తాజా సమాచారం ప్రకారం ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ అయ్యర్ ను రిటైన్ చేసుకోవడం లేదు. ఈ విషయాన్ని ఆ జట్టు స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇదివరకే చెప్పాడు. వచ్చే సీజన్ (ఐపీఎల్ 2022) లో తాను, అయ్యర్ ఢిల్లీ తరఫున ఆడేది కష్టమే అని అశ్విన్ తెలిపాడు.
కాగా ఐపీఎల్ లో ఢిల్లీకి ఆడుతున్న శ్రేయస్ స్వస్థలం ముంబై. రంజీలలో కూడా అతడు మహారాష్ట్ర తరఫునే ఆడాడు. ఇక తాజా రిపోర్టుల ప్రకారం.. అయ్యర్ త్వరలోనే ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించనున్నాడట.
రోహిత శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్.. అయ్యర్ ను తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తుందట. ఐపీఎల్ లో ఢిల్లీ తరఫున అదరగొట్టిన అయ్యర్ ను ఐపీఎల్ వేలంలో దక్కించుకోవాలని ముంబై భావిస్తున్నట్టు సమాచారం.
ఢిల్లీ రిటైన్ చేసుకోకపోవడంతో అయ్యర్ కూడా ఈసారి వేలంలోకి వస్తే మంచి రేటు దక్కవచ్చునని అనుకుంటున్నాడు. అంతేగాక వచ్చే ఐపీఎల్ లో రెండు కొత్త ఫ్రాంచైజీలు కూడా రానుండటంతో అయ్యర్ కు భారీ రేటు పలకడం ఖాయంగా క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఐపీఎల్ రిటైన్ పాలసీ ప్రకారం ఇప్పటికే రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ లను రిటైన్ చేసుకోనున్న ముంబై.. శ్రేయస్ ను కూడా తమ జట్టులో చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది.
2015 లో ఐపీఎల్ కెరీర్ ప్రారంభించినప్పట్నుంచి శ్రేయస్.. ఢిల్లీతోనే ఉన్నాడు. ఆ సంవత్సరంలో ఢిల్లీ అతడిని రూ. 2.6 కోట్లకు దక్కించుకుంది.ఇక ఆ తర్వాత 2018 ఐపీఎల్ వేలంలో కూడా ఢిల్లీ అతడిని దక్కించుకుంది. 2018 లో గౌతం గంభీర్ నిష్క్రమణ తర్వాత అయ్యర్ కు అనూహ్యంగా సారథ్య బాధ్యతలు కూడా దక్కాయి.
ఢిల్లీ తరఫున 87 మ్యాచులాడిన అయ్యర్.. 2,375 పరుగులు చేశాడు. 2019 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీని సెమీస్ కు చేర్చిన అతడు.. 2020లో ఫైనల్ కు చేర్చాడు. బ్యాటర్ గానే గాక కెప్టెన్ గా కూడా అతడు సక్సెస్ అయ్యాడు. కానీ ఈ ఏడాది గాయంతో ఐపీఎల్ తొలి సీజన్ కు దూరమయ్యాడు. దాంతో ఆ జట్టు రిషభ్ పంత్ ను కెప్టెన్ చేసింది. అయితే అయ్యర్ తిరిగొచ్చినా పంత్ నే సారథిగా కొనసాగించింది.