ధోనీ రికార్డును బ్రేక్ చేయబోతున్న రిషబ్ పంత్... ఇంగ్లాండ్ టూర్‌లో రోహిత్ శర్మ ముందు...

First Published Aug 3, 2021, 4:00 PM IST

డబ్ల్యూటీసీ ఫైనల్ ముగిసిన తర్వాత 42 రోజుల పాటు రెస్టు తీసుకున్న టీమిండియా, ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌కి సిద్ధమైంది. ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో ఐదు టెస్టులు ఆడనుంది భారత జట్టు... ఈ సిరీస్‌లో భారత క్రికెటర్లను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి...

MS Dhoni

ఇంగ్లాండ్‌లో అత్యధిక టెస్టు విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా నిలిచేందుకు విరాట్ కోహ్లీకి రెండు టెస్టు విజయాలు కావాలి. మాజీ కెప్టెన్ ధోనీ ఇంగ్లాండ్ టూర్‌లో కెప్టెన్‌గా 9 మ్యాచులు ఆడి, ఒకే దాంట్లో గెలిచి, ఏడింట్లో ఓడిపోయాడు. ఓ మ్యాచ్ డ్రాగా ముగిసింది.

విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 6 మ్యాచులు ఆడితే, అందులో ఓ విజయం అందుకుంది టీమిండియా. ఐదు మ్యాచుల్లో ఓడిపోయింది. కపిల్‌దేవ్ కెప్టెన్‌గా మూడింట్లో రెండు విజయాలు అందుకుని టాప్‌లో ఉన్నాడు... కపిల్‌దేవ్ రికార్డును బ్రేక్ చేయాలంటే, ఈ సిరీస్‌లో కోహ్లీ రెండు మ్యాచుల్లో గెలవాల్సి ఉంటుంది...

ఇంగ్లాండ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన పర్యాటక జట్టు వికెట్ కీపర్‌గా మహేంద్ర సింగ్ ధోనీ, టాప్‌లో నిలిచాడు. మాహీ, తన కెరీర్‌లో ఇంగ్లాండ్ టూర్‌లో టెస్టుల్లో 9 సిక్సర్లు బాదాడు.. ఆడమ్ గిల్‌క్రిస్ట్ 7 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు...

6 సిక్సర్లతో మూడో స్థానంలో ఉన్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఈ టూర్‌లో మరో నాలుగు సిక్సర్లు బాదితే చాలు, ఇంగ్లాండ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన పర్యాటక జట్టు వికెట్ కీపర్‌గా సరికొత్త చరిత్ర క్రియేట్ చేస్తాడు...

రెండేళ్ల క్రితం టెస్టుల్లో కొత్త అవతారం ఎత్తిన రోహిత్ శర్మ, ఇంగ్లాండ్ సీనియర్ బౌలింగ్ ద్వయం అండర్సర్, స్టువర్ట్ బ్రాడ్‌లపై మంచి రికార్డు నెలకొల్పాడు. ఈ ఇద్దరిపై 66 సగటుతో పరుగులు చేశాడు రోహిత్ శర్మ.

విదేశాల్లో కేవలం 27 సగటు కలిగి ఉన్న రోహిత్ శర్మకు ఈ సిరీస్‌ ఓ అద్భుత అవకాశం లాంటిది. ఐదు టెస్టుల సిరీస్‌లో ఎంత లేదనుకున్నా కనీసం ఏడు, ఎనిమిది ఇన్నింగ్స్‌లు రోహిత్‌కి బ్యాటింగ్ చేసే అవకాశం రావచ్చు...

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ కనీసం ఓ సెంచరీ చేసి, మిగిలిన మ్యాచుల్లో పర్వాలేదనిపించినా... విదేశాల్లో తన బ్యాటింగ్ సగటును మెరుగుపర్చుకునేందుకు అవకాశం దొరుకుతుంది...అలాగే ఇప్పటిదాకా విదేశాల్లో టెస్టు సెంచరీ చేయలేకపోయాడనే అపవాదు కూడా తొలిగిపోతుంది.

click me!