సచిన్, విరాట్‌ల లెగసీని అతడు ముందుకు తీసుకెళ్తాడు : మాజీ సెలక్టర్ కామెంట్స్

First Published Jan 27, 2023, 7:33 PM IST

కొంతకాలంగా భారత క్రికెట్ జట్టుకు ఆడుతున్నా ఇటీవలే శ్రీలంక, న్యూజిలాండ్ తో సిరీస్ లలో   సెంచరీల మీద సెంచరీలు బాదిన  టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పై   మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఏడాదికాలంగా  భారత వన్డే జట్టులో నిలకడగా రాణిస్తున్న టీమిండియా యువ సంచలనం శుభమన్ గిల్  గత ఆరు వన్డేలలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. కెప్టెన్, టీమ్ మేనేజ్మెంట్ లు అందిస్తున్న మద్దతుతో  గిల్   వరుసగా  సెంచరీలు బాదుతూ   టీమిండియాకు ఫ్యూచర్ స్టార్ అని  ప్రశంసలు అందుకుంటున్నాడు. 

గిల్  ప్రదర్శనలపై  మాజీ క్రికెటర్లు విశ్లేషణలు చేస్తున్న వేళ..  గతంలో టీమిండియాకు ఆడి  సెలక్టర్ గా కూడా  పనిచేసిన  సబా కరీం  కూడా గిల్ ను ప్రశంసల్తో ముంచెత్తాడు.  భారత క్రికెట్ లో దిగ్గజాలుగా వెలుగొందుతున్న సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తర్వాత వారి వారసత్వాన్ని గిల్ ముందుకుతీసుకెళ్తాడని  అన్నాడు. 

ఓ జాతీయ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కరీం మాట్లాడుతూ.. ‘గిల్ బ్యాటింగ్ లో టెక్నిక్ ఉంది. అతడు నానాటికీ మెరుగవుతున్నాడు.   భారత్ కు  సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల తర్వాత ఆ వారసత్వాన్ని  గిల్ ముందుకు తీసుకెళ్తాడు.   అయితే స్వదేశంలో గిల్  అద్భుతంగా రాణిస్తున్నాడు. 

కానీ అసలైన పరీక్ష విదేశాల్లోనే ఉంటుంది. ఇంగ్లాండ్ లో గిల్ కు చెత్త రికార్డు ఉంది.  టెస్టులలో అతడు దారుణంగా విఫలమయ్యాడు.  కానీ విదేశాల్లో  మెరుగ్గా ఆడితేనే  భారత జట్టు బ్యాటింగ్ కు వెన్నెముకగా మారతాడు.  గిల్  బ్యాటింగ్ లో మంచి నైపుణ్యముంది. భవిష్యత్ లో  కఠిన ప్రత్యర్థుల మీద అతడు  ఎలా ఆడతాడనేది  చాలా ముఖ్యం. 

టీమిండియా అతడిని కఠిన   పరిస్థితుల్లో పరీక్షించాలి.   బలమైన  ప్రత్యర్థులతో ఆడించాలి. అప్పుడే అతడు రాటుదేలుతాడు.  ప్రస్తుతం అతడు బ్యాటింగ్ లో చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తున్నాడు. రాను రాను అతడు మరింత ఆట మీద మరింత నైపుణ్యం సంపాదిస్తాడు. మెచ్యూరిటీ  వస్తే కొత్త కొత్త షాట్లు ఆడటం.. పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటం   వంటివి అలవడతాయి...’అని చెప్పాడు. 

ఈ నెలలోనే వన్డే ఓపెనర్ గా ప్రమోట్ అయిన గిల్.. శ్రీలంకతో వన్డే సిరీస్ లో  రాణించాడు. తర్వాత  కివీస్ తో వన్డే సిరీస్ లో కూడా  దుమ్ము రేపాడు.  హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో డబుల్ సెంచరీ చేసిన గిల్.. మూడో వన్డేలో   కూడా సెంచరీ చేశాడు. ఈ సిరీస్ లో మొత్తంగా 360 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. 

click me!