు విభాగంలో పోలీసు అధికారిగా పనిచేశారు.