రెండో టెస్టు నుంచి రోహిత్ శర్మ అవుట్... కెప్టెన్ లేకుండానే గెలుస్తున్నప్పుడు, రిస్క్ చేయలేమంటూ...

First Published Dec 19, 2022, 12:45 PM IST

బంగ్లాదేశ్‌తో జరగబోయే రెండో టెస్టు నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ తప్పుకున్నాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన రోహిత్ శర్మ, మూడో వన్డేతో పాటు తొలి టెస్టుకి దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకున్నా, టీమిండియా మేనేజ్‌మెంట్ రిస్క్ చేయడానికి ఇష్టపడకపోవడంతో రోహిత్ రెండో టెస్టుకి కూడా అందుబాటులో ఉండడం లేదు...
 

Rohit Sharma

రెండో వన్డేలో స్లిప్‌లో క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నించిన రోహిత్ శర్మ బొటనవేలికి గాయమైంది. వేలి నుంచి రక్తం కారడంతో క్రీజు దాటిన రోహిత్ శర్మ, దాదాపు 85 ఓవర్ల తర్వాత బ్యాటింగ్‌కి వచ్చాడు. బొటన వేలికి బ్యాండేజీతో బ్యాటింగ్ చేసి హాఫ్ సెంచరీతో వీరోచిత పోరాటం చేసి మెప్పించాడు...

గాయానికి మెరుగైన చికిత్స కోసం ముంబై చేరుకున్న రోహిత్ శర్మ, భార్య రితికాతో కలిసి కొన్ని పార్టీలు, ఫంక్షన్లకు కూడా హాజరయ్యాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్ శర్మ, రెండో టెస్టులో ఆడతాడని ప్రచారం జరిగింది.

అయితే తొలి టెస్టు ముగిసిన తర్వాత కూడా రోహిత్ శర్మ.. ముంబైలోనే ఉండడంతో రెండో టెస్టు ఆడతాడా? అనే అనుమానాలు రేగాయి. తాజాగా రోహిత్, రెండో టెస్టుకి కూడా దూరమైనట్టు ప్రకటించింది బీసీసీఐ.. 

Rohit Sharma

తాజాగా రోహిత్ శర్మ ఫిట్‌నెస్ సాధించినా అతన్ని రెండో టెస్టులో ఆడించకపోవడమే మంచిదని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. రెండో టెస్టు తర్వాత టీమిండియా స్వదేశానికి తిరిగి రానుంది. స్వదేశంలో వచ్చే ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో సిరీసులు ఆడనుంది...

బిజీ షెడ్యూల్ నేపథ్యంలో రోహిత్ శర్మ మరోసారి గాయపడితే కష్టమవుతుందనే ఉద్దేశంతో టీమిండియా కెప్టెన్‌ని బంగ్లాదేశ్‌ టూర్‌కి దూరంగా పెట్టడమే మంచిదని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...  అదీకాకుండా కెప్టెన్ రోహిత్ శర్మ లేకుండానే తొలి టెస్టులో ఘన విజయం అందుకుంది భారత జట్టు...

రోహిత్ శర్మ స్థానంలో జట్టులోకి వచ్చిన శుబ్‌మన్ గిల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో టీమ్ కాంబినేషన్‌ని చెడగొట్టడం ఇష్టం లేక రోహిత్ శర్మ రెండో టెస్టుకి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట.  

click me!