INDvsNZ ODI: గురువారం ఉప్పల్ వేదికగా జరిగిన భారత్-న్యూజిలాండ్ తొలి వన్డేలో టీమిండియా.. 12 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో కివీస్ మిడిలార్డర్ బ్యాటర్ బ్రేస్‌వెల్ పోరాటం ఆకట్టుకుంది.
ఇండియా - న్యూజిలాండ్ నడుమ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన తొలి వన్డే ఆద్యంత ఉత్కంఠగా సాగింది. ఇరు జట్లు కలిసి సుమారు 700 పరుగులు నమోదుచేసిన ఈ పిచ్ పై విజయం భారత్ నే వరించినా కివీస్ గెలిచినంత పనిచేసింది. మ్యాచ్ చూడటానికి వెళ్లిన సగటు ప్రేక్షకుడికి కావాల్సినంత క్రికెట్ వినోదాన్ని పంచింది ఉప్పల్..
27
మ్యాచ్ అనంతరం టీమిండియా సారథి రోహిత్ శర్మ పాత్రికేయులతో మాట్లాడుతూ.. ‘ఈ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. మేము బాగా బ్యాటింగ్ చేసినా బౌలింగ్ బాగుంటేనే గెలుస్తామన్న సంగతి మాకు తెలుసు. దురదృష్టవశాత్తూ మ్యాచ్ లో అదే జరిగింది.
37
టాస్ సందర్భంలో కూడా నేను ఇదే చెప్పా. ఈ మ్యాచ్ లో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని నా సహచరులకు చెప్పాను. నేను ఊహించినట్టు ఇక్కడ పరిస్థితులు లేవు. బ్రేస్‌వెల్ బ్యాటింగ్ బాగుంది. అతడితో పాటు సాంట్నర్ పోరాటం కట్టిపడేసింది. కానీ కీలక సమయాల్లో మా బౌలర్లు అద్బుతంగా పుంజుకుని మాకు ఉత్కంఠ విజయాన్ని అందించారు...’అని అన్నాడు.
47
ఇక శుభమన్ గిల్ డబుల్ సెంచరీ చేయడంపై స్పందిస్తూ... ‘గిల్ ద్విశతకం చేయడం సంతోషంగా ఉంది. అతడు మంచి ఫామ్ లో ఉన్నాడు. లంకతో సిరీస్ లో అతడికి మద్దతుగా నిలడానికి కారణం కూడా అదే. పవర్ ప్లే తో పాటు మిడిల్ ఓవర్స్ లో కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసే గిల్ విధానం భాగుంది...’ అని తెలిపాడు.
57
హైదరాబాద్ లో తొలి మ్యాచ్ ఆడిన స్థానిక ఆటగాడు మహ్మద్ సిరాజ్ పై కూడా రోహిత్ ప్రశంసలు కురిపించాడు. సిరాజ్ గత కొంతకాలంగా వన్డేలలో కూడా రాణిస్తున్నాడని, తన ప్రణాళికలకు అనుగుణంగానే బాల్స్ వేస్తూ ఫలితాలను రాబడుతున్నాడని హిట్ మ్యాన్ చెప్పాడు.
67
ఈ మ్యాచ్ లో తొలుత భారత్ బ్యాటింగ్ చేసి 349 పరుగుల భారీ స్కోరుచేసింది. శుభమన్ గిల్ (208) డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. లక్ష్య ఛేదనలో కివీస్ 130 పరుగులలోపే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఆ జట్టు 200 పరుగులు చేసినా గొప్పే అనుకున్నారంతా. కానీ బ్రేస్‌వెల్ - సాంట్నర్ ల పోరాటంతో కివీస్ విజయం చివరి అంచులవరకూ వచ్చింది.
77
బ్రేస్‌వెల్ 140 పరుగులు చేయగా సాంట్నర్.. 57 పరుగులకు ఔటయ్యాడు. ఇద్దరూ కలిసి ఏడో వికెట్ కు 162 పరుగులు జోడించారు. చివర్లో భారత బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకున్నా కీలక సమయంలో వికెట్లు తీసి మ్యాచ్ ను గెలిపించారు.