ఆర్‌సీబీని వదిలివెళ్లడాన్ని ప్లేయర్లు ఎంజాయ్ చేస్తారు, ఫీల్ అవ్వరు... క్రిస్ గేల్ సెన్సేషనల్ కామెంట్స్..

First Published Jan 28, 2023, 10:12 AM IST

ఐపీఎల్‌లో ఫాలోయింగ్, క్రేజ్ విషయంలో ఆర్‌సీబీ రేంజ్ వేరే లెవెల్. ఎన్నిసార్లు అభిమానులను నిరుత్సాహపరిచినా, తిరిగి కొత్త సీజన్ వచ్చే సరికి ‘ఈ సాలా కప్ నమ్‌దే’ అంటూ నూతన ఉత్తేజంతో టీమ్‌కి అండగా నిలుస్తారు అభిమానులు. అయితే అన్ని ఉన్నా టైటిల్ మాత్రం గెలవలేకపోతోంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు...

ఆర్‌సీబీలో ఉన్నప్పుడు బాగా ఆడని ప్లేయర్లు, వేరే టీమ్‌లోకి వెళితే అదరగొడతారనేది ఓ సెంటిమెంట్. ఆర్‌సీబీ నుంచి బయటికి వెళ్లిన షేన్ వాట్సన్, కెఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్ వంటి ప్లేయర్లు... వేరే ఫ్రాంఛైజీల తరుపున అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి మెప్పించారు..

టీ20 క్రికెట్ వరల్డ్‌లో విధ్వంసకర బ్యాటర్లలో ఒకడైన క్రిస్ గేల్, ఆర్‌సీబీ తరుపున 8 సీజన్లు ఆడాడు. రాయల్ ఛాలెంజర్స్ తరుపున 4 వేలకు పైగా పరుగులు, 5 సెంచరీలు సాధించాడు... అయితే క్రిస్ గేల్‌ని 2018 సీజన్‌లో వేలానికి వదిలేసింది ఆర్‌సీబీ...

ఆ తర్వాత మూడు సీజన్లు పంజాబ్ కింగ్స్‌ జట్టుకి ఆడిన క్రిస్ గేల్, 2021 సీజన్ తర్వాత ఐపీఎల్ ఆడడం మానేశాడు. క్రికెట్‌కి అధికారిక రిటైర్మెంట్ ప్రకటించకపోయినా ప్రస్తుతం కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్..

‘ఆర్‌సీబీ టీమ్‌లో ప్లేయర్లకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయి. ఆ ఫ్రాంఛైజీ జట్టును నడిపించే విధానం కార్పొరేట్ స్టైల్‌లో ఉంటుంది. అయితే డబ్బు ఎంత ఉన్నా, అనుబంధం లేకపోతే వేస్టే. ఆర్‌సీబీ ఆ స్పెషల్ బాండింగ్ కనిపించదు...

ఆర్‌సీబీ ప్లేయర్ల విషయంలో లాయల్టీ, నమ్మకం అనే రెండు విషయాలు నేర్చుకోవాలి. పంజాబ్ కింగ్స్ కూడా అంతే... జట్టు కోసం ఎంత చేసినా వాళ్లకు దక్కాల్సిన గౌరవం దక్కకపోతే, ఆ టీమ్‌పై గౌరవం ఎలా ఉంటుంది. ఆర్‌సీబీ, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ ఈ విషయాలు నేర్చుకోవాలి...  

ఐపీఎల్‌లో సీఎస్‌కే నెం.1 టీమ్. ప్రతీ ప్లేయర్ కూడా జీవితంలో ఒక్కసారైనా చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆడాలని అనుకుంటాడు. కారణం ధోనీ మాత్రమే కాదు, సీఎస్‌కే ప్లేయర్ల విషయంలో చూపించే నమ్మకం, గౌరవం...

ఆర్‌సీబీ అంటే విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ మాత్రమే. అక్కడ ఆ ఇద్దరికే గౌరవం దక్కుతుంది. మిగిలిన ప్లేయర్లు, వాళ్లు చెప్పింది చేయాల్సిందే. అందుకే ఆర్‌సీబీ నుంచి బయటికి వెళ్లడానికి ఏ ప్లేయర్ కూడా బాధపడడు. ఇంకా చెప్పాలంటే ఆర్‌సీబీ నుంచి బయటపడుతున్నందుకు సంతోషంతో ఎంజాయ్ చేస్తాడు...’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు వెస్టిండీస్ క్రికెటర్, ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్...

ఇంతకుముందు కెఎల్ రాహుల్, షేన్ వాట్సన్ కూడా ఆర్‌సీబీ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ వంటి స్టార్ ప్లేయర్ల మధ్య ఉండడంతో గాలి ఆడేది కాదని, బయటికి వచ్చాక స్వేచ్ఛగా ఆడగలుగుతున్నామని కామెంట్ చేశాడు రాహుల్, వాట్సన్.. 

click me!