అదే జరిగితే రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పొచ్చు..

First Published | Nov 5, 2024, 6:33 PM IST

Rohit Sharma Test Cricket Retirement: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ 6 ఇన్నింగ్స్‌ల్లో 91 పరుగులు మాత్రమే చేశాడు. అతను ఏ ఇన్నింగ్స్‌లోనూ సరిగ్గా బ్యాటింగ్ చేయలేదు. టెస్టు క్రికెట్‌లో రోహిత్ శర్మ గత 10 ఇన్నింగ్స్‌ల్లో 133 పరుగులు మాత్రమే చేయడంతో అతని ఫామ్ పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

రోహిత్ టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్

Rohit Sharma Test Cricket Retirement: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విఫలంపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా వీళ్ళు విఫలమైతే జట్టులో చోటు ఉండదని మీడియాలో వార్తలొచ్చాయి. క్రికెట్ లో  ఇప్పటికే తమదైన ముద్ర వేశారు. అనేక వ్యక్తిగత రికార్డులు సాధించారు. భారత్ కు అద్భుతమైన విజయాలు అందించారు. ప్రపంచ క్రికెట్ లో స్టార్ ప్లేయర్లుగా ఎదిగారు. అయితే, గత కొన్ని సిరీస్ లలో వీరి ప్రదర్శన అంత గొప్పగా లేదు. వరుసగా బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడుతున్న క్రమంలో అనేక విమర్శలను ఎదుర్కొంటున్నారు. వీరి ఆటపై క్రికెట్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రోహిత్ శర్మ రిటైర్మెంట్

ఈ క్రమంలోనే  ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్ల ఆట తీరుపై సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తూనే పలు సూచనలు చేస్తున్నారు. భారత జట్టు మాజీ కెప్టెన్  కృష్ణమాచారి శ్రీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. త్వరలోనే భారత జట్టు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ బరిలో నిలవాలంటే భారత్ కు ఈ సిరీస్ చాలా కీలకం.

కాబట్టి ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల నుంచి మెరుగైన ప్రదర్శనలతో పాటు భారీ ఇన్నింగ్స్ లను భారత్ ఆశిస్తోంది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ కృష్ణమాచారి మీడియాతో మాట్లాడుతూ.. 'ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ బాగా ఆడకపోతే టెస్ట్ క్రికెట్‌కి వీడ్కోలు పలకొచ్చు. ఇప్పటికే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్ట్‌లకు కూడా రిటైర్ అయితే వన్డేలకే పరిమితం అవుతాడు' అని అన్నారు.


బోర్డర్-గావస్కర్ ట్రోఫీ 2025

అలాగే, 'ఆస్ట్రేలియా టూర్‌లో రోహిత్ శర్మ రాణించలేకపోతే, భవిష్యత్తు గురించి ఆలోచించాలి. అతని వయసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని' కృష్ణమాచారి శ్రీకాంత్ అన్నారు. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ ఆడతాడా లేదా అనే సందేహం తలెత్తుతుంది. అలాగే, రోహిత్ శర్మపై కృష్ణమాచారి శ్రీకాంత్ ప్రశంసలు కూడా కురిపించాడు.

'న్యూజిలాండ్ సిరీస్‌లో రోహిత్ చెత్తగా ఆడాడని, చెత్తగా కెప్టెన్సీ చేశానని ఒప్పుకోవడం మంచి విషయం. ఫామ్‌లోకి రావాలంటే ముందు తప్పులు ఒప్పుకోవాలి. రోహిత్ తన తప్పులు బహిరంగంగా ఒప్పుకున్నాడు' అని అన్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 91 పరుగులే చేశాడు. ఒక్క ఇన్నింగ్స్‌లోనూ మెరుగైన ప్రదర్శన ఇవ్వలేదు. టెస్ట్‌ల్లో గత 10 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్ 133 పరుగులే చేశాడు. వరుస వైఫల్యాలతో రోహిత్ ఫామ్ పై అనేక ప్రశ్నలు వస్తున్నాయి.

విరాట్ కోహ్లీ, శ్రీకాంత్

ఇదే క్రమంలో రన్ మిషన్ విరాట్ కోహ్లీ కూడా హాట్ టాపిక్ అవుతున్నాడు. ఎందుకంటే గత కొంత కాలంగా కింగ్ కోహ్లీ పెద్ద ఇన్నింగ్స్ లను ఆడటం లేదు. అతని నుంచి సెంచరీలు కూడా చాలా కాలం నుంచి రావడం లేదు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 6 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ 93 పరుగులే చేశాడు. బెంగళూరు టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 70 పరుగులు చేశాడు. టెస్ట్‌ల్లో కోహ్లీ బాగా ఆడటం లేదు. ముఖ్యంగా ఎడమచేతి స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నాడు. టెస్ట్‌ల్లో గత 10 ఇన్నింగ్స్‌ల్లో కోహ్లీ 192 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా పర్యటనలో బాగా ఆడకపోతే రోహిత్ లానే కోహ్లీని కూడా టెస్ట్ జట్టు నుంచి తప్పిస్తారని మీడియాలో వార్తలొచ్చాయి.

కృష్ణమాచారి శ్రీకాంత్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుతూ.. 'ఆస్ట్రేలియా పర్యటనలో కోహ్లీ బాగా ఆడతాడని నేను అనుకుంటున్నా. ఆసీస్‌లో కోహ్లీ బాగా ఆడతాడు. ఫాస్ట్ బౌలర్లను బాగా ఎదుర్కొంటాడు. అతని భవిష్యత్తు గురించి నేను ఇప్పుడే ఏమీ చెప్పను' అని అన్నారు.

రోహిత్ శ‌ర్మ ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌డం లేదా

వ్యక్తిగత కారణాల వల్ల ఈ నెల చివర్ లో పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో పాల్గొనడంపై రోహిత్ శర్మ సందేహం వ్య‌క్తంచేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో 0-3 తేడాతో భారత్ ఓడిపోయిన తర్వాత మ్యాచ్ అనంతరం జరిగిన ప్రజెంటేషన్ వేడుకలో రోహిత్ మాట్లాడుతూ, తాను పాల్గొనడంపై మాట్లాడుతూ ఉత్కంఠ‌ను పెంచాడు. \

ఆస్ట్రేలియాలో నవంబర్ 22 నుంచి పెర్త్‌లో ప్రారంభమయ్యే కఠినమైన ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భార‌త జట్టు సిద్ధమైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్ 25 పరుగుల తేడాతో ఓడిపోయిన తర్వాత రోహిత్ మాట్లాడుతూ.. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ కోసం "నేను వెళ్తానో లేదో తెలియదు" అని రోహిత్ చెప్పాడు. ఒకవేళ రోహిత్ టెస్టుకు దూరమైతే, సిరీస్ ఓపెనర్‌లో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహిస్తాడు. 
 

Latest Videos

click me!