టీమిండియా నా ఫేవరేట్ గానీ ప్రపంచకప్ గెలిచే సత్తా ఆ జట్లకూ ఉంది.. సచిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

First Published Oct 18, 2022, 1:04 PM IST

T20 World Cup 2022: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ మొదలైన నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టోర్నీ గెలిచే గెలుపు గుర్రాలు వీళ్లేనని అంచనా వేశాడు. 

టీ20  ప్రపంచకప్ లో భాగంగా  అర్హత రౌండ్ లో నమీబియా.. శ్రీలంకను ఓడించిన తర్వాత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ‘నామ్ యాద్ రఖ్నా’ అని చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.  దీంతో ఈ మెగా టోర్నీని సచిన్ చాలా క్లోజ్ గా  పరిశీలిస్తున్నాడని అభిమానులు అంటున్నారు.  

తాజాగా సచిన్ ప్రపంచకప్ లో గెలుపు గుర్రాలపై  తనదైన అంచనావేశాడు.  ఈ జాబితాలో టీమిండియా ఫేవరేట్లుగా ఉన్నా మరో నాలుగు జట్లు కూడా ఈ రేసులో ముందున్నాయని సచిన్ తెలిపాడు. ఓ జాతీయ  పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిటిల్ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సచిన్ మాట్లాడుతూ.. ‘ఈ టోర్నీలో టీమిండియానే నా ఫేవరేట్. అవును, నా హృదయం ఎప్పుడూ ఇండియాతోనే ఉంటుంది.  నేనెప్పుడూ భారత్ గెలవాలనే కోరుకుంటాను. ఈ మెగా టోర్నీలో కూడా టీమిండియా రాణించాలి. నేను భారతీయుడిని అయినందుకు ఈ మాట అనడం లేదు. అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే మెరుగైన ఆటగాళ్లెందరో మనకు ఉన్నారు. 

అందుకే నేను భారత్ ఛాంపియన్ గా అవతరించాలని కోరుకుంటున్నా. అయితే విజేతలు ఎవరనేది మన చేతుల్లో లేదు. ఈ మెగా టోర్నీలో భారత్  తో పాటు టాప్-4లో ఉన్న జట్లు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, పాకిస్తాన్. ఈ నాలుగు జట్లు సెమీస్ చేరతాయని  నేను భావిస్తున్నా. 

ఇవే గాక న్యూజిలాండ్, సౌతాఫ్రికా కూడా ఈ పరిస్థితులు అలవాటు. సౌతాఫ్రికాలో కూడా సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. ఆసీస్ కు పక్కనే ఉంది గనక న్యూజిలాండ్ కూ  ఇవి అలవాటే. దీంతో వాళ్లు కూడా రేసులో ఉన్నారు...’ అని తెలిపాడు. 

ఇక పాకిస్తాన్ తో  జరుగబోయే మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధిస్తుందని సచిన్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ గెలవడానికి భారత్ కు మెరుగైన అవకాశాలున్నాయని,  జట్టు కూడా సమతూకంగా ఉండటంతో   పాక్ ను భారత్ ఓడిస్తుందని సచిన్ చెప్పాడు. 

click me!